Saba Karim: మూడు ఫార్మాట్లలో రాణిస్తున్నారు.. తర్వాతి కెప్టెన్‌ ఎవరంటే..?

భారత క్రికెట్‌ జట్టుకు తర్వాతి కెప్టెన్‌ ఎవరైతే బాగుంటుందో టీమిండియా మాజీ క్రికెటర్‌ సబా కరీం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు......

Published : 23 Aug 2022 02:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత క్రికెట్‌ జట్టుకు తర్వాతి కెప్టెన్‌ ఎవరైతే బాగుంటుందో టీమిండియా మాజీ క్రికెటర్‌ సబా కరీం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మూడు ఫార్మాట్లలో విశేషంగా రాణిస్తున్న ఇద్దరి పేర్లను ఆయన ప్రస్తావించారు. వారే కేఎల్‌ రాహుల్‌, రిషభ్‌ పంత్‌. ‘ఒకే ఆటగాడిని అన్ని ఫార్మాట్లకు కెప్టెన్‌గా కొనసాగించాలా లేదా అనేది సెలెక్టర్లు ముందుగా గుర్తించాలని నేను భావిస్తున్నా. అదే జరిగితే ఇద్దరి గురించి ప్రస్తావించవచ్చు. మొదటి ఎంపిక కేఎల్‌ రాహుల్‌. అతడు అన్ని ఫార్మాట్లలో ఆడుతున్నాడు. రెండోది రిషభ్‌ పంత్‌. గత కొద్దికాలంగా అతడు అసాధారణ రీతిలో చెలరేగుతున్నాడు. అద్భుతమైన వైట్ బాల్ ప్లేయర్‌గా కూడా ఎదిగాడు’ అని అన్నాడు.

ఓ టీవీ ఛానెల్‌లో ప్రసారమయ్యే ‘స్పోర్ట్స్‌ ఓవర్‌ ది టాప్‌’ కార్యక్రమంలో సబా కరీం మాట్లాడాడు. ‘గాయం కారణంగా రోహిత్ శర్మ ఎంతకాలం కొనసాగగలడు అనేది ప్రధాన అంశం. కాబట్టి, ఈ విషయాలను కూడా పరిగణించాలి. ఓ యువ నాయకుడి గురించి అన్వేషిస్తే రిషభ్‌ పంత్‌ సరైన ఎంపిక. ఎందుకంటే అతడు చాలా ఏళ్లపాటు మూడు ఫార్మాట్లలో ఎంతో క్రికెట్‌ ఆడాల్సి ఉంది. భారత సెలక్టర్ల ముందున్న ప్రత్యామ్నాయాలు ఈ ఇద్దరు’ అని మాజీ ఆటగాడు చెప్పుకొచ్చాడు.

కాగా రాహుల్‌కు, రిషభ్ పంత్‌కు ఇదివరకే టీమ్‌ఇండియాను నడిపించిన అనుభవం ఉంది. జనవరిలో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టుతోపాటు వన్డే సిరీస్‌కు కూడా రాహుల్‌ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. ప్రస్తుతం జింబాబ్వేతో జరుగుతున్న సిరీస్‌కు కూడా అతడే సారథి. భారత ప్రీమియర్‌ లీగ్‌లో కొత్త జట్టు గుజరాత్‌కు సారథ్య బాధ్యతలు వహిస్తున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌కు పంత్‌ కెప్టెన్సీ వహించాడు. 2-2తో ఇరు జట్టు సమానంగా ఉండగా.. నిర్ణయాత్మక ఐదో మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దవడంతో సిరీస్‌ సమమైంది. భారత ప్రీమియర్‌ లీగ్‌లో అతడు దిల్లీని నడిపిస్తున్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని