IND vs AUS: మూడో వన్డేలో సూర్యకుమార్‌ని తప్పిస్తారా? రోహిత్‌ ఏమన్నాడంటే..

ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి రెండు వన్డేల్లో సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav) డకౌట్ అయ్యాడు. దీంతో అతడిని మూడో వన్డేకు దూరంగా ఉంచాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ  (Rohit Sharma) మాట్లాడాడు.

Published : 20 Mar 2023 21:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్: టీమ్‌ఇండియా బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav) టీ20ల్లో మాదిరిగా వన్డేల్లో రాణించలేకపోతున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌ల్లోనూ విఫలమయ్యాడు.  రెండు సందర్భాల్లోనూ మిచెల్ స్టార్క్‌ బౌలింగ్‌లో తాను ఎదుర్కొన్న తొలి బంతికే వికెట్ల ముందు దొరికిపోయాడు. ఇప్పటివరకు 22 మ్యాచ్‌ల్లో 20 ఇన్నింగ్స్‌లు ఆడిన సూర్యకుమార్‌.. కేవలం 25.47 సగటుతో 433 పరుగులు చేశాడు. రెండు అర్ధ సెంచరీలు చేయగా.. ఒక్కసారి కూడా మూడంకెల స్కోరు అందుకోలేదు. దీంతో సూర్యకుమార్‌ యాదవ్‌ను వన్డేల నుంచి తప్పించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సూర్యకుమార్‌కు టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) మద్దతుగా నిలిచాడు. సూర్యకుమార్‌కు తన లోపాల గురించి బాగా తెలుసని, అతడు వన్డేల్లో తిరిగి అద్భుతంగా పుంజుకుంటాడని ధీమా వ్యక్తం చేశాడు.

‘‘శ్రేయస్‌ అయ్యర్‌ తిరిగి జట్టులోకి ఎప్పుడు వస్తాడో మాకు తెలీదు. అప్పటి వరకు అయ్యర్‌ స్ధానంలో సూర్యకుమార్‌ యాదవ్‌ ఆడతాడు. సూర్య పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అద్భుతమైన ఆటగాడు. రాణించే సత్తా ఉన్న ఆటగాళ్లు కుదురుకోవడానికి కాస్త సమయం ఇవ్వాలి. అయితే, వన్డే ఫార్మాట్‌లో అతడు చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ఆ విషయం సూర్యకి కూడా తెలుసు. అతడు తన లోపాలను సరిదిద్దుకుని రాబోయే మ్యాచ్‌ల్లో మెరుగ్గా రాణిస్తాడని ఆశిస్తున్నాను. అతడు ఈ రెండు మ్యాచ్‌లతో పాటు ముందు సిరీస్‌లలో రాణించలేదన్న సంగతి నాకు కూడా నాకు తెలుసు. అతడు మరో 8-10 మ్యాచ్‌లు ఆడితే సౌకర్యవంతంగా ఉంటాడు. ప్రస్తుతం ఎవరైనా ఆటగాడు అందుబాటులో లేకపోతేనో, గాయపడితేనో తుదిజట్టులో చోటు దక్కించుకుంటున్నాడు. ప్లేయింగ్ XIలో కుదురుకున్నాక అతడి ఆటతీరును మేనేజ్‌మెంట్ పరిశీలిస్తుంది. నిలకడగా రాణించకపోతే జట్టు నుంచి తప్పించే ఆలోచన చేస్తాం. ప్రస్తుతం అలాంటి ఆలోచన చేయట్లేదు’’ అని రోహిత్ శర్మ వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని