T20 World Cup: కంగారూలను ఇంటికి పంపిస్తారా..!

టీ20 ప్రపంచకప్‌లో ఓ ఆసక్తికర పోరుకు వేళైంది. అజేయంగా సాగుతూ సెమీఫైనల్లో స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకున్న టీమ్‌ఇండియా.. ముందంజ వేసేందుకు చెమటోడుస్తోన్న ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది.

Updated : 24 Jun 2024 06:47 IST

ఆసీస్‌తో భారత్‌ పోరు నేడు
రాత్రి 8 నుంచి
 

టీ20 ప్రపంచకప్‌లో ఓ ఆసక్తికర పోరుకు వేళైంది. అజేయంగా సాగుతూ సెమీఫైనల్లో స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకున్న టీమ్‌ఇండియా.. ముందంజ వేసేందుకు చెమటోడుస్తోన్న ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. ఒకరకంగా ఈ టోర్నీలో కంగారూల భవిష్యత్తు రోహిత్‌సేన చేతుల్లో ఉంది. ఈ మ్యాచ్‌లో ఓడితే ఆసీస్‌ సెమీస్‌ చేరడం కష్టమే. తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఆ జట్టుకు రెట్టించిన ఉత్సాహంతో ఉన్న భారత్‌ను నిలువరించడం సవాలే. మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది.

గ్రాస్‌ ఐలెట్‌

టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా తన చివరి సూపర్‌-8 మ్యాచ్‌ (గ్రూప్‌-1)లో సోమవారం ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. భారత్‌ వరుసగా మూడో మ్యాచ్‌లోనూ గెలిస్తే గ్రూప్‌ టాపర్‌గా నిలవడమే కాకుండా.. సెమీఫైనల్లో అడుగుపెడుతుంది. రోహిత్‌సేనకు సెమీస్‌లో స్థానం ఇప్పటికే దాదాపుగా ఖాయమైనప్పటికీ.. ఈ మ్యాచ్‌లోనూ నెగ్గితే నేరుగా ముందంజ వేస్తుంది. మరోవైపు అఫ్గానిస్థాన్‌ చేతిలో అనూహ్య ఓటమి కారణంగా.. సెమీస్‌ చేరాలంటే ఈ మ్యాచ్‌లో గెలవడం కంగారూలకు తప్పనిసరైంది. గత ఏడాది వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ సహా ఐసీసీ ఈవెంట్లలో ఎన్నోసార్లు కంగారూల చేతుల్లో పరాజయం పాలైన భారత్‌కు... ఈసారి ఆ జట్టును త్వరగా ఇంటికి పంపించేందుకు ఇదో చక్కని అవకాశం.

జోరుమీద భారత్‌

అన్ని విభాగాల్లోనూ ఊపందుకున్న టీమ్‌ఇండియా నాకౌట్‌కు ముందు ఆస్ట్రేలియాను మట్టికరిపించాలనే పట్టుదలతో ఉంది. రోహిత్, కోహ్లి ఉపయుక్తమైన ఇన్నింగ్స్‌లు ఆడి గత మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై మంచి ఆరంభాన్నే ఇచ్చారు. అఫ్గాన్‌పై కీలక దశలో నిలబడి చక్కని ఇన్నింగ్స్‌ ఆడడం ద్వారా తన విమర్శకులకు దూబె జవాబిచ్చాడు. వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌ ఫామ్‌ జట్టుకు సంతోషాన్నిచ్చే విషయమే. ఈ టోర్నీలో భారత్‌కు అన్నింటికంటే పెద్ద సానుకూలాంశం మాత్రం ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య రాణిస్తుండడమే. బ్యాటుతోనూ, బంతితోనూ అతడు కీలక పాత్ర పోషిస్తున్నాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ గత మ్యాచ్‌లో విఫలమైనా.. అంతకుముందు రెండు మ్యాచ్‌ల్లో అర్ధశతకాలతో మంచి ఫామ్‌లోనే ఉన్నాడు. ఇక బౌలింగ్‌ విభాగంలో ఎప్పటిలాగే స్పీడ్‌స్టర్‌ బుమ్రా భారత్‌కు పెద్ద భరోసా. అర్ష్‌దీప్‌ కూడా సత్తా చాటుతున్నాడు. స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ కూడా చక్కని బౌలింగ్‌తో ప్రత్యర్థులను దెబ్బతీయడంలో ఎంతో విలువైన పాత్ర పోషిస్తున్నాడు. ఈ మ్యాచ్‌కు భారత జట్టులో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు.

ఒత్తిడిలో వాళ్లు..

సెమీఫైనల్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే విజయం తప్పనిసరైన నేపథ్యంలో ఆస్ట్రేలియా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. బంగ్లాదేశ్‌పై గెలిచి .. అఫ్గానిస్థాన్‌ చేతిలో పరాజయంపాలైన ఆ జట్టుకు సమస్యలెన్నో. ఆఫ్గాన్‌పై బ్యాటుతో కంగారూల ప్రదర్శన పేలవం. 149 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేకపోయింది. హెడ్, వార్నర్, మ్యాక్స్‌వెల్‌ల మీద ఆ జట్టు ఆశలు పెట్టుకుంది. కెప్టెన్‌ మార్ష్‌ ఫామ్‌ అందుకోవడం ఆసీస్‌కు చాలా కీలకం. అయితే ఎన్నోసార్లు ఐసీసీ టోర్నీల్లో క్లిష్టపరిస్థితులను అధిగమించిన చరిత్ర ఉన్న ఆస్ట్రేలియాను తక్కువ అంచనా వేస్తే పొరపాటే. అఫ్గానిస్థాన్‌తో పోరులో ఆసీస్‌.. మిచెల్‌ స్టార్క్‌ను కాదని అదనపు స్పిన్నర్‌ (అస్టాన్‌ అగర్‌)ను తీసుకుంది. కానీ ఈసారి అగర్‌ను పక్కన పెట్టి స్టార్క్‌నే ఆడించే అవకాశముంది.

తుది జట్లు (అంచనా)... భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), కోహ్లి, పంత్, సూర్యకుమార్, శివమ్‌ దూబె, హార్దిక్, అక్షర్, జడేజా, అర్ష్‌దీప్, కుల్‌దీప్‌ యాదవ్, బుమ్రా         

ఆస్ట్రేలియా: హెడ్, వార్నర్, మిచెల్‌ మార్ష్‌ (కెప్టెన్‌), మ్యాక్స్‌వెల్, స్టాయినిస్, టిమ్‌ డేవిడ్, వేడ్, కమిన్స్, స్టార్క్, జంపా, హేజిల్‌వుడ్‌ 

3-2

టీ20 ప్రపంచకప్‌లలో ఆస్ట్రేలియాపై భారత్‌ గెలుపు ఓటముల రికార్డు. రెండు జట్లు చివరిసారి 2016లో పొట్టికప్పులో తలపడ్డాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు