Virat Kohli: కోహ్లి జోరు అందుకునేనా..

ఐర్లాండ్‌ను చిత్తుచేసి.. పాకిస్థాన్‌ ముప్పును దాటి.. అమెరికాపై ఆధిపత్యంతో టీ20 ప్రపంచకప్‌లో సూపర్‌-8 చేరిన టీమ్‌ఇండియా.. మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. తన చివరి గ్రూప్‌ మ్యాచ్‌లో శనివారం కెనడాతో తలపడనుంది.

Updated : 15 Jun 2024 07:26 IST

కళ్లన్నీ అతడిపైనే
నేడు కెనడాతో భారత్‌ ఢీ
లాడర్‌హిల్‌

ఐర్లాండ్‌ను చిత్తుచేసి.. పాకిస్థాన్‌ ముప్పును దాటి.. అమెరికాపై ఆధిపత్యంతో టీ20 ప్రపంచకప్‌లో సూపర్‌-8 చేరిన టీమ్‌ఇండియా.. మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. తన చివరి గ్రూప్‌ మ్యాచ్‌లో శనివారం కెనడాతో తలపడనుంది. పసికూన లాంటి ప్రత్యర్థిపై బలమైన రోహిత్‌ సేన విజయంపై అనుమానాల్లేవ్‌! కానీ ప్రపంచకప్‌లో తేలిపోతున్న కోహ్లీపైనే అందరి కళ్లూ ఉన్నాయి. ఈ మ్యాచ్‌తో అతను తిరిగి ఫామ్‌ అందుకుంటే కీలకమైన సూపర్‌-8కు ముందు జట్టుకు బెంగ తీరిపోతుంది. అయితే వర్షం ముప్పుతో ఈ మ్యాచ్‌ సాగడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

టీ20 ప్రపంచకప్‌ గ్రూప్‌- ఎలో భారత్‌ చివరి మ్యాచ్‌ నేడే. శనివారం కెనడాను ఢీకొంటున్న టీమ్‌ఇండియా భారీ విజయంతో ఘనంగా గ్రూప్‌ దశను ముగించి సూపర్‌-8 కోసం వెస్టిండీస్‌ వెళ్లాలని చూస్తోంది. న్యూయార్క్‌లో అస్థిర బౌన్స్‌కు సహకరించి, మందకొడిగా వ్యవహరించిన పిచ్‌పై వరుసగా మూడు మ్యాచ్‌లాడిన భారత్‌.. ఈ పోరును ఫ్లోరిడాలో ఆడబోతోంది. కీలకమైన సూపర్‌-8కు ముందు ఈ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లోనూ దూకుడు కొనసాగించాలన్నది రోహిత్‌  సేన లక్ష్యం. టీమ్‌ఇండియా, కెనడాకు మధ్య  ఇదే తొలి టీ20 మ్యాచ్‌. 

విరాట్‌ నిలిచేనా?: టైటిల్‌ ఫేవరెట్లలో ఒకటిగా పొట్టి కప్‌లో అడుగుపెట్టిన భారత్‌.. వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ స్ఫూర్తిదాయక ప్రదర్శనే చేసింది. ఐర్లాండ్‌ను చిత్తుచేసి టోర్నీని ఘనంగా ఆరంభించిన టీమ్‌ఇండియా.. ఆ తర్వాత పాకిస్థాన్, అమెరికాతో మ్యాచ్‌ల్లో ప్రతికూల పరిస్థితులను దాటి విజయాలను అందుకుంది. బ్యాటింగ్‌లో రోహిత్, పంత్, సూర్యకుమార్, శివమ్‌ దూబె ఆకట్టుకున్నారు. ఐర్లాండ్‌పై రోహిత్, అమెరికాపై సూర్య కీలక అర్ధశతకాలు చేశారు. ఐర్లాండ్, పాకిస్థాన్‌పై పంత్‌ వరుసగా 36, 42 పరుగుల ఇన్నింగ్స్‌ ఆడాడు. యుఎస్‌తో మ్యాచ్‌లో దూబె కూడా లయ అందుకున్నాడు. కానీ ఆందోళనంతా కోహ్లి బ్యాటింగ్‌ గురించే. రోహిత్‌తో కలిసి ఓపెనింగ్‌ చేస్తున్న విరాట్‌ వరుసగా విఫలమవుతున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో టాప్‌స్కోరర్‌గా నిలిచిన అతను ప్రపంచకప్‌లో మాత్రం అంచనాలను అందుకోలేకపోతున్నాడు. తొలి మూడు మ్యాచ్‌ల్లో కలిపి 5 పరుగులే చేశాడు. అమెరికాపై తొలి బంతికే డకౌటయ్యాడు. ఇలాంటి వైఫల్యాల నుంచి కోలుకోవడం కోహ్లీకి కొత్తేమీ కాదు. న్యూయార్క్‌లోని కఠినమైన పిచ్‌పై కొత్తబంతిని అంచనా వేయడంలో తడబడ్డ అతను ఫ్లోరిడాలో కెనడాతో మ్యాచ్‌లో పుంజుకోవాలన్నది జట్టు ఆశ. రోహిత్‌తో కలిసి అతను జట్టుకు మెరుపు ఆరంభాన్ని అందిస్తే కీలకమైన సూపర్‌-8కు ముందు అది జట్టు ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుందనడంలో సందేహం లేదు. ఒకవేళ ఈ మ్యాచ్‌ కోసం బ్యాటింగ్‌ ఆర్డర్లో మార్పులు చేయాలని జట్టు భావిస్తే యశస్వి జైస్వాల్‌ ఓపెనర్‌గా ఆడే అవకాశముంది. అప్పుడు కోహ్లి తిరిగి మూడో స్థానంలోకి వెళ్తాడు. దూబెకు చోటు ఉండదు. 

పేస్‌ అదుర్స్‌: బౌలింగ్‌లో టీమ్‌ఇండియా పటిష్ఠంగా కనిపిస్తోంది. బుమ్రా (5 వికెట్లు), అర్ష్‌దీప్‌ సింగ్‌ (7), హార్దిక్‌ పాండ్య (7) పేస్‌తో హడలెత్తిస్తున్నారు. పరిస్థితులను చక్కగా ఉపయోగించుకుంటూ సత్తాచాటుతున్నారు. అయితే సిరాజ్‌ ప్రభావం చూపలేకపోతుండటం ఒక్కటే కాస్త కలవరపరిచే అంశం. ఈ మ్యాచ్‌తో సిరాజ్‌ కూడా వికెట్ల వేటలో సాగితే జట్టుకు ఏ ఇబ్బంది ఉండదు. స్పిన్నర్లు అక్షర్, జడేజా కూడా మరింత మెరుగ్గా రాణించాల్సి ఉంది. జడేజా టోర్నీలో ఇప్పటివరకూ ఒక్క వికెట్టూ తీయలేదు. ఈ మ్యాచ్‌ కోసం స్పిన్‌ విభాగంలో భారత్‌ మార్పులు చేసే ఆస్కారముంది. కుల్‌దీప్, చాహల్‌లో ఒకరిని లేదా ఇద్దరినీ ఆడించొచ్చు. సూపర్‌- 8 మ్యాచ్‌లను విండీస్‌లోని స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లపై భారత్‌ ఆడబోతుంది కాబట్టి కెనడాపై ఈ స్పిన్నర్లను పరీక్షించే ఛాన్స్‌ ఉంది. మరోవైపు టీ20 ప్రపంచకప్‌ అరంగేట్ర జట్టు కెనడా ఈ మ్యాచ్‌ను గొప్ప అవకాశంగా భావిస్తోంది. ఐర్లాండ్‌పై విజయంతో అదరగొట్టిన ఆ జట్టు భారత్‌కు గట్టిపోటీనిచ్చి తమ సత్తాను చాటాలని చూస్తోంది. సూపర్‌- 8 రేసు నుంచి నిష్క్రమించిన కెనడాకు బ్యాటింగ్‌లో ఆరోన్, బౌలింగ్‌లో దిలాన్‌ కీలకమవనున్నారు.


మ్యాచ్‌ జరిగేనా? 

భారీ వర్షాలు, వరదల కారణంగా ఈ మ్యాచ్‌ జరగడం అనుమానంగా మారింది. తుపాను కారణంగా మ్యాచ్‌ జరిగే లాడర్‌హిల్‌ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న మియామిని వరదలు ముంచెత్తాయి. మ్యాచ్‌ జరిగే బ్రోవార్డ్‌ కౌంటీలోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. నేడు కూడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసేందుకు 86 శాతం అవకాశముందని అంచనా. మంగళవారం ఇక్కడ జరగాల్సిన నేపాల్, శ్రీలంక మ్యాచ్‌ వర్షంతో రద్దయింది. శుక్రవారం అమెరికా, ఐర్లాండ్‌ మ్యాచ్‌ కూడా వర్షార్పణమైంది. ఒకవేళ మ్యాచ్‌ జరిగితే వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ పిచ్‌ ఎలా స్పందిస్తుందో చూడాలి. సాధారణంగా అయితే ఈ పిచ్‌ బ్యాటర్లకే అనుకూలం. ఇక్కడే 2016లో జరిగిన భారత్, వెస్టిండీస్‌ టీ20 మ్యాచ్‌లో రెండు జట్లూ 240కి పైగా పరుగులు చేశాయి. టాస్‌ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్‌కే మొగ్గు చూపే ఆస్కారముంది. ఇక్కడ జరిగిన 16 టీ20ల్లో 11 సార్లు మొదట బ్యాటింగ్‌ చేసిన జట్టు గెలిచింది.

తుది జట్లు (అంచనా)..

భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), కోహ్లి, పంత్, సూర్యకుమార్, శివమ్‌ దూబె, హార్దిక్, జడేజా/కుల్‌దీప్, అక్షర్‌/చాహల్, బుమ్రా, అర్ష్‌దీప్, సిరాజ్‌. 

కెనడా: ఆరోన్, నవ్‌నీత్, పర్గత్, నికోలస్, శ్రేయస్, రవిందర్‌పాల్, సాద్‌ బిన్‌ జాఫర్‌ (కెప్టెన్‌), దిలాన్, ఖలీమ్‌ సాన, జునైద్, గోర్డాన్‌.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని