Wimbledon: ప్లేయర్ల ప్రైవసీ కోసం వింబుల్డన్‌లో తొలిసారి ‘AI’

టెన్నిస్ క్రీడాకారుల ఆన్‌లైన్‌ ప్రైవసీని కాపాడేందుకు వింబుల్డన్ నిర్వాహకులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ‘ఏఐ’ని పరిచయం చేశారు.

Published : 07 Jul 2024 13:17 IST

ఇంటర్నెట్ డెస్క్‌: మెగా టోర్నీల సందర్భంగా టెన్నిస్ ప్లేయర్లపై (Tennis Players) అనుచిత వ్యాఖ్యలు, వీడియోలు, నెట్టింట అసభ్యకరమైన వేధింపులకు దిగడం పరిపాటిగా మారిపోయింది. ఇలాంటి అనుభవం ప్రపంచ ఛాంపియన్‌లకూ ఎదురైంది. టాప్‌ ప్లేయర్లుగా ఉన్న ఎమ్మా రదుకాను, నొవామి ఒసాకా, హారియట్ డార్ట్‌ తదితరులు ఇలా సోషల్ మీడియాలో వేధింపులకు గురైన వారే. మరే ఇతర క్రీడాకారులకూ ఇలాంటి అనుభవం రాకూడదనే లక్ష్యంతో వింబుల్డన్ నిర్వాహకులు వినూత్న ఆలోచన చేశారు. తొలిసారి ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్ (AI)ను వినియోగించడం విశేషం. 

టెన్నిస్‌ ప్లేయర్ల సోషల్ మీడియా ఖాతాలను నిరంతరం గమనిస్తూ.. జాత్యహంకార, లైంగిక, ప్రాణహాని బెదిరింపుల కామెంట్లను AI ఎప్పటికప్పుడు నిలువరిస్తుంది. అందుకోసం 35 భాషల్లో ఈ కామెంట్లను చదవగలిగేలా ఏఐను సిద్ధం చేశారు. క్రీడాకారుల ఆన్‌లైన్‌ వాతావరణం సురక్షితంగా ఉండేందుకు ఆల్‌ఇంగ్లాండ్ లాన్‌ టెన్నిస్ క్లబ్‌ ఈ నిర్ణయం తీసుకుంది. 

బ్రిటన్ టాప్‌ ప్లేయర్ కార్టీ బౌల్టర్ మాట్లాడుతూ.. ‘‘సోషల్ మీడియాలో చాలా సానుకూలాంశాలు ఉన్నాయి. అదే సమయంలో ప్రతికూల కామెంట్లు ఎక్కువగా వస్తున్నాయి. నేను గెలిచానా? లేదా? అనేది పక్కన పెడితే నా సోషల్ మీడియా ఖాతాలను తెరిస్తే చాలా ద్వేషంతో కూడిన మెసేజ్‌లు ఉంటాయి. అలాంటి వాటిని చూస్తే మానసికంగా చాలా కుంగుబాటుకు గురైన సందర్భాలూ ఉన్నాయి’’ అని పేర్కొంది. 

యూఎస్‌ ఓపెన్‌లోనూ.. 

వింబుల్డన్‌ సందర్భంగా అమల్లోకి తీసుకొచ్చిన ‘ఏఐ’ సాంకేతికతను యూఎస్‌ ఓపెన్‌లోనూ వినియోగిస్తామని టోర్నీ డైరెక్టర్ జామీ బాకెర్ వెల్లడించారు. ‘‘పబ్లిక్‌ డొమైన్‌లో మీరు చూడలేరు. సోషల్ మీడియాలో వచ్చే కంటెంట్‌ను నిరంతరం గమనిస్తూనే ఉంటాం. ఏ ఆటగాడూ ఇక నుంచి అసభ్యకరమైన వేధింపులకు సంబంధించి ఆందోళనకు గురి కాకుండా చూస్తాం. సెక్యూరిటీ టీమ్‌ అందుకోసం తీవ్రంగా శ్రమిస్తోంది’’ అని బాకెర్ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని