ట్రోఫీలు నెగ్గడం ప్రామాణికం కాదు: గంభీర్‌

ఐసీసీ ట్రోఫీలు గెలవడాన్ని బట్టి ఆ జట్టు ఉత్తమమైనది అని చెప్పకూడదని, అది అస్సలు ప్రామాణికమే కాదని టీమిండియా మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ అభిప్రాయపడ్డాడు.

Published : 03 Apr 2021 01:30 IST

 

ఇంటర్నెట్ డెస్క్‌: ఐసీసీ ట్రోఫీలు గెలిచినంత మాత్రన ఆ జట్టు ఉత్తమమైన్న నిర్ణయానికి రాకూడదని, అది అసలు ప్రామాణికమే కాదని అంటున్నాడు టీమిండియా మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్. అందుకు గల కారణాలను వివరించాడు.

‘‘2011లో భారత్ వన్డే ప్రపంచకప్‌ విజేతగా నిలిచింది. అదే సంవత్సరం ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లో ఘోరంగా విఫలమైంది. 2013లో భారత్ ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలిచిన తర్వాత జరిగిన ఐసీసీ టోర్నీల్లో విజేతగా నిలవలేదు. ఆస్ట్రేలియాలో రెండుసార్లు చారిత్రాత్మక సిరీస్‌ల్లో విజయం సాధించింది. అంతేకాకుండా ఐసీసీ మొదటి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్ ఫైనల్‌కు చేరింది. ఇక న్యూజిలాండ్‌ విషయానికొస్తే ఆ జట్టు ఇప్పటివరకు ఒక్క ఐసీసీ ట్రోఫీని గెలవలేదు. కాని ఇప్పటికీ అది అద్భుతమైన జట్టు. ఒక జట్టు ఉత్తమమైందా, కాదా అని చెప్పడానికి ఆ జట్టు ఐసీసీ ట్రోఫీలు నెగ్గిందా లేదా అనేది అస్సలు ప్రామాణికం కాదు. విదేశీ గడ్డలపై నిలకడగా ఆడుతూ ప్రత్యర్థి జట్లపై అధిపత్యం చెలాయించి విజయాలు సాధించడంపై అది ఆధారపడి ఉంటుంది’’ అని గంభీర్‌ అన్నాడు.

‘‘నా కెరీర్‌లో నేను ఉన్నతస్థితికి చేరుకుంటున్నప్పుడు ప్రపంచకప్‌ జట్టులో భాగంగా ఉండాలనుకున్నాను. కానీ, భారత క్రికెట్ ఎన్నో ఘనతలను సాధించిన కొంతమంది ప్రపంచకప్‌ జట్టులో భాగం కాలేకపోయారు. ప్రపంచకప్‌ ఆడాలనే కలను సాకారం చేసుకునేందుకు ఎంతోమంది ఏళ్ల తరబడిగా సాధన చేస్తుంటారు’’ అని గౌతీ పేర్కొన్నాడు. 2011 వన్డే ప్రపంచ కప్‌ ఫైనల్‌లో గంభీర్‌ 97 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు