BCCI: దక్షిణాఫ్రికాలో కరోనా విజృంభణ.. టీమ్‌ఇండియా పర్యటనపై సందిగ్ధం.!

దక్షిణాఫ్రికాలో కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో.. టీమ్‌ఇండియా పర్యటనపై సందిగ్ధం నెలకొంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా క్రికెట్‌ (సీఎస్‌ఏ) అధికారులతో చర్చించిన తర్వాతే.. టీమ్‌ఇండియా..

Updated : 26 Nov 2021 20:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్: దక్షిణాఫ్రికాలో కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో.. టీమ్‌ఇండియా పర్యటనపై సందిగ్ధం నెలకొంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వచ్చిన తర్వాత దక్షిణాఫ్రికా క్రికెట్‌ (సీఎస్‌ఏ) అధికారులతో చర్చిస్తామని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. దాని తర్వాతే టీమ్‌ఇండియా పర్యటనపై తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నాయి. డిసెంబరు 17 నుంచి వచ్చే సంవత్సరం జనవరి 26 వరకు టీమ్‌ఇండియా.. దక్షిణాఫ్రికాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా భారత జట్టు దక్షిణాఫ్రికాతో.. మూడు టెస్టులు, మూడు వన్డేలు, 4 టీ20 మ్యాచులు ఆడనుంది. 

‘ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతోన్న టెస్టు సిరీస్‌ ముగిసిన తర్వాత డిసెంబరు 8న గానీ, 9న గానీ దక్షిణాఫ్రికా బయలు దేరాలని గతంలో నిర్ణయించాం. అయితే, దక్షిణాఫ్రికాలో కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో టీమ్‌ఇండియా పర్యటనపై సందిగ్ధం నెలకొంది. మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్న జొహన్నెస్‌ బర్గ్, సెంచూరియన్‌ సమీపంలోని ప్రిటోరియాల్లో కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ ముగిసిన వెంటనే ఆటగాళ్లు ముంబయి నుంచి నేరుగా ఛార్టర్డ్‌ ఫ్లైట్‌లో జొహన్నెస్‌ బర్గ్‌ చేరుకున్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో తప్పనిసరిగా 3-4 రోజులు క్వారంటెయిన్‌లో ఉండాల్సిందే. అందుకే, మ్యాచ్‌ల నిర్వహణపై దక్షిణాఫ్రికా క్రికెట్ అధికారిక వర్గాల నుంచి పూర్తి స్పష్టత వచ్చిన తర్వాతే.. టీమ్‌ఇండియా పర్యటనపై మా నిర్ణయాన్ని వెల్లడిస్తాం’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఇండియా-ఏ జట్టు దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.  

టీమ్‌ఇండియా.. దక్షిణాఫ్రికా షెడ్యూలిదే..

తొలి టెస్టు : డిసెంబరు 17 నుంచి 21 వరకు - జొహన్నెస్ బర్గ్‌

రెండో టెస్టు : డిసెంబరు 26 నుంచి 30 వరకు - సెంచూరియన్‌

మూడో టెస్టు : జనవరి 3 నుంచి 7 వరకు - కేప్‌టౌన్‌

తొలి వన్డే : జనవరి 11న - పార్ల్

రెండో వన్డే : జనవరి 14న - కేప్‌ టౌన్‌

మూడో వన్డే : జనవరి 16న - కేప్‌ టౌన్‌

తొలి టీ20 మ్యాచ్‌ : జనవరి 19న - కేప్ టౌన్‌

రెండో టీ20 మ్యాచ్‌ : జనవరి 21న - కేప్‌ టౌన్‌

మూడో టీ20 మ్యాచ్‌ : జనవరి 23న - పార్ల్

నాలుగో టీ20 మ్యాచ్‌ : జనవరి 26న - పార్ల్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని