INDW vs AUSW: ఆసీస్‌ చేతిలోనూ భారత్ ఓటమి.. ప్రపంచకప్‌లో ఇకపై అన్నీ గెలవాల్సిందే!

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా మరో ఓటమి చవిచూసింది. ఆస్ట్రేలియాతో గెలవాల్సిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది...

Updated : 19 Mar 2022 14:43 IST

(Photo: Australia Womens cricket Twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా మరో ఓటమి చవిచూసింది. ఆస్ట్రేలియాతో గెలవాల్సిన మ్యాచ్‌లో పరాజయం పాలైంది. మిథాలీ సేన నిర్దేశించిన 278 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 49.3 ఓవర్లలో ఛేదించింది. ఆసీస్‌ టాప్‌ ఆర్డర్‌ మొత్తం రాణించడంతో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్లు రేచల్‌ హేన్స్‌ (43; 53 బంతుల్లో 5x4), అలిస్సా హేలీ (72; 65 బంతుల్లో 9x4) శుభారంభానికి తోడు కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ (97; 107 బంతుల్లో 13x4) భారీ స్కోర్‌ చేసింది. మధ్యలో ఎల్లీసి పెర్రి (28; 51 బంతుల్లో 1x4) కెప్టెన్‌కు సహకరించగా.. చివర్లో బెత్‌ మూనీ (30 నాటౌట్‌; 20 బంతుల్లో 4x4) ధాటిగా ఆడి ఆసీస్‌ను విజయ తీరాలకు చేర్చింది. ఈ ఓటమితో టీమ్‌ఇండియా ఇకపై ప్రపంచకప్‌లో ప్రతి మ్యాచ్‌ గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ఆసీస్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతూ సెమీస్‌కు చేరువైంది.

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 7 వికెట్ల నష్టానికి 277 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన (10), షెఫాలీ వర్మ (12) విఫలమైనా.. కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ (68; 96 బంతుల్లో 4x4, 1x6), యస్తిక భాటియా (59; 83 బంతుల్లో 6x4), హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ (57 నాటౌట్‌; 47 బంతుల్లో 6x4) అర్ధ శతకాలతో రాణించారు. చివర్లో పూజా వస్త్రాకర్‌ (34; 28 బంతుల్లో 1x4, 2x6) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడటంతో.. టీమ్‌ఇండియా కంగారూల ముందు మంచి లక్ష్యాన్నే నిర్దేశించింది. అయితే, బౌలింగ్‌లో గాడి తప్పిన భారత్‌ను ఆసీస్‌ మహిళలు ఆటాడుకున్నారు. చివరికి మూడు బంతులు మిగిలుండగానే విజయం సాధించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని