INDW vs SAW: రాణించిన భారత బ్యాటర్లు.. దక్షిణాఫ్రికా ముందు భారీ లక్ష్యం

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా బ్యాటర్లు సమష్టిగా రాణించారు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరి లీగ్‌ మ్యాచ్‌లో...

Published : 27 Mar 2022 10:07 IST

(Photo: BCCI Women Twitter)

క్రైస్ట్‌చర్చ్‌‌: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా బ్యాటర్లు సమష్టిగా రాణించారు. దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న చివరి లీగ్‌ మ్యాచ్‌లో నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 274 పరుగులు చేశారు. దీంతో ప్రోటియాస్‌ ముందు 275 పరుగుల మంచి లక్ష్యాన్ని నిర్దేశించారు. తొలుత ఓపెనర్లు స్మృతి మంధాన (71; 84 బంతుల్లో 6x4, 1x6), షెఫాలీ వర్మ (53; 46 బంతుల్లో 8x4) అర్ధ శతకాలతో శుభారంభం చేయగా తర్వాత మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటర్లు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ (68; 84 బంతుల్లో 8x4), హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ (48; 57 బంతుల్లో 4x4) మెరిశారు.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమ్‌ఇండియాకు ఓపెనర్లు మంచి భాగస్వామ్యం అందించారు. తొలి వికెట్‌కు స్మృతి, షెఫాలీ 91 పరుగులు జోడించారు. అయితే, అర్ధ శతకం తర్వాత షెఫాలీ రనౌటైంది. కాసేపటికే వన్‌డౌన్‌ బ్యాటర్‌ యాస్తిక భాటియా (2) విఫలమైంది. తర్వాత క్రీజులోకి వచ్చిన మిథాలీ.. స్మృతితో కలిసి నిలకడగా ఆడింది. వీరిద్దరూ మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడారు. ఈ క్రమంలోనే మూడో వికెట్‌కు 80 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే, భారత్‌ స్కోర్‌ 176 పరుగుల వద్ద స్మతి మూడో వికెట్‌గా వెనుదిరగ్గా స్కోర్‌ నెమ్మదించింది. అయినా, మిథాలీ అర్ధ శతకంతో రాణించింది. కానీ స్వల్ప వ్యవధిలో మిథాలీ, పూజా వస్త్రాకర్‌(3) ఔటయ్యారు. ఆపై హర్మన్‌ ప్రీత్‌కౌర్‌, రీచా ఘోష్‌(8) ధాటిగా ఆడే ప్రయత్నం చేశారు. కానీ, దక్షిణాఫ్రికా బౌలర్లు చివర్లో చెలరేగడంతో భారత్‌ 274/7తో సరిపెట్టుకుంది. మసాబటా క్లాస్‌, షబ్నిమ్‌ ఇస్మైల్ చెరో రెండు వికెట్లు తీయగా.. క్లో ట్రియన్‌, అయాబొంగా ఖాకా తలో వికెట్‌ పడగొట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని