Ashleigh Barty : టెన్నిస్‌కు గుడ్‌బై.. టాప్‌ ర్యాంకర్‌ బార్టీ సంచలన నిర్ణయం

మహిళల విభాగంలో నంబర్‌ వన్‌గా అత్యంత ఎక్కువ రోజులు ఉన్న...

Updated : 23 Mar 2022 10:24 IST

 సోషల్‌ మీడియా వేదికగా వెల్లడి 

ఇంటర్నెట్ డెస్క్ : మహిళల టెన్నిస్ ప్రపంచ నంబర్‌ వన్ ర్యాంకర్‌ యాష్లే బార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. 25 ఏళ్ల టెన్నిస్‌ క్రీడాకారిణి బార్టీ ప్రొఫెషనల్‌ ఆటకు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించడంతో క్రీడా ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఆస్ట్రేలియాకు చెందిన బార్టీ మూడు గ్రాండ్‌స్లామ్‌లను గెలుచుకుంది. ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ను సొంతం చేసుకున్న ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకోవడమంటే సంచలనమని చెప్పాలి. దాదాపు 44 సంవత్సరాల తర్వాత ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌, 41 ఏళ్ల తర్వాత వింబుల్డన్ గెలిచిన ఆస్ట్రేలియా క్రీడాకారిణిగా యాష్లే రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. రిటైర్‌మెంట్‌పై సోషల్‌ మీడియా వేదికగా ఓ వీడియోను ఆమె పోస్టు చేసింది. 

‘‘ఇలాంటి కఠిన నిర్ణయం ఎలా వెల్లడించాలో అర్థం కావడం లేదు. టెన్నిస్‌కు వీడ్కోలు చెబుతున్నా. అయితే నేను సంతోషంగానే ఉన్నా. అదేవిధంగా దేనికైనా సిద్ధంగా ఉన్నా. సూపర్ గేమ్‌ కోసం నా వంతు కృషి చేశాను. అందుకు ఎంతో ఆనందంగా ఉంది. నా వరకైతే విజయవంతంగా ముగించాను. ఈ సందర్భంగా నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. రిటైర్‌మెంట్ ప్రకటించడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నా. మిగిలిన కలలను నెరవేర్చుకోవడంపై దృష్టిసారిస్తా’’ అని బార్టీ పేర్కొంది. ప్రపంచ టెన్నిస్‌ సంఘం స్పందిస్తూ.. ‘ప్రతి యువ టెన్నిస్‌ క్రీడాకారిణికి స్ఫూర్తిగా నిలుస్తావు. ఆట పట్ల నీకున్న ప్రేమ అమోఘం. ఆన్‌-కోర్టు, ఆఫ్‌-కోర్టులో నీదైన మార్క్‌ను ప్రదర్శించావు’’ అని పోస్టు చేసింది. 

మహిళల విభాగంలో నంబర్‌ వన్‌గా అత్యధిక ఎక్కువ రోజులు ఉన్న నాలుగో ప్లేయర్‌గా బార్టీ రికార్డు అందుకుంది. ప్రస్తుతం 121 వారాల నుంచి ఆమె టాప్‌ ర్యాంక్‌లో కొనసాగుతోంది. స్టెఫీ గ్రాఫ్ (186 వారాలు), సెరెనా విలియమ్స్ (186 వారాలు), మార్టినా నవత్రిలోవా (156 వారాలు) ముందు వరుసలో ఉన్నారు. బార్టీ రిటైర్‌మెంట్ ప్రకటించడంపై క్రీడా ప్రపంచం స్పందించింది. తమతో ఆడిన సందర్భాలను మహిళా ప్లేయర్లు గుర్తుకు తెచ్చుకున్నారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. భవిష్యత్తులో అన్నీ శుభాలే జరగాలని ఆకాంక్షించారు.







Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని