T20 World Cup 2024: గ్రూపులో గర్జించిన కూనలు.. గణాంకాల్లో చిరు జట్లదే హవా..!

ఓడలు బళ్లు.. బళ్లు ఓడలవుతాయంటే ఏమిటో పొట్టి ప్రపంచకప్‌లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ ఫలితాలను చూస్తే తెలుస్తుంది. గతంలో టీ20 ప్రపంచకప్‌ సాధించిన జట్లు కూడా నేడు సూపర్‌-8కు చేరకుండా వెనుదిరుగుతుంటే.. అంతర్జాతీయ క్రికెట్‌కు కొత్తైన జట్లు తెగించి పోరాడి మరీ విజయాలు సాధిస్తున్నాయి. 

Published : 14 Jun 2024 17:29 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అవగాహన ఉన్న.. గతంలో ఆడిన పిచ్‌లపై చెలరేగిపోవడం సీనియర్‌ జట్లకు అలవాటుగా మారింది. కొత్త పిచ్‌లపై మాత్రం అవి కూడా కూలబడిపోతుండగా.. నూతనంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన జట్లు మాత్రం తమ సత్తా చాటుతున్నాయి. ప్రతి గ్రూపులో ఒక బడా జట్టు సూపర్‌-8కు చేరకుండానే ఇంటికిపోయే పరిస్థితి నెలకొంది. గణాంకాల్లో కూడా నూతన జట్ల ఆటగాళ్లే పూర్తి ఆధిపత్యం చూపిస్తున్నారు. భారత్‌, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి అగ్రశ్రేణి జట్ల ఆటగాళ్లు చాలా విభాగాల్లో టాప్‌-5లో కూడా లేరంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. అంటే ఈ టోర్నీ ఎంత ఉత్కంఠగా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. 

ప్రతి గ్రూపులో ఓ బడా జట్టుకు గండమే..

* గ్రూప్‌-ఎలో పాకిస్థాన్‌ జట్టు పరిస్థితి దయనీయంగా మారింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు ఓడిపోయింది. అది సూపర్‌-8కు చేరాలంటే ఇప్పుడు ఫ్లోరెడాలో జరగనున్న యూఎస్‌ఏ-ఐర్లాండ్‌ మ్యాచ్‌ ఫలితంపై ఆధారపడింది.  పాకిస్థాన్‌ 2009లో పొట్టికప్‌ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ గ్రూపులో అమెరికా పరిస్థితి మెరుగ్గా కనిపిస్తోంది.  

*  గ్రూప్‌-బిలో ఇంగ్లాండ్‌ పరిస్థితి కూడా ఓ పట్టాన తేలేట్లు లేదు. తర్వాత మ్యాచ్‌ల్లో స్కాట్లాండ్‌ ఓడిపోయి.. నమీబియాపై ఇంగ్లాండ్‌ గెలిస్తే అవకాశం ఉంటుంది. గతంలో రెండుసార్లు పొట్టికప్‌ అందుకొన్న ఈ జట్టు పరిస్థితి త్రిశంకుస్వర్గంలో వేలాడుతోంది. ఈ గ్రూపులో చిన్నజట్టు అయిన స్కాట్లాండ్‌ రెండో స్థానంలో ఉంది.  

* గ్రూప్‌-సిలో ఆసియా పసికూన అఫ్గానిస్థాన్‌ అన్ని మ్యాచ్‌ల్లో విజయం సాధించి అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత ప్లేస్‌లో వెస్టిండీస్‌ ఉంది. ఈ గ్రూపులో న్యూజిలాండ్‌ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయి అట్టడుగు స్థానంతో సరిపెట్టుకొంది. దీనికంటే ఉగాండ, పాపువా న్యూగినీ జట్లు మెరుగైన స్థితిలో కొనసాగుతున్నాయి. 

* గ్రూప్‌-డిలో దక్షిణాఫ్రికా అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత బంగ్లాదేశ్‌ నిలిచింది. మూడు మ్యాచ్‌ల్లో 1 పాయింట్‌తో శ్రీలంక అట్టడుగుకు చేరింది. నెదర్లాండ్స్‌, నేపాల్‌ దీనికంటే మెరుగైన స్థితిలో ఉన్నాయి. శ్రీలంక కూడా గతంలో ఒక సారి టీ20 ప్రపంచకప్‌ను గెలిచిన జట్టే. 

సూపర్‌ స్టార్లు ఎక్కడా..?

వ్యక్తిగత గణాంకాల్లో అఫ్గాన్‌, అమెరికన్‌ ఆటగాళ్లదే హవా కనిపిస్తోంది. గత వన్డే ప్రపంచకప్‌లో వ్యక్తిగత గణాంకాల్లో టీమ్‌ ఇండియా క్రీడాకారుల హవా స్పష్టంగా కనిపించింది. కానీ, ఈ టోర్నీలో ఇప్పటివరకు అటువంటిది ఏమీ లేకపోవడం గమనార్హం. 

* అత్యధిక పరుగుల్లో అఫ్గానిస్థాన్‌కు చెందిన గుర్బాజ్‌ (167) తొలి స్థానంలో ఉన్నాడు. టాప్‌-5లో భారత ఆటగాళ్లు లేరు.

* అత్యధిక వికెట్ల జాబితాలో అఫ్గాన్‌కు చెందిన ఫారూఖీ (12) ఫస్ట్‌ ప్లేస్‌లో ఉన్నాడు. కానీ, ఇక్కడ ఒక్క అర్ష్‌దీప్‌ సింగ్‌ (7) మాత్రమే జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు.

* ఒక మ్యాచ్‌లో అత్యధిక పరుగులు సాధించినవారి జాబితాలో అమెరికా ఆటగాడు ఆరోన్‌ జోన్స్‌ (94) మొదటి ప్లేస్‌లో ఉన్నాడు. ఈ లిస్ట్‌లో భారత ఆటగాళ్లు టాప్‌-5లో లేరు. అఫ్గాన్‌కు చెందిన ముగ్గురు ఆటగాళ్లు ఉన్నారు. 

* ఒక మ్యాచ్‌లో బెస్ట్‌ బౌలింగ్‌లో అఫ్గానిస్థాన్‌కు చెందిన ఫరూఖీ (5/9) అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ విభాగంలో అర్షదీప్‌సింగ్‌ నాలుగో స్థానంలో నిలిచాడు. ఇప్పటివరకు టోర్నీలో అత్యుత్తమ బౌలింగ్‌ సగటు కూడా ఫరూఖీదే. 

*  ఇక టాప్‌ అర్ధ శతకాల్లో అఫ్గాన్‌కు చెందిన గుర్బాజ్‌ (2) తొలిస్థానం దక్కించుకొన్నాడు. మరో 12 మంది ఆటగాళ్లతో కలిసి రోహిత్‌, సూర్య సంయుక్తంగా రెండో స్థానంలో కొనసాగుతున్నారు.

* పొదుపైన బౌలర్ల జాబితాలోని టాప్‌-5లో ముగ్గురు అఫ్గాన్‌ బౌలర్లే ఉండటం విశేషం. దీనిలో నవీనుల్‌ హక్‌ (2.29) తొలిస్థానంలో నిలవడం విశేషం.  

* అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లలో అమెరికాకు చెందిన ఆరోన్‌ జోన్స్‌ (13) ఫస్ట్‌ ప్లేస్‌లో ఉండగా.. ఆ తర్వాత స్థానంలో గుర్బాజ్‌ (10) నిలిచాడు. ఇక ఫోర్ల జాబితాలో తొలి స్థానం కెనడా ఆటగాడు ఆరోన్‌ జాన్సన్‌ (12) కొనసాగుతున్నాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు