WTC Finals: నిలిచారు దంచికొట్టారు..! 

టెస్టు క్రికెట్‌ అంటేనే సుదీర్ఘమైన ఆట. ఐదు రోజుల పాటు ఇరు జట్లూ పోటాపోటీగా తలపడి చివరికి ప్రత్యర్థిని రెండుసార్లు తమకన్నా తక్కువ స్కోరుకే ఆలౌట్‌ చేయాలి. ఈ క్రమంలో బ్యాట్స్‌మెన్‌ పరుగులు చేయాలన్నా, బౌలర్లు వికెట్లు తీయాలన్నా...

Updated : 08 Jun 2021 19:34 IST

 టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అదరగొట్టిన బ్యాట్స్‌మెన్‌.. 

టెస్టు క్రికెట్‌ అంటేనే సుదీర్ఘమైన ఆట. ఐదు రోజుల పాటు ఇరు జట్లూ పోటాపోటీగా తలపడి చివరికి ప్రత్యర్థిని రెండుసార్లు తమకన్నా తక్కువ స్కోరుకే ఆలౌట్‌ చేయాలి. ఈ క్రమంలో బ్యాట్స్‌మెన్‌ పరుగులు చేయాలన్నా, బౌలర్లు వికెట్లు తీయాలన్నా గంటల తరబడి మైదానంలో పోరాడాలి. అయితే, ఇలాంటి ఆటను చూడటానికి కొన్నేళ్లుగా అభిమానులు ఆసక్తి చూపడం లేదనే సంగతి తెలిసిందే. దాంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ లాంటి మెగా ఈవెంట్‌తో ఐసీసీ ముందుకొచ్చింది. రెండేళ్ల క్రితం దీన్ని ప్రారంభించగా అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. క్రికెటర్లు సైతం బాగా రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే గత రెండేళ్లలో ఈ టోర్నీలో అదరగొట్టిన టాప్‌ బ్యాట్స్‌మెన్‌ ఎవరో, ఎన్ని మ్యాచ్‌ల్లో ఎన్ని పరుగులు చేశారో ఓసారి వివరంగా తెలుసుకుందాం.


మార్‌నస్ లబుషేన్‌..

ఈ టోర్నీలో అందరికన్నా ఎక్కువ పరుగులు చేసింది ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ మార్నస్‌ లబుషేన్‌. ఆసీస్‌ మొత్తం నాలుగు సిరీస్‌ల్లో 14 మ్యాచ్‌లు తలపడగా లబుషేన్‌ 13 మ్యాచ్‌ల్లో భాగస్వామి అయ్యాడు. అందులో అతడు 23 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్‌ చేసి 1,675 పరుగులు సాధించాడు. దాంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పోటీల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. అతడు 2,999 బంతులు ఎదుర్కోగా 55.85 స్ట్రైక్‌రేట్‌తో 72.82 సగటు నమోదు చేశాడు. ఈ క్రమంలోనే ఐదు శతకాలు, తొమ్మిది అర్ధశతకాలు సాధించాడు. అలాగే 186 బౌండరీలు, 3 సిక్సర్లు సాధించాడు. ఈ టోర్నీలో లబుషేన్‌ అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ 215 పరుగులుగా నమోదైంది.


జోరూట్‌..

ఇక రెండో అత్యధిక పరుగులు చేసింది ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జోరూట్‌. ఈ టోర్నీలో ఆ జట్టు మొత్తం ఆరు సిరీస్‌ల్లో తలపడగా 21 మ్యాచ్‌లు ఆడింది. ఈ క్రమంలోనే రూట్‌ ఒక్క మ్యాచ్‌ మినహాయించి 20 మ్యాచ్‌ల్లో 37 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్‌ చేశాడు. దాంతో అతడు 1,660 పరుగులు సాధించి ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఇన్ని పరుగులు చేయడానికి అతడు ఎదుర్కొన్న బంతులు 3,037. ఇక 54.65గా స్ట్రైక్‌రేట్‌ నమోదు కాగా సగటు 47.42గా నమోదైంది. అందులో మూడు శతకాలు, ఎనిమిది అర్ధశతకాలు ఉన్నాయి. బౌండరీల విషయానికొస్తే రూట్‌ 168 ఫోర్లు, 5 సిక్సర్లు సాధించాడు. అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ 228 పరుగులుగా సాధించాడు.


స్టీవ్‌స్మిత్‌..

ఆస్ట్రేలియా జట్టులో అత్యంత కీలకమైన బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌స్మిత్‌. అతడు ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. ఇంతకుముందు లబుషేన్‌ విషయంలో చెప్పుకున్నట్లే స్మిత్‌ కూడా ఈ టోర్నీలో నాలుగు సిరీస్‌ల్లో కలుపుకొని 13 మ్యాచ్‌ల్లో పాలుపంచుకున్నాడు. అందులో 22 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్‌ చేసి 1,341 పరుగులు చేశాడు. స్మిత్‌ మొత్తం 2,509 బంతులు ఎదుర్కొని 53.44గా స్ట్రైక్‌రేట్‌ సాధించాడు. సగటు 63.85గా నమోదవ్వగా అందులో నాలుగు శతకాలు, ఏడు అర్ధశతకాలు సాధించాడు. అలాగే 151 ఫోర్లు, 7 సిక్సులు సాధించాడు. అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ 211 పరుగులుగా నమోదైంది.


బెన్‌స్టోక్స్‌..

ఇక నాలుగో అత్యధిక పరుగులు సాధించింది ఇంగ్లాండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌. ఒక ఆల్‌రౌండర్‌గా ఈ ఘనత సాధించడం గొప్ప విశేషమే. ఇంగ్లాండ్‌ ఆడిన ఆరు సిరీస్‌ల్లో 21 మ్యాచ్‌ల్లో తలపడగా అతడు ఆడింది 17 మ్యాచ్‌లే. అందులోనూ 32 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్‌ చేసి 1,334 పరుగులు సాధించాడు. అతడు ఎదుర్కొన్న బంతులు 2,308 కాగా స్ట్రైక్‌రేట్‌ 57.79గా నమోదైంది. ఇక సగటు 46గా నమోదైంది. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ నాలుగు శతకాలు, ఆరు అర్ధశతకాలు సాధించాడు. అందులో 142 ఫోర్లు, 31 సిక్సులు కొట్టడం విశేషం. అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ 176 పరుగులుగా నమోదు చేశాడు.


అజింక్య రహానె..

ఈ జాబితాలో టీమ్‌ఇండియా వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె ఐదో స్థానంలో నిలిచాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ మొత్తం ఆరు సిరీస్‌ల్లో తలపడగా 17 మ్యాచ్‌లు ఆడింది. రహానె అన్నింటిలోనూ ఆడి 28 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్‌ చేసి 1,095 పరుగులు చేశాడు. అతడు ఎదుర్కొన్న బంతులు 2,317 కాగా స్ట్రైక్‌రేట్‌ 47.25గా నమోదైంది. అలాగే సగటు 43.80గా నమోదైంది. అందులో మూడు శతకాలు, ఆరు అర్ధశతకాలు సాధించాడు. మరోవైపు బౌండరీల విషయానికొస్తే రహానె 125 ఫోర్లు, 6 సిక్సులు బాదాడు. అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ 115 పరుగులుగా నమోదైంది.


రోహిత్‌ శర్మ..

ఇక ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో వెయ్యి పరుగులపైన సాధించిన బ్యాట్స్‌మెన్‌లో రోహిత్‌ చివరి స్థానంలో నిలిచాడు. భారత్‌ ఆరు సిరీస్‌ల్లో 17 మ్యాచ్‌లు ఆడగా హిట్‌మ్యాన్‌ 11 మ్యాచ్‌ల్లోనే పాల్గొన్నాడు. అందులోనూ 17 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్‌ చేసి 1,030 పరుగులు చేశాడు. అతడు ఎదుర్కొన్న బంతులు 1,597. స్ట్రైక్‌రేట్‌ 64.49 కాగా సగటు 64.37గా నమోదైంది. అందులో నాలుగు శతకాలు, రెండు అర్ధశతకాలు ఉన్నాయి. అలాగే 123 ఫోర్లు, 27 సిక్సులు బాదాడు. ఈ క్రమంలోనే అతడు అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ 212 పరుగులు సాధించాడు.

* ఇక్కడ చెప్పుకున్న వాళ్లంతా ఈ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో వెయ్యికిపైగా పరుగులు చేసిన వారే. ఇందులో ఇద్దరు ఆస్ట్రేలియన్లు, ఇద్దరు ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఉండగా, టీమ్‌ఇండియా బ్యాట్స్‌మెన్‌ సైతం ఇద్దరుండటం విశేషం. ఇక టీమ్‌ఇండియా జూన్‌ 18 నుంచి న్యూజిలాండ్‌తో ఫైనల్లో పోటీపడనున్న నేపథ్యంలో రహానె, రోహిత్‌ ఇంకెన్ని పరుగులు చేస్తారో చూడాలి. వాళ్లిద్దరూ చెరో సెంచరీ కొట్టి కోహ్లీసేన విజయం సాధిస్తే భారత అభిమానులకు పండగ లాంటిదే.

-ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని