Bumrah: బుమ్రా ఆ ఏడు మ్యాచ్‌లు ఆడకపోతే.. ప్రపంచమేమీ అంతంకాదు: ఆకాశ్ చోప్రా

టీ20 ప్రపంచకప్‌ 2022 (T20 World Cup 2022).. ఆసీస్‌తో బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ (Border - Gavaskar Trophy).. వెన్ను నొప్పి కారణంగా ఇలాంటి మెగా టోర్నీల్లో ఆడని బుమ్రా (Bumrah).. ఐపీఎల్‌లో (IPL 2023) ఆడేందుకు సిద్ధమవుతున్నాడు.  

Updated : 22 Feb 2023 10:44 IST

ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా స్టార్‌ పేసర్ జస్ప్రీత్‌ బుమ్రా (Bumrah) దాదాపు ఆరు నెలల నుంచి అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన సంగతి తెలిసిందే. వెన్నునొప్పి తిరగబెట్టడంతో టీ20 ప్రపంచకప్‌, బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలోనూ ఆడలేదు. అయితే, మార్చి 31 నుంచి ప్రారంభమయ్యే ఇండియన్ ప్రీమియర్‌ లీగ్ (IPL 2023)లో ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. దీంతో, సోషల్‌ మీడియా వేదికగా బుమ్రాపై తీవ్ర విమర్శలు వచ్చాయి. భారత్‌ (Team India) తరఫున ఆడేందుకు మాత్రం ఫిట్‌నెస్‌ ఉండదు కానీ, ఐపీఎల్‌లో పాల్గొనడానికైతే మాత్రం గాయాలు అడ్డురావనే వ్యాఖ్యలు వినిపించాయి. ఈ క్రమంలో టీమ్‌ఇండియా ఆటగాడు ఆకాశ్‌ చోప్రా (Akash Chopra) కీలక వ్యాఖ్యలు చేశాడు. కీలకమైన అంతర్జాతీయ ఈవెంట్‌లకు బుమ్రా పూర్తిస్థాయి ఫిట్‌గా ఉండాలని బీసీసీఐ భావిస్తే.. బుమ్రాను ముంబయి ఇండియన్స్‌ కొన్ని మ్యాచ్‌లకు వదిలేస్తే మంచిదని పేర్కొన్నాడు. 

‘‘నువ్వు మొదట భారత్‌ తరఫున ఆటగాడివి.. ఆ తర్వాతే ఫ్రాంచైజీ ప్లేయర్‌. అందుకే, ఫిట్‌నెస్‌కు సంబంధించి బుమ్రాకు అసౌకర్యంగా అనిపిస్తే బీసీసీఐ తక్షణమే ఫ్రాంచైజీతో సంప్రదింపులు జరపాలి. అతడు ఆడేందుకు అనుమతి ఇచ్చేది లేదని చెప్పాలి. బుమ్రా లేకుండా జోఫ్రా ఆర్చర్‌తో ముంబయి తొలి ఏడు మ్యాచ్‌లను ఆడితే ప్రపంచమేమీ ఆగిపోదు. పూర్తిస్థాయిలో ఫిట్‌గా ఉంటే మాత్రం, తప్పకుండా అన్ని మ్యాచ్‌లను ఆడొచ్చు. బుమ్రా జాతీయ ఆస్తి కాబట్టి, బీసీసీఐ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది’’ అని ఆకాశ్ చోప్రా తెలిపాడు. ఆసీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ కోసం ప్రకటించిన జట్టులోనూ బుమ్రాను బీసీసీఐ ఎంపిక చేయలేదు. గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని, అందుకే ఎంపిక చేయలేదని పేర్కొంది. జూన్‌లో జరిగే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ నాటికి పూర్తిగా ఫిట్‌నెస్‌ సాధించాలని భారత్‌ ఆశిస్తోంది. ఏడాది చివర్లో వన్డే ప్రపంచకప్‌ కూడా జరగబోతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని