Shubman Gill: నేను సెలక్టర్‌నైనా.. అదే పని చేసేవాణ్ని: శిఖర్ ధావన్‌

ఒకవేళ తాను సెలక్టర్‌గా ఉన్నా తనకు బదులుగా శుభ్‌మన్‌ గిల్‌ని ఎంపిక చేసేవాడినని శిఖర్‌ ధావన్ (Shikhar Dhawan) అన్నాడు.

Published : 26 Mar 2023 11:36 IST

ఇంటర్నెట్ డెస్క్‌: శిఖర్‌ ధావన్‌ (Shikhar Dhawan).. ఒకప్పుడు మూడు ఫార్మాట్లలో టీమ్‌ఇండియాకు కీలక ఆటగాడిగా ఉన్నాడు. రోహిత్‌ శర్మతో కలిసి ఓపెనింగ్‌ చేసిన అతడు ఎన్నో మ్యాచ్‌ల్లో దూకుడుగా ఆడి జట్టుకు విజయాలనందించాడు. ధావన్‌ నిలకడగా ఆడకపోవడంతోపాటు యువ ఆటగాళ్లు రాణిస్తుండటంతో ఈ మధ్య అతడికి జట్టులో చోటు దక్కడం లేదు. యువ ఆటగాడైన శుభ్‌మన్ గిల్‌ (Shubman Gill)కు సెలక్టర్లు అవకాశాలిస్తున్నారు. అతడు దూకుడుగా ఆడుతూ అన్ని ఫార్మాట్లలో పర్మినెంట్ ప్లేయర్‌గా ఎదుగుతున్నాడు. ఇదే అంశంపై శిఖర్ ధావన్‌ ఓ షోలో మాట్లాడి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

శుభ్‌మన్‌ గిల్‌ని వన్డేల్లోకి తీసుకుని సెలక్టర్లు, కెప్టెన్‌, కోచ్‌ సరైన నిర్ణయం తీసుకున్నారని ధావన్‌ అన్నాడు. ‘శుభ్‌మన్‌ గిల్ ఇప్పటికే రెండు ఫార్మాట్‌లలో ఆడుతున్నాడు. టెస్టులు, టీ20లు రెండింటిలోనూ బాగా రాణిస్తున్నాడని నేను భావిస్తున్నాను. అతడు నాకంటే ఎక్కువ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడుతున్నాడు. ఒకవేళ నేనే సెలక్టర్‌గా ఉంటే..  నాకు బదులుగా శుభ్‌మన్‌ గిల్‌కే అవకాశం ఇచ్చేవాడిని’ అని ధావన్‌ అన్నాడు.

కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ తనకు మద్దతుగా నిలిచారని, 2023 ప్రపంచ కప్‌పై దృష్టి పెట్టాలని కోరినట్లు ధావన్‌ వెల్లడించాడు. ‘‘ కెప్టెన్‌ రోహిత్ శర్మ, కోచ్‌ రాహుల్ ద్రవిడ్‌ నాకు తగినంత మద్దతు ఇచ్చారు. నన్ను క్రికెట్‌పై దృష్టి పెట్టాలని, నా ఫోకస్‌ తదుపరి ప్రపంచ కప్‌పై ఉండాలని చెప్పారు. 2022లో  వన్డేల్లో నేను నిలకడగానే ఆడాను. కానీ, అప్పుడు శుభ్‌మన్‌ గిల్ రెండు ఫార్మాట్లలో (టీ20లు, టెస్టులు) రాణిస్తున్నాడు. ఒకట్రెండు సిరీస్‌లలో నా ఫామ్ తగ్గినప్పుడు వారు గిల్‌కు అవకాశం ఇచ్చారు. అతడు వారి అంచనాలకు తగ్గట్టుగా ఆడాడు. బంగ్లాదేశ్‌పై ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీతో చెలరేగిపోయాడు. ఆ తర్వాత నేను జట్టుకు దూరమవుతానని ఒక్క క్షణం అనుకున్నాను’’  అని ధావన్ చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని