WPL: మహిళల ప్రీమియర్‌ లీగ్‌.. ఫిబ్రవరి రెండో వారంలోనే వేలం!

మహిళా క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం ఇచ్చేలా ఈ ఏడాది నుంచే టీ20 లీగ్‌ (WPL)ను ప్రారంభించేందుకు బీసీసీఐ (BCCI) సిద్ధమైంది. తాజాగా ప్లేయర్ల వేలంను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.

Published : 01 Feb 2023 23:59 IST

ఇంటర్నెట్ డెస్క్‌: తొలి మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WTL) నిర్వహణ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వడివడిగా అడుగులేస్తోంది. ఇప్పటికే ఐదు ఫ్రాంచైజీలను వెల్లడించిన బీసీసీఐ.. వేలం నిర్వహించేందుకూ ఏర్పాట్లు చేస్తోంది. తొలుత ఫిబ్రవరి 6న వేలం నిర్వహించాలని యోచించగా.. ఇప్పుడు రెండో వారంలో వేలం ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఫిబ్రవరి 11న లేదా ఫిబ్రవరి 13న ఉండే అవకాశం ఉంది. ఈ వారంలోనే బీసీసీఐ తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. అలాగే మార్చి 4 నుంచి మార్చి 24 వరకు మెగా టోర్నీని కూడా నిర్వహించాలని చూస్తున్నట్లు సమాచారం. 

ఐదు ఫ్రాంఛైజీల యాజమాన్యాలకు ఇప్పటికే టీ20 లీగ్‌ జట్లు ఉన్నాయి. అబుదాబి వేదికగా ఐఎల్‌టీ 20, దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌ల ఫైనల్‌ మ్యాచ్‌లు ఫిబ్రవరి 11, ఫిబ్రవరి 12 తేదీల్లో జరుగుతాయి. ఈ క్రమంలో ఆ రెండు లీగ్‌ ఫైనల్‌ మ్యాచ్‌లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మరో తేదీని బీసీసీఐ ఎంచుకొనే అవకాశం ఉంది. ఐదు ఫ్రాంచైజీల కోసం ఆయా యాజమాన్యాలు దాదాపు రూ. 4,700 కోట్లను వెచ్చించాయి. ముంబయి ఇండియన్స్, దిల్లీ క్యాపిటల్స్, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఓనర్లతోపాటు అదానీ గ్రూప్, కాప్రి గ్లోబల్‌ ఈ జట్లను సొంతం చేసుకొన్న విషయం తెలిసిందే. ఆయా ఫ్రాంఛైజీలు తమ కోచింగ్‌, సహాయక సిబ్బందిని నియమించుకొనేందుకు తగినంత సమయం ఇవ్వాలనే ఉద్దేశంతోనే వేలంను ఫిబ్రవరి 6వ తేదీ నుంచి వాయిదా వేయాలని బీసీసీఐ నిర్ణయించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని