Wrestlers Protest: మా ప్రాణాలకు ముప్పు ఉంది.. 4 డిమాండ్లతో రెజ్లర్ల ఫిర్యాదు

డబ్ల్యూఎఫ్‌ఐ (WFI) అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తోన్న రెజ్లర్లు.. భారత ఒలింపిక్‌ సంఘాన్ని ఆశ్రయించారు. ఆయనను వెంటనే తొలగించాలంటూ ఫిర్యాదు చేశారు.

Updated : 20 Jan 2023 13:56 IST

దిల్లీ: భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ)కు వ్యతిరేకంగా కుస్తీ యోధులు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. ఈ వ్యవహారంపై కేంద్రంతో రెజ్లర్లు జరిపిన చర్చలు ఫలించలేదు. దీంతో వరుసగా మూడో రోజు నిరసన సాగిస్తున్న క్రీడాకారులు.. తాజాగా భారత ఒలింపిక్‌ అసోసియేషన్‌ (ఐఓఏ)కు ఫిర్యాదు చేశారు. రెజ్లింగ్‌ సమాఖ్యలో జరుగుతున్న అవకతవకలు, తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను అందులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా రెజ్లర్లు (Wrestlers) నాలుగు డిమాండ్లు చేశారు.

‘‘డబ్ల్యూఎఫ్ఐ (WFI) అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ (Brij Bhushan)కు వ్యతిరేకంగా వచ్చిన తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలను మీ దృష్టికి తీసుకొస్తున్నాం. యువ రెజ్లర్ల మాకు చెప్పిన ఫిర్యాదులివి. దీంతో పాటు డబ్ల్యూఎఫ్‌ఐలో ఆర్థికపరమైన అవకతవకలు కూడా జరుగుతున్నాయి. సీనియర్‌ రెజ్లర్లకు ఒప్పందం ప్రకారం చేసుకున్న చెల్లింపులు పూర్తిగా జరగట్లేదు. ఇక, టోక్యో ఒలింపిక్స్‌లో పతకం కోల్పోయిన తర్వాత వినేశ్ ఫొగాట్‌ను డబ్ల్యూఎఫ్‌ఐ (WFI) అధ్యక్షుడు మానసికంగా హింసించాడు. దీంతో దాదాపు ఆమె ఆత్మహత్య చేసుకునే స్థితికి వెళ్లిపోయింది. జాతీయ శిబిరంలో అర్హత లేని కోచ్‌లు, ఇతర సిబ్బందిని డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు నియమించాడు. వాళ్లంతా కేవలం ఆయన అనుచరులే’’ అని రెజ్లర్లు తమ ఫిర్యాదులో వెల్లడించారు.

ఎంతో ధైర్యం కూడగట్టుకుని తాము ఈ ఆందోళనకు దిగామని క్రీడాకారులు తెలిపారు. ఇప్పుడు తాము ప్రాణాల గురించి భయపడుతున్నామన్నారు. డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడిని తొలగించకపోతే.. ఎంతో మంది యువ రెజ్లర్ల కెరీర్‌లు ఇక్కడితో ముగిసిపోతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా.. బ్రిజ్‌ భూషణ్‌ (Brij Bhushan) ఆరోపిస్తున్నట్లుగా తమ వెనుక ఏ రాజకీయ పార్టీ గానీ, పారిశ్రామికవేత్తగానీ లేరని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఒలింపిక్‌ సంఘం ముందు రెజ్లర్లు నాలుగు డిమాండ్లను ఉంచారు. అవి..

1. లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు జరిపేందుకు తక్షణమే కమిటీని ఏర్పాటు చేయాలి.

2. డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు వెంటనే రాజీనామా చేయాలి.

3. భారత రెజ్లింగ్‌ సమాఖ్యను రద్దు చేయాలి.

4. డబ్ల్యూఎఫ్‌ఐ కార్యకలాపాలు కొనసాగించేందుకు రెజ్లర్లను సంప్రదించి ఓ కొత్త కమిటీని ఏర్పాటు చేయాలి.

రాజీనామా చేసే ప్రసక్తే లేదు: బ్రిజ్‌ భూషణ్‌

మరోవైపు తనపై వస్తోన్న లైంగిక వేధింపుల ఆరోపణలను బ్రిజ్‌ భూషణ్‌ (Brij Bhushan) తీవ్రంగా ఖండించారు. ఇదంతా కేవలం రాజకీయ కుట్రలో భాగమే అని ఆరోపించిన ఆయన.. పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడినట్లు వచ్చిన వార్తలను బ్రిజ్‌ భూషణ్‌ కొట్టిపారేశారు. తాను ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఈ హోదాలోకి రాలేదని, ఇప్పుడు కూడా ఎవరితోనూ మాట్లాడలేదని తెలిపారు. ఈ సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించి అన్ని విషయాలూ వెల్లడిస్తానని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు