Wriddhiman Saha: టెస్టులకు అవసరం లేదనడంతో సాహా కీలక నిర్ణయం!

టీమ్‌ఇండియా సీనియర్‌ వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా బెంగాల్‌ రంజీ జట్టు నుంచి తప్పుకొన్నాడు. మొహాలి వేదికగా వచ్చేనెలలో భారత జట్టు శ్రీలంకతో ఆడే రెండు టెస్టుల సిరీస్‌కు అతడిని ఎంపిక చేయరని...

Updated : 10 Feb 2022 02:03 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా సీనియర్‌ వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా బెంగాల్‌ రంజీ జట్టు నుంచి తప్పుకొన్నాడు. మొహాలి వేదికగా వచ్చేనెలలో భారత జట్టు శ్రీలంకతో ఆడే రెండు టెస్టుల సిరీస్‌కు అతడిని ఎంపిక చేయరని తెలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీమ్‌ఇండియా జట్టులో రిషభ్‌ పంత్‌ పూర్తిస్థాయిలో కీపింగ్‌ బాధ్యతలు నిర్వర్తిస్తోన్న సంగతి తెలిసిందే. మరోవైపు ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన కాన్పూర్‌ టెస్టులో కేఎస్‌ భరత్‌ సైతం యువ కీపర్‌గా ఆకట్టుకున్నాడు. దీంతో అతడిని పంత్‌కు బ్యాకప్‌ కీపర్‌గా తీర్చిదిద్దాలని జట్టు యాజమాన్యం భావిస్తోందని, అందువల్లే సాహాను పక్కనపెట్టాలనే నిర్ణయం తీసుకొని ఉంటారని బీసీసీఐలోని ఓ ఉన్నతాధికారి చెప్పారు.

‘శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల సిరీస్‌కు ఎంపిక చేయబోమని జట్టు యాజమాన్యంలోని కీలక వ్యక్తులు సాహాకు నేరుగా చెప్పారు. పంత్‌కు ప్రత్యామ్నాయంగా కేఎస్‌ భరత్‌కు అవకాశం ఇవ్వాలని సెలెక్టర్లు నిర్ణయించుకున్నారు. అతడిని టీమ్‌ఇండియా జట్టుతో కొనసాగిస్తే పరిస్థితులకు అలవాటు పడతాడని అనుకున్నారు. అందుకే సాహాను పక్కనపెట్టారు. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే అతడు కూడా బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌కు ఈ సీజన్‌లో రంజీ ట్రోఫీ ఆడబోనని చెప్పి ఉంటాడు. దీంతో బెంగాల్‌ యాజమాన్యం కూడా అతడిని రంజీలకు ఎంపిక చేయలేదేమో!’ అని ఆ అధికారి వివరించారు. కాగా, సాహా ఇప్పటికే 37 ఏళ్ల వయసు ఉండటంతో సెలెక్షన్‌ కమిటీ కూడా యువకుల వైపు మొగ్గు చూపుతోందని ఆయన అన్నారు. అతడికి ఈ విషయం బాధ కలిగించేదే అయినా.. ఇకపై టీమ్‌ఇండియాకు ఆడకపోతే రంజీ ట్రోఫీ ఎందుకు ఆడాలని అతడు అనుకొని ఉంటాడని అభిప్రాయపడ్డారు. ఇక సాహా టీమ్‌ఇండియా తరఫున ఇప్పటివరకు మొత్తం 40 టెస్టులు ఆడగా.. అందులో మూడు శతకాలతో మొత్తం 1,353 పరుగులు చేశాడు. కీపర్‌గా 104 మందిని పెవిలియన్‌ పంపాడు. అందులో 92 క్యాచ్‌లు, 12 స్టంప్‌ ఔట్లు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని