Wriddhiman Saha: బీసీసీఐ అడిగినా ఆ జర్నలిస్టు పేరు చెప్పను: సాహా

టీమ్‌ఇండియా సీనియర్‌ వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా ప్రస్తుతం క్రికెట్‌ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాడు. ఇంతకుముందెన్నడూ మీడియా ముందుకు రాని అతడు గత కొన్ని రోజులుగా పతాక శీర్షికల్లో కనిపిస్తున్నాడు...

Published : 22 Feb 2022 09:43 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా సీనియర్‌ వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా ప్రస్తుతం క్రికెట్‌ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాడు. ఇంతకుముందెన్నడూ మీడియా ముందుకు రాని అతడు గత కొన్ని రోజులుగా పతాక శీర్షికల్లో కనిపిస్తున్నాడు. శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు అతడిని ఎంపిక చేయకపోవడం పక్కనపెడితే ఇంటర్వ్యూ కోసం ఒక జర్నలిస్టు బెదిరించడమే ఇప్పుడు అమితాసక్తి కలిగిస్తోంది. ఈ విషయం తీవ్ర దుమారం రేపడంతో బీసీసీఐ సైతం రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన సాహా.. తనని బెదిరించిన జర్నలిస్టు గురించి బోర్డు అడిగితే పేరు చెప్పనని తెలిపాడు.

‘ఇప్పటివరకూ బీసీసీఐ నన్ను సంప్రదించలేదు. ఒకవేళ నన్ను బెదిరించిన జర్నలిస్టు ఎవరని అడిగితే మాత్రం అతడి కెరీర్‌ను నాశనం చేయాలనే ఉద్దేశం నాకు లేదని చెబుతాను. అందుకే నేను ఆ ట్వీట్‌లో అతడి పేరు వెల్లడించలేదు. ఇతరుల్ని ఇబ్బందులకు గురి చేసే రకం కాదు నేను. నా తల్లిదండ్రులు నన్ను అలా పెంచలేదు. అయితే, నేను ఆ ట్వీట్‌ చేయడానికి గల కారణం.. మీడియాలోనూ ఇలాంటి ఒక వ్యక్తి ఉన్నాడనే నిజాన్ని బయటపెట్టాలనే ఉద్దేశమే. అలా చేయడం మంచిది కాదు. నాకు అలా ఎవరు మెసేజీలు చేశారో అది ఆ వ్యక్తికి తెలుస్తుంది. ఇతర క్రికెటర్లు ఇలాంటివి ఎదుర్కోకూడదనే నేను ఈ విషయాన్ని ట్వీట్‌ చేశాను. ఆ వ్యక్తి తప్పు చేశాడనే విషయాన్ని బయటపెట్టాలనుకున్నా. మళ్లీ ఇలా ఎవరూ చేయకూడదనుకున్నా’ అని సాహా వివరించాడు. కాగా, ఈ విషయంపై స్పందించిన బీసీసీఐ కోశాధికారి అరుణ్‌ ధూమల్‌.. సాహాతో మాట్లాడి ఆ బెదిరించిన జర్నలిస్టు ఎవరో తెలుసుకుంటామని అన్నాడు. అయితే, ఈ విషయంలో మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని