Wriddhiman Saha: సాహాను ఎందుకు తప్పించారు..?

శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు సాహాను ఎంపిక చేయకపోవడంపై చిన్ననాటి కోచ్‌ జయంత భౌమిక్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఏ కారణం చేత టెస్టు సిరీస్‌కు ఎంపిక చేయలేదని ప్రశ్నించాడు...

Updated : 22 Feb 2022 12:19 IST

చిన్ననాటి కోచ్‌ జయంత భౌమిక్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు సాహాను ఎంపిక చేయకపోవడంపై అతడి చిన్ననాటి కోచ్‌ జయంత భౌమిక్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఏ కారణం చేత టెస్టు సిరీస్‌కు ఎంపిక చేయలేదో చెప్పాలని ప్రశ్నించాడు. సాహాతో రాహుల్‌ ద్రవిడ్‌ ముందే మాట్లాడటం మంచి విషయమే అయినా.. టెస్టు జట్టు నుంచి ఎందుకు తొలగించారన్నాడు.

‘ఏ కారణం చేత సాహాను టెస్టు జట్టు నుంచి తప్పించారు? ఆటగాళ్లను ఎంపిక చేసేటప్పుడు.. ఫిట్‌నెస్‌, వాళ్ల గత ప్రదర్శన ఆధారంగానే ఎంపిక చేస్తారు. ఒకవేళ వయసు పరిగణనలోకి తీసుకోకపోతే ఏ విషయంలో సాహాను పక్కనపెట్టారు? అసలు సమస్యేంటి? జట్టులో ఇంకా వయసుపైబడిన వాళ్లు కూడా ఉన్నారు. అలాంటప్పుడు సాహానే ఎందుకు పక్కనపెట్టారు? ఏ ఆటగాడైనా ఒక నిర్దిష్టమైన సమయంలో రిటైర్‌ కావాల్సిందే. సాహా కూడా అందుకు మినహాయింపేమి కాదు. అయితే, అది ఎప్పుడు చేయాలనేది అతడికి బాగా తెలుసు. అతడు నిజాయతీపరుడు. ఎప్పుడూ తన ఫిట్‌నెస్‌, ప్రదర్శన గురించే ఆలోచిస్తాడు. అతడికి ఇప్పుడు 37 ఏళ్లు. ఇంకో రెండు, మూడేళ్లు ఆడగలడు’ అని అన్నాడు.

ద్రవిడ్‌ జెంటిల్‌మెన్‌.. కానీ

‘రాహుల్‌ ద్రవిడ్‌ జెంటిల్‌మెన్‌. సాహా గురించి ఆయనేమి చెప్పాడో నేను విన్నాను. అది బాగున్నా.. ఇప్పటికీ టీమ్‌ఇండియా జట్టులో ఎక్కువ వయస్సు ఉన్న ఆటగాళ్లు ఉన్నారు. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో సాహా నంబర్‌ 1 వికెట్‌ కీపర్‌ అన్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. అలాంటప్పుడు అతడిని ఎంపిక చేయడానికి ఇంకేంటి సమస్య? జట్టు ఎంపికలో ఒక్కో ఆటగాడికి ఒక్కో విధమైన ప్రమాణాలు ఉండకూడదు. అది సరైంది కాదు’ అని జయంత చెప్పుకొచ్చాడు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సాహాతో మాట్లాడానని, అతడు ఇప్పటికీ మానసికంగా చాలా దృఢంగా ఉన్నాడని ఆయన అన్నారు. అయితే, జట్టు కోసం ఎంతో చేసిన అతడికి ఇలా ముగింపు పలకడం తనను కలచివేసిందని వాపోయాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని