
WTC final: బంతి బాగుంటేనే వికెట్లు తీయడం సులువు
ఉమ్మి రుద్దకున్నా స్వింగ్ అవ్వగలదు: ఇషాంత్
సౌథాంప్టన్: ఉమ్మి రుద్దకున్నా ఇంగ్లాండ్‌లో బంతి స్వింగ్ అవ్వగలదని టీమ్ఇండియా సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ అంటున్నాడు. జట్టు సభ్యుల్లో ఎవరో ఒకరు బంతి నిర్వహణ బాధ్యతను చూసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. మరోవైపు ఇంగ్లాండ్‌లో పర్యటించేటప్పుడు చెత్త బంతుల్ని వదిలేయడం ముఖ్యమని యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అభిప్రాయపడుతున్నాడు. వారిద్దరూ మీడియాతో మాట్లాడారు. సౌథాంప్టన్ వేదికగా జూన్ 18న భారత్, న్యూజిలాండ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో తలపడనున్న సంగతి తెలిసిందే.
‘ఉమ్మి రుద్దకున్నా బంతి స్వింగ్ అవ్వగలదు. అయితే ఎవరో ఒకరు బంతి నిర్వహణ బాధ్యత తీసుకోవాలి. ఇంగ్లాండ్ వాతావరణం, పరిస్థితుల్లో బంతిని జాగ్రత్తగా పర్యవేక్షించడం అవసరం. అప్పుడే బౌలర్లు వికెట్లు తీయడం తేలికవుతుంది’ అని ఇషాంత్ అన్నాడు. కరోనా వైరస్ మహమ్మారి మొదలైనప్పటి నుంచి బంతిపై ఉమ్మి రుద్దడాన్ని ఐసీసీ నిషేధించడం తెలిసిందే. ఇంగ్లాండ్‌లో లెంగ్త్‌లను సరిచూసుకోవడం కీలకమని శర్మ అంటున్నాడు.
అన్ని బంతులూ ఆడొద్దు: గిల్
‘ఇంగ్లాండ్‌లో భిన్నమైన సాధన అవసరం. మార్పునకు త్వరగా అలవాటు పడాలి. భారత్‌లో కొంత సమయం తర్వాత రివర్స్ స్వింగ్ లభిస్తుంది. ఇంగ్లాండ్‌లో స్వింగ్ ఉంటుంది కాబట్టి ఆ లెంగ్త్ ఫుల్లర్‌గా ఉంటుంది. అందుకే ఇక్కడి లెంగ్త్లకు సర్దుకుపోవాలి. ఇక్కడి వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి అలవాటు పడేందుకు కొంత సమయం పడుతుంది. దానికి తోడు క్వారంటైన్లో ఉండటం సవాల్‌గా మారింది. ఎందుకంటే జిమ్‌లో కసరత్తులు చేయడానికి మైదానంలో సాధన చేయడానికి ఎంతో తేడా ఉంటుంది’ అని ఇషాంత్ తెలిపాడు.
ఇంగ్లాండ్‌లో క్రీజులో నిలవాలంటే బ్యాటర్లు చెత్త బంతుల్ని వదిలేయాలని టీమ్ఇండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అన్నాడు. ‘గతంలో నేను భారత్-ఏ, అండర్-19 జట్ల తరఫున ఇంగ్లాండ్‌లో ఆడాను. పరుగులు చేయాలంటే కొన్ని బంతుల్ని మాత్రమే ఎంచుకొని ఆడాలని చాలామంది అప్పుడు చెప్పారు. నా వరకైతే పరుగులు చేయాలన్న తపనను ప్రదర్శిస్తేనే బాగుంటుంది. కేవలం నిలబడితే చాలన్నట్టు కనిపించొద్దు. ఎందుకంటే మనం పరుగులు చేయాలన్న ఉద్దేశంతో కనిపిస్తేనే బౌలర్లు వెనకడుగు వేస్తారు. అప్పుడు వారిపై ఒత్తిడి పెట్టగలం. కొన్నిసార్లు ఇంగ్లాండ్‌లో ఔటవ్వకుండా ఉండాలంటే మాత్రం చెత్త బంతులు వదిలేయాలి’ అని గిల్ పేర్కొన్నాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.