చేతికి 5 వేళ్లలా.. కోహ్లీసేనకు పుజారా అలా!

టీమ్‌ఇండియా విజయాల్లో చెతేశ్వర్‌ పుజారా బ్యాటింగ్‌ శైలి అంతర్భాగమని క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ అన్నారు. విమర్శకులు అతడికి కనీసం చేరువలో లేరని విమర్శించారు. అతనాడిన అత్యున్నత స్థాయి క్రికెట్‌ ఆడలేదని గుర్తు చేశారు. టెస్టు క్రికెట్లో స్ట్రైక్‌రేట్‌ మాత్రమే ముఖ్యం కాదన్నారు. అవసరమైతే నిలబడి...

Published : 16 Jun 2021 01:25 IST

ప్రశంసల వర్షం కురిపించిన సచిన్‌

దిల్లీ: టీమ్‌ఇండియా విజయాల్లో చెతేశ్వర్‌ పుజారా బ్యాటింగ్‌ శైలి అంతర్భాగమని క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ అన్నారు. విమర్శకులు అతడికి కనీసం చేరువలో లేరని ప్రశంసించారు.  టెస్టు క్రికెట్లో స్ట్రైక్‌రేట్‌ మాత్రమే ముఖ్యం కాదన్నారు. అవసరమైతే నిలబడి బౌలర్లను అలసిపోయేలా చేయాల్సి ఉంటుందన్నారు. ఇంగ్లాండ్‌లో ఎలా ఆడాలో టీమ్‌ఇండియా క్రికెటర్లకు ఆయన సూచనలిచ్చారు. పీటీఐతో ప్రత్యేకంగా సంభాషించారు.

పుజారా అంతర్భాగం

భారత్‌ కోసం చెతేశ్వర్‌ పుజారా ఎంతో సాధించాడు. అందుకతడిని ప్రశంసించాలి. సుదీర్ఘ ఫార్మాట్లో ప్రతిసారీ స్ట్రైక్‌రేట్లే ప్రధానం కావు. టెస్టుల్లో విజయాలు అందుకోవాలంటే భిన్నమైన ఆటగాళ్లు, ప్రణాళికలు జట్టుకు అవసరం. చేతిలోని ఐదు వేళ్లలాగే ఇదీ. ప్రతి వేలికీ ఓక్కో పాత్ర ఉంటుంది. అదే విధంగా జట్టులో పుజారా అంతర్భాగం. అతడి ప్రతి ఇన్నింగ్స్‌నూ విశ్లేషించడం మానేసి దేశం కోసం సాధించినవాటికి మెచ్చుకోవాలి. అతడి టెక్నిక్‌, రొటేషన్‌ గురించి నిత్యం ప్రశ్నించేవాళ్లు.. పుజారాలా అత్యున్నత స్థాయి క్రికెట్‌ కనీసం ఆడి ఉండరు.

స్ట్రైక్‌రేట్లకు పంత్‌, జడ్డూ ఉన్నారుగా!

టీ20 క్రికెట్‌ రాకతో వీక్షకుల దృక్పథం మారిపోయింది. స్టాండ్స్‌లోకి బంతిని పంపిస్తే చాలనుకుంటున్నారు. ఈ టీ20 క్రికెట్‌ యుగంలో లాగిపెట్టి కొడితే చాలు! గొప్ప ఆటగాడని అనుకుంటున్నారు. అలాంటి వారికి పుజారా ఎప్పటికీ అర్థమవ్వడు. వారికి మంచి టెస్టు ఆటగాళ్లు అక్కర్లేదు. సుదీర్ఘ ఫార్మాట్లో కేవలం బాదడం మాత్రమే కాదు. దానికి తోడుగా అదనపు నైపుణ్యాలు అవసరం. జట్టులో స్ట్రైక్‌రేట్లు పెంచేందుకు రిషభ్ పంత్‌, రవీంద్ర జడేజా వంటి ఆటగాళ్లు ఉన్నారు. ఎప్పుడంటే అప్పుడు వారు స్ట్రైక్‌రేట్‌ పెంచగలరు. ప్రత్యర్థి బౌలర్లను అలసిపోయేలా చేయాలంటే మాత్రం ప్రత్యేకమైన ప్రణాళికలు, దార్శనికత, వ్యూహాలు అవసరం. అందుకోసం చెతేశ్వర్‌ అవసరం.

యాష్‌, జడ్డూను ఆడించాలి

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో టీమ్‌ఇండియా ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగితేనే మెరుగు. సౌథాంప్టన్‌లో పిచ్‌ సహకారం లేకున్నా రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజాను ఆడించాలి. ఎందుకంటే జడ్డూ, అశ్విన్‌ బ్యాటింగ్‌ చేయగలరు. ముగ్గురు పేసర్లను ఎంపిక చేయాలి. ఏదేమైనా వికెట్‌ చూశాకే జట్టు యాజమాన్యం తుది నిర్ణయం తీసుకోవాలి. నాలుగు, ఐదు రోజుల్లోనూ పిచ్‌ సిన్నర్లకు అనుకూలించకపోయినా ఆందోళన లేదు.

టర్న్‌ అవ్వకున్నా వికెట్లు తీయొచ్చు

షేన్‌వార్నర్‌ ప్లిప్పర్లతో చాలా వికెట్లు తీశాడు. లెగ్‌స్పిన్నర్‌ నేరుగా విసిరితే ప్లిప్పర్‌ అంటారు. అందుకు పిచ్‌ సహకారం అవసరం లేదు. అలాగే ముత్తయ్య మురళీధరన్‌ తన టాప్‌ స్పిన్నర్లతో (స్ట్రెయిట్‌ డెలివరీ) అనేక మందిని పెవిలియన్‌ పంపించాడు. అంటే టర్న్‌ చేయకుండా నేరుగా విసరడమూ ఓ నైపుణ్యమే. ప్రతిసారీ ఆఫ్‌స్పిన్నర్‌ బంతిని టర్న్‌ చేసి షార్ట్‌లెగ్‌లో బ్యాటర్‌ను దొరకబుచ్చుకోవాలని అనుకోవద్దు.

గాల్లోనే ఇంద్రజాలం

టర్న్‌ చేయకుండా నేరుగా విసరే బంతులు బ్యాట్స్‌మెన్‌కు భ్రాంతిని కలిగిస్తాయి. బంతి తిరుగుతుందా లేదా అన్న గందరగోళంలో పడేస్తాయి. ఆఫ్‌స్పిన్నర్‌ నేరుగా విసిరతే బ్యాటు అంచుకు తగిలిన బంతి స్లిప్‌లోకి వెళ్తుంది. లేదా కీపర్‌కు దొరికేస్తుంది. ఎడమచేతి వాటం స్పిన్నర్లకూ అంతే. లెగ్‌ మిడిల్‌లో బంతి పడి కుడి చేతివాటం బ్యాటర్‌ నుంచి టర్నవ్వాలనేం లేదు. కొన్నిసార్లు ఆర్మ్‌బాల్‌ ద్వారానూ ఎల్బీ లేదా బౌల్డ్‌ అవ్వొచ్చు. తిరగని బంతిని ఆడేందుకూ నైపుణ్యాలు అవసరమే. నిజానికి ఇంగ్లాండ్‌లో గాల్లోనే స్పిన్నర్లు అద్భుతాలు చేయొచ్చు. బంతి మెరుపును ఉపయోగించుకొని బాగా డ్రిఫ్ట్‌ చేయొచ్చు. బంతిపై పట్టును బట్టే అంతా ఉంటుంది. భారత్‌లో పిచ్‌ అయ్యాక సహకారం ఉంటే ఇంగ్లాండ్‌లో గాలిలోనే ఇంద్రజాలం చేయొచ్చు.

రోహిత్‌, గిల్‌.. దగ్గరగా ఆడాలి

టీమ్‌ఇండియా ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శుభ్‌మన్ గిల్‌ దేహానికి దగ్గరగా బంతులు ఆడటం ముఖ్యం. చేతుల్ని దేహానికి దగ్గరగా పెట్టుకొని ఆడాలి. బ్యాక్‌లిఫ్ట్‌ ఆడినప్పుడు సాధ్యమైనంతా చేతులు దేహానికి సమీపంలో ఉండాలి. అలాంటప్పుడే బంతిని డిఫెండ్‌ చేసేందుకు నియంత్రణ లభిస్తుంది. ఆలస్యంగానూ ఆడేందుకు అవకాశం దొరకుతుంది. దేహానికి చేతులు దూరంగా ఉంటే బ్యాటు స్వింగ్‌పై నియంత్రణ కష్టం. సమతూకం దెబ్బతింటుంది. ఇక కివీస్‌లో సౌథీ, బౌల్ట్‌, వాగ్నర్‌, జేమీసన్‌ వేర్వేరుగా బంతులు విసిరే భిన్నమైన బౌలర్లు. వారిని జాగ్రత్తగా ఎదుర్కోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని