WTC Final 2023: ఎదురీతే..
తొలి రోజుతో పోలిస్తే బౌలింగ్ కొంచెం మెరుగే. అయినా ఆస్ట్రేలియా భారీ స్కోరు చేయకుండా ఆపలేకపోయింది భారత్. ఆస్ట్రేలియా అంత బాగా ఆడిందంటే మనవాళ్లూ బ్యాటుతో సత్తా చాటుతారని, ప్రత్యర్థి స్థాయిలో కాకపోయినా జట్టుకు పోరాడే స్కోరైనా సాధించి పెడతారని ఆశిస్తే..
డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ 151/5
టాప్‌ఆర్డర్ ఘోర వైఫల్యం
ఆస్ట్రేలియా 469 ఆలౌట్
తొలి రోజుతో పోలిస్తే బౌలింగ్ కొంచెం మెరుగే. అయినా ఆస్ట్రేలియా భారీ స్కోరు చేయకుండా ఆపలేకపోయింది భారత్. ఆస్ట్రేలియా అంత బాగా ఆడిందంటే మనవాళ్లూ బ్యాటుతో సత్తా చాటుతారని, ప్రత్యర్థి స్థాయిలో కాకపోయినా జట్టుకు పోరాడే స్కోరైనా సాధించి పెడతారని ఆశిస్తే.. పేరు గొప్ప బ్యాటర్లు చేతులెత్తేశారు. కష్టపడి కొన్ని పరుగులు చేయడం.. క్రీజులో కుదురుకున్నారులే అనుకునేలోపే పెవిలియన్ చేరిపోవడం.. ఇదీ వరస! ఫలితం.. 71 పరుగులకే 4 వికెట్లు. జడేజా, రహానె పోరాడబట్టి భారత్ పరిస్థితి కాస్త పర్వాలేదు కానీ.. ఇప్పటికీ మ్యాచ్‌లో రోహిత్‌సేన బాగా వెనుకబడే ఉంది.
లండన్ : ఆస్ట్రేలియాతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో భారత్ ఎదురీదుతోంది. ఆస్ట్రేలియాకు 469 పరుగుల భారీ స్కోరు సమర్పించుకున్న భారత్.. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించి రెండో రోజు ఆట ఆఖరుకు 151/5తో నిలిచింది. టాప్‌ఆర్డర్ ఘోర వైఫల్యంతో ఒక దశలో 71/4తో పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టును జడేజా (48; 51 బంతుల్లో 7×4, 1×6), రహానె (29 బ్యాటింగ్; 71 బంతుల్లో 4×4) ఆదుకున్నారు. ఆట చివరికి రహానెకు తోడుగా ఆంధ్రా కుర్రాడు, వికెట్ కీపర్ శ్రీకర్ భారత్ (5) క్రీజులో ఉన్నాడు. అంతకుముందు 327/3తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆసీస్.. ఇంకో 142 పరుగులు జోడించి మిగతా 7 వికెట్లు కోల్పోయింది. తొలి రోజు హీరోలు ట్రావిస్ హెడ్ (163; 174 బంతుల్లో 25×4, 1×6), స్టీవెన్ స్మిత్ (121; 268 బంతుల్లో 19×4) రెండో రోజు ఓ మోస్తరుగా పరుగులు చేశారు. అలెక్స్ కేరీ (48; 69 బంతుల్లో 7×4, 1×6) విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో సిరాజ్ (4/108) ఆకట్టుకున్నాడు. ఇంకా 318 పరుగులు వెనుకబడి ఉన్న భారత్.. ఫాలో ఆన్ తప్పించుకోవాలంటే మరో 119 పరుగులు చేయాలి.
టాప్ లేచింది..: పేస్ పిచ్‌పై, బలమైన ఆస్ట్రేలియా పేస్ దాడిని ఎదుర్కొని ప్రత్యర్థికి దీటుగా భారత్ భారీ స్కోరు సాధిస్తుందన్న అంచనాలు పెద్దగా లేవు! కానీ కోహ్లి, పుజారా, రోహిత్ లాంటి అనుభవజ్ఞులు.. శుభ్‌మన్ లాంటి సూపర్ ఫామ్‌లో ఉన్న బ్యాటర్ తమ స్థాయికి తగ్గ ఇన్నింగ్స్‌లతో జట్టును పోటీలో నిలుపుతారనుకుంటే నిరాశ తప్పలేదు. నిజానికి భారత్ ఇన్నింగ్స్ ఆశాజనకంగానే మొదలైంది. రోహిత్, గిల్ ఆత్మవిశ్వాసంతో కనిపించారు. వికెట్ కోల్పోకుండా భారత్ 30 పరుగులు చేసింది. తొలి వికెట్‌కు 50+ భాగస్వామ్యం నమోదైతే మిగతా బ్యాటర్లలోనూ ఊపు వస్తుందనిపించింది. కానీ అంతలోనే భారత కెప్టెన్‌ను ఆస్ట్రేలియా కెప్టెన్ పెవిలియన్ చేర్చాడు. కమిన్స్ బంతికి వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయిన రోహిత్ (15) సమీక్ష కూడా కోరకుండా వెనుదిరిగాడు. తర్వాతి ఓవర్లోనే శుభ్‌మన్ (13)ను బోలాండ్ బౌల్డ్ చేశాడు. ఈ స్థితిలో పుజారా (14), కోహ్లి (14) ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఏడు ఓవర్ల పాటు వికెట్ పడలేదు. స్కోరు 50కి చేరుకుంది. పరిస్థితి మెరుగుపడుతోంది అనుకునేలోపే మళ్లీ కుదుపు. గ్రీన్ బౌలింగ్‌లో పుజారా పేలవ రీతిలో బౌల్డయి వెనుదిరిగాడు. తర్వాత భారత బ్యాటింగ్‌లో అత్యంత కీలకమైన కోహ్లిని స్టార్క్ ఒక కళ్లు చెదిరే బంతితో ఔట్ చేశాడు. 19వ ఓవర్‌కే నాలుగు ప్రధాన వికెట్లు కోల్పోయిన భారత్.. రెండో రోజు ఇంకా రెండు గంటల పాటు ఆడాల్సి ఉండటంతో ఆలౌట్ అయిపోతుందేమో అనిపించింది. కానీ రహానె, జడేజా గొప్పగా పోరాడి జట్టుకు ఆ ప్రమాదాన్ని తప్పించారు. ముఖ్యంగా జడేజా పిచ్‌లో ఏ మర్మం లేదని, ఆస్ట్రేలియా బౌలింగ్ కూడా అంత ప్రమాదకరంగా ఏమీ లేదని అనిపించేలా స్వేచ్ఛగా షాట్లు ఆడాడు. మరో ఎండ్‌లో రహానె ఓపిగ్గా బ్యాటింగ్ చేశాడు. ఈ జోడీ పట్టుదల చూస్తే మరో వికెట్ పడకుండా భారత్ ఆటను ముగిస్తుందనిపించింది. కానీ చివర్లో జడేజా ఏకాగ్రతకు లైయన్ తెరదించాడు. జడేజా డిఫెన్స్ ఆడబోగా బంతి ఎడ్జ్ తీసుకుని స్లిప్‌లో స్మిత్ చేతుల్లో పడింది. తర్వాత భరత్‌తో కలిసి రహానె మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు.
వికెట్లు.. పరుగులు: అంతకుముందు తొలి రోజుతో పోలిస్తే రెండో రోజు బౌలర్లు ఎంతో మెరుగ్గా బౌలింగ్ చేయడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ను భారత్ కాస్త వేగంగానే ముగించగలిగింది. కానీ రెండో రోజు 36.3 ఓవర్లలోనే మిగతా ఏడు వికెట్లు కోల్పోయినప్పటికీ.. వీలైనన్ని ఎక్కువ పరుగులు రాబట్టడంతో ఆసీస్ సంతృప్తికరంగానే ఇన్నింగ్స్‌ను ముగించింది. తొలి రోజు మధ్యాహ్నం తర్వాత బ్యాటింగ్‌కు పూర్తి అనుకూలంగా మారిన పరిస్థితుల్లో పరుగుల వరద పారిస్తూ ద్విశతక భాగస్వామ్యం నమోదు చేసిన హెడ్, స్మిత్ జోడీ.. రెండో రోజు కూడా నిలకడను కొనసాగించారు. 95 పరుగులతో క్రీజులోకి వచ్చిన స్మిత్ సెంచరీ పూర్తి చేయగా.. 146 పరుగులతో బ్యాటింగ్ కొనసాగించిన హెడ్ 150 మైలురాయిని దాటారు. ఆసీస్ ఇన్నింగ్స్ సాఫీగా సాగిపోతున్న సమయంలో.. హెడ్ మారథాన్ ఇన్నింగ్స్‌కు సిరాజ్ తెరదించాడు. అతను వికెట్ కీపర్ భరత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కాసేపటికే గ్రీన్‌ను షమి పెవిలియన్ చేర్చగా.. స్మిత్‌ను శార్దూల్ బౌల్డ్ చేసి భారత్‌కు గొప్ప ఉపశమనాన్నిచ్చాడు. ఆసీస్ 387/6కు చేరుకుంది. ఇక ఇన్నింగ్స్ త్వరగానే ముగుస్తుందనుకుంటే.. కేరీ భారత్‌కు అడ్డం పడ్డాడు.
ఆలౌటయ్యేలోపు జట్టుకు వీలైనంత ఎక్కువ స్కోరు సాధించి పెట్టాలన్న లక్ష్యంతో అతను ధాటిగా ఆడాడు. బౌండరీల మోత మోగిస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. స్టార్క్ (5) ఎక్కువసేపు నిలవకున్నా.. కమిన్స్ (9) సహకారంతో అతను స్కోరును 450 దాటించాడు. ఈ స్థితిలో కేరీని జడేజా వికెట్ల ముందు దొరకబుచ్చుకోగా.. సిరాజ్ చకచకా రెండు వికెట్లు పడగొట్టి ఆసీస్ ఇన్నింగ్స్‌కు తెరదించాడు.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: వార్నర్ (సి) భరత్ (బి) శార్దూల్ 43; ఖవాజా (సి) భరత్ (బి) సిరాజ్ 0; లబుషేన్ (బి) షమి 26; స్మిత్ (బి) శార్దూల్ 121; హెడ్ (సి) భరత్ (బి) సిరాజ్ 163; గ్రీన్ (సి) శుభ్‌మన్ (బి) షమి 6; కేరీ ఎల్బీ (బి) జడేజా 48; స్టార్క్ రనౌట్ 5; కమిన్స్ (సి) రహానె (బి) సిరాజ్ 9; లైయన్ (బి) సిరాజ్ 9; బోలాండ్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 38 మొత్తం: (121.3 ఓవర్లలో ఆలౌట్) 469
వికెట్ల పతనం: 1-2, 2-71, 3-76, 4-361, 5-376, 6-387, 7-402, 8-453, 9-468; బౌలింగ్: షమి 29-4-122-2; సిరాజ్ 28.3-4-108-4; ఉమేశ్ 23-5-77-0; శార్దూల్ 23-4-83-2; జడేజా 18-2-56-1
భారత్ తొలి ఇన్నింగ్స్: రోహిత్ ఎల్బీ (బి) కమిన్స్ 15; శుభ్‌మన్ (బి) బోలాండ్ 13; పుజారా (బి) గ్రీన్ 14; కోహ్లి (సి) స్మిత్ (బి) స్టార్క్ 14; రహానె బ్యాటింగ్ 29; జడేజా (సి) స్మిత్ (బి) లైయన్ 48; భరత్ బ్యాటింగ్ 5; ఎక్స్‌ట్రాలు 13 మొత్తం: (38 ఓవర్లలో 5 వికెట్లకు) 151; వికెట్ల పతనం: 1-30, 2-30, 3-50, 4-71, 5-142; బౌలింగ్: స్టార్క్ 9-0-52-1; కమిన్స్ 9-2-36-1; బోలాండ్ 11-4-29-1; కామెరూన్ గ్రీన్ 7-1-22-1; లైయన్ 2-0-4-1
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Chandrababu: ‘ఐటీని తెలుగువారికి పరిచయం చేయడమే చంద్రబాబు నేరమా?’
-
పార్కులో జంటను బెదిరించి.. యువతిపై పోలీసుల లైంగిక వేధింపులు
-
Diabetes: టైప్-1 మధుమేహానికి వ్యాక్సిన్
-
Chandrababu: చంద్రబాబు పిటిషన్‌పై నేడు సుప్రీంలో విచారణ
-
Nizamabad: మాల్లో ఫ్రిజ్ తెరవబోయి విద్యుదాఘాతంతో చిన్నారి మృతి