WTC Final: 250+ చేస్తే కోహ్లీసేనదే పైచేయి!

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ తొలి ఇన్నింగ్స్‌లో 250+ పరుగులు చేస్తే న్యూజిలాండ్‌పై ఆధిపత్యం చెలాయించొచ్చని టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాఠోడ్‌ అన్నాడు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో అది  మెరుగైన స్కోరేనని పేర్కొన్నాడు. ఓపెనర్లు శుభ్‌మన్‌ గిల్‌, రోహిత్‌ శర్మ చక్కని...

Published : 20 Jun 2021 12:11 IST

బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాఠోడ్‌ అంచనా

సౌథాంప్టన్‌: ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ తొలి ఇన్నింగ్స్‌లో 250+ పరుగులు చేస్తే న్యూజిలాండ్‌పై ఆధిపత్యం చెలాయించొచ్చని టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాఠోడ్‌ అన్నాడు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో అది మెరుగైన స్కోరేనని పేర్కొన్నాడు. ఓపెనర్లు శుభ్‌మన్‌ గిల్‌, రోహిత్‌ శర్మ చక్కని భాగస్వామ్యంతో ఆకట్టుకున్నారని వెల్లడించాడు.

వెలుతురు లేమితో రెండో రోజు శనివారం ఆట ముగిసే సరికి టీమ్‌ఇండియా 3 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లీ (44 బ్యాటింగ్‌; 124 బంతుల్లో 1×4) అర్ధశతకానికి చేరువయ్యాడు. అజింక్య రహానె (29 బ్యాటింగ్‌; 79 బంతుల్లో 4×4) అతడికి తోడుగా ఉన్నాడు. రోహిత్‌ శర్మ (34; 68 బంతుల్లో 6×4), శుభ్‌మన్‌ గిల్‌ (28; 64 బంతుల్లో 3×4) తొలి వికెట్‌కు 62 పరుగుల భాగస్వామ్యం అందించారు.

‘మేం వీలైనన్ని మరిన్ని పరుగులు చేయాలి. ప్రస్తుత పరిస్థితుల్లో 250+ మెరుగైన స్కోరే’ అని రాఠోడ్‌ అన్నాడు. కొత్త బంతిని ఓపెనర్లు రోహిత్‌, శుభ్‌మన్‌ చక్కగా ఎదుర్కొన్నారని ప్రశంసించాడు. క్రీజు బయట స్టాన్స్‌ తీసుకుంది స్వింగ్‌ను ఎదుర్కోవడానికా? దూకుడుగా ఆడటానికా? అని ప్రశ్నించగా.. ‘బ్యాటింగ్‌ అంటేనే పరుగులు చేయడం. రోహిత్‌, గిల్‌  పట్టుదలగా ఆడారు. వీలైనప్పుడల్లా పరుగులు చేసేందుకు ప్రయత్నించారు. వారిని కచ్చితంగా అభినందించాల్సిందే. విరాట్‌, రహానె బ్యాటింగ్‌ చేసిన తీరుకు హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే’ అని రాఠోడ్‌ అన్నాడు.

‘ఇంగ్లాండ్‌లో డ్యూక్‌ బంతులు పాతబడ్డాక మరింత స్వింగ్‌ అవుతాయి. పైగా రెండో సెషన్‌లో న్యూజిలాండ్‌ పేసర్లు కట్టుదిట్టమైన లెంగ్తుల్లో బంతులు వేశారు’ అని విక్రమ్‌ చెప్పాడు. చెతేశ్వర్‌ పుజారా హెల్మెట్‌కు బంతులు తగిలించుకుంటున్నాడని,  బ్యాటింగ్‌ టెక్నిక్‌లో ఇబ్బందులు ఉన్నాయా అని ప్రశ్నించగా.. ‘మేం మరీ అతిగా పట్టించుకోవడం లేదు. అతనో మంచి  క్రికెటర్‌. వేగవంతమైన బంతులు ఆడటం కష్టమని అనుకోను. అతడు బ్యాటింగ్‌ చేస్తున్నంత సేపు స్థిరంగానే ఉన్నాడు. ఇచ్చిన బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడు. ఈ మ్యాచులోనూ 50 బంతులకు పైగా ఆడాడు. వాటిని పరుగులుగా మార్చాలి. త్వరలోనే అది జరుగుతుంది’ అని విక్రమ్‌ రాఠోడ్‌ ధీమా వ్యక్తం చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని