WTC Final: కోహ్లీసేన పరాభవానికి 5 కారణాలు!

ఐసీసీ అరంగేట్రం ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ముగిసింది. ఈ రెండేళ్లలో టీమ్‌ఇండియా అద్భుత విజయాలతో అలరించింది. ఆరు సిరీసులాడి ఐదింట్లో విజయ దుందుభి మోగించింది. ఈ మొత్తం జైత్రయాత్రలో కోహ్లీసేనకు ఘోరమైన పరాజయాలు...

Published : 24 Jun 2021 16:53 IST

టీమ్‌ఇండియాకు గదను దూరం చేసిన లోపాలు

ఐసీసీ అరంగేట్ర ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ముగిసింది. ఈ రెండేళ్లలో టీమ్‌ఇండియా అద్భుత విజయాలతో అలరించింది. ఆరు సిరీసులాడి ఐదింట్లో విజయ దుందుభి మోగించింది. ఈ మొత్తం జైత్రయాత్రలో కోహ్లీసేనకు ఘోరమైన పరాజయాలు పరిచయం చేసింది మాత్రం ఒక్క న్యూజిలాండే. ఆఖరికి ఫైనల్లోనూ అదే జట్టు భారత్‌కు ‘గద’ దక్కకుండా చేసింది. స్థూలంగా పరిశీలిస్తే విరాట్‌ సేన ఓటమికి ఐదు కారణాలు కనిపిస్తున్నాయి. అవేంటంటే..!


సన్నద్ధత లేదు

ఫైనల్‌ ముందు టీమ్‌ఇండియాకు సరైన సన్నద్ధత లభించలేదు. కరోనా వైరస్‌తో ఐపీఎల్‌ నిరవధికంగా వాయిదా పడటంతో ఆటగాళ్లంతా ఇళ్లకు చేరుకున్నారు. ఆ తర్వాత ముంబయిలో క్వారంటైన్‌ అయ్యారు. మళ్లీ ఇంగ్లాండ్‌కు వచ్చాక 3 రోజులు కఠిన, 7 రోజులు సాధారణ క్వారంటైన్‌లో గడిపారు. అయితే వారం రోజుల్లో మైదానంలో సాధన శిబిరాల్లో మాత్రమే పాల్గొన్నారు. వారికి మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లభించలేదు. మొత్తం ఆటగాళ్లు రెండు బృందాలుగా విడిపోయి ఒక అంతర్గత మ్యాచ్‌ ఆడారంతే. సాధారణంగా ఇంగ్లాండ్‌ వంటి దేశాల్లో సిరీసులకు ముందు సన్నాహక మ్యాచులు ఆడటం అత్యంత కీలకం. అప్పుడే అక్కడి వాతావరణం, పరిస్థితులు, పిచ్‌లకు అలవాటు పడగలరు. బీసీసీఐ చేయని ఓ పని కివీస్‌ బోర్డు చేసింది. ఫైనల్‌కు ముందు రూట్‌ సేనతో రెండు మ్యాచులు ఏర్పాటు చేసింది. ఆ సిరీస్‌లో విజయం అందుకోవడమూ విలియమ్సన్‌ జట్టులో ఆత్మవిశ్వాసం నింపింది.


వరుణుడి దెబ్బ

కోహ్లీసేన పరాజయానికి కారణాల్లో రెండోది సౌథాంప్టన్‌, అక్కడి వాతావరణం. ఇంగ్లిష్‌ సమ్మర్‌ కాబట్టి భారత్‌కు అనుకూలమైన పొడి వాతావరణం ఉంటుందని ఎంతోమంది అంచనా వేశారు. కానీ అవన్నీ తప్పని ‘వరుణ దేవుడు’ నిరూపించాడు. మ్యాచ్‌ ఆరంభానికి రెండ్రోజుల ముందు నుంచే అక్కడ వర్షం కురవడం మొదలైంది. తొలిరోజు పూర్తిగా వర్షార్పణం అయింది. రెండో రోజు రెండు సెషన్ల ఆటే సాగింది. మూడో రోజూ అంతే. మళ్లీ నాలుగో రోజు మొత్తంగా ఆట సాగలేదు. ఇలాంటి అంతరాయాలతో భారత బ్యాటింగ్‌ లయ దెబ్బతింది. వారు క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. సాధారణంగా మ్యాచ్‌ మధ్యలో అంతరాయాలు వస్తే బ్యాట్స్‌మెన్‌కు చిరాకుగా ఉంటుందని, మానసికంగా ఇబ్బంది పడతారని విశ్లేషకులు చెబుతున్నారు. టీమ్‌ఇండియా ఇందుకు మినహాయింపేమీ కాదంటున్నారు.


స్వింగ్‌కు చిత్తు

ఆకాశం మబ్బులు పట్టినప్పుడు, చల్లని వాతావరణం ఉన్నప్పుడు టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ బలహీనతలు మళ్లీ మళ్లీ బయటపడుతున్నాయి. సాధారణంగా ఇంగ్లాండ్‌లో బ్యాటింగ్‌ చేస్తే ఓపెనర్లు త్వరగా ఔటవ్వడం చూస్తుంటాం. ఈ సారి ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌ ఫర్వాలేదనిపిస్తే.. మిడిలార్డర్‌, లోయర్‌ మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ మాత్రం పూర్తిగా విఫలమయ్యారు. భారత్‌లోనూ చల్లని ప్రదేశాల్లో స్టేడియాలు నిర్మించి సాధన చేయిస్తే ఈ బలహీనతల నుంచి బయటపడొచ్చు. ఫైనల్‌లో ఓపెనర్లు ఇచ్చిన శుభారంభాలను టీమ్‌ఇండియా కొనసాగించలేకపోయింది. విరాట్‌ కోహ్లీ ఒక ఇన్నింగ్స్‌లో అద్భుతంగా ఆడినా మరో ఇన్నింగ్స్‌లో తడబడ్డాడు. అజింక్య రహానె, చెతేశ్వర్‌ పుజారా సైతం పరుగులేమీ చేయలేదు. రిషభ్ పంత్‌ సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడాల్సిన అవసరం కనిపించింది. ఇక అశ్విన్‌, జడేజా.. ఆఖర్లో ఇషాంత్‌, బుమ్రా, షమి తలో పది పరుగులైనా చేసుంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో! కివీస్‌లో టిమ్‌ సౌథీ (30), జేమీసన్‌ (21) కలిసి 51 పరుగులు చేశారు. ఇంగ్లాండ్‌లో లోయర్‌ ఆర్డర్‌ చేసిన పరుగులే మ్యాచులు గెలిపిస్తాయనడంలో సందేహమే లేదు. విచిత్రమేంటంటే.. గత ఆరు ఇన్నింగ్స్‌ల్లో న్యూజిలాండ్‌పై టీమ్‌ఇండియా 250+ స్కోరు చేయనేలేదు.


పేస్‌ ఆల్‌రౌండర్‌ కొరత

టీమ్‌ఇండియా పటిష్ఠమైన జట్టనడంలో సందేహమే లేదు! కానీ జట్టు కూర్పు, సమతూకంలో మాత్రం ఇబ్బందులు కనిపించాయి.  ముఖ్యంగా కోహ్లీసేనలో పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ లేని కొరత స్పష్టంగా తెలిసింది. ఇంగ్లాండ్‌ పిచ్‌లపై వేగంతో పాటు స్వింగ్‌ చేసే బౌలర్లు అవసరం. హార్దిక్‌ పాండ్య లేదా శార్దూల్‌ ఠాకూర్‌ను తీసుకొని ఉంటే పరిస్థితి మరోలా ఉండేది! ఫిట్‌నెస్‌ ఇబ్బందులతో పాండ్య బౌలింగ్‌ చేయడం లేదు. దాంతో అతడిని ఇంగ్లాండ్‌ పర్యటనకు ఎంపిక చేయలేదు. ఎండకాస్తుందనే ఉద్దేశంతో జడ్డూ, యాష్‌ ఇద్దరినీ ఆడించడంతో శార్దూల్‌కు చోటు దొరకలేదు. నిజానికి వారిద్దర్లో ఎవరో ఒకరుంటే పరుగులు చేయడం వికెట్లు తీయడంలో సాయంగా ఉండేవారు. తొలిరోజు వర్షం కురిసినప్పుడైనా జట్టును మార్చి అదనపు పేసర్‌ను తీసుకున్నా బాగుండేదని కొందరు అంటున్నారు. షమి, ఇషాంత్‌, బుమ్రా కట్టుదిట్టంగా బంతులేసినప్పటికీ వికెట్లు తీసేందుకు ప్రత్యేక ప్రణాళికలేమీ వేయనట్టే అనిపించింది. బ్యాటింగ్‌ విభాగంలోనూ ఆ లోటు కనిపించింది.


ప్రతివ్యూహం ఏది?

భారత్‌లో కనిపించిన మరో లోపం కివీస్‌ బౌలింగ్‌ దాడికి ప్రతిఘటన లేకపోవడం. న్యూజిలాండ్‌లో పర్యటించినప్పుడే అక్కడి బౌలర్లు టీమ్‌ఇండియాకు చుక్కలు చూపించారు. బంతులను స్వింగ్‌ చేస్తూ క్రాస్‌సీమ్‌తో ఇబ్బంది పెట్టారు. ఇంగ్లాండ్‌లోనూ అచ్చంగా అవే పరిస్థితులు ఉంటాయి. అలాంటప్పుడు కివీస్‌ బౌలింగ్‌ వ్యూహాలకు ప్రతి వ్యూహాలు రచించాలి. కానీ కైల్‌ జేమీసన్‌, టిమ్‌ సౌథీ, ట్రెంట్‌ బౌల్ట్‌ బంతుల్ని ఎదుర్కొనేందుకు ప్రత్యేక కసరత్తులు చేయలేదని అనిపిస్తోంది. కివీస్‌ బౌలర్లు పదేపదే ఆఫ్ స్టంప్‌కు దూరంగా బంతులను స్వింగ్‌ చేశారు. హఠాత్తుగా ఇన్‌స్వింగర్లు వేసి వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నారు. కొన్ని బంతులు ఆడాలో వద్దో నిర్ణయించుకోలేక భారత క్రికెటర్లు సందిగ్ధంలో పడిపోయారు. అవి బ్యాటు అంచులకు తగిలి కీపర్‌కు లేదా స్లిప్‌లో ఫీల్డర్లకు దొరికేశాయి. విరాట్‌ కోహ్లీ, అజింక్య రహానె, పుజారాను వారు ఇలాగే ఔట్‌ చేశారు. ఎక్కడా గతి తప్పిన బంతులు విసరలేదు. కోహ్లీసేన ఆత్మరక్షణతో ఆడుతూ బౌలర్లపై దాడి చేయకపోవడంతో వారు ఒకే ప్రాంతాల్లో బంతులేసి ఫలితం రాబట్టారు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు