WTC Final: ముగిసిన మూడో రోజు ఆట.. ఆసీస్‌ ఆధిక్యం 296 పరుగులు

డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌లోఆస్ట్రేలియా భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. మూడో రోజు ఆట ముగిసేసమయానికి ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో 123/4 స్కోరు సాధించింది.

Updated : 09 Jun 2023 23:59 IST

లండన్‌: ఆస్ట్రేలియా - భారత్ జట్ల మధ్య జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ (WTC Final 2023) మ్యాచ్‌ మూడో రోజు ఆట ముగిసింది. ఆస్ట్రేలియా భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. ప్రస్తుతం ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. దీంతో ఆసీస్‌ మొత్తం ఆధిక్యం 296 పరుగులకు చేరింది. ప్రస్తుతం క్రీజ్‌లో కామెరూన్ గ్రీన్ (7*), మార్నస్‌ లబుషేన్ (41*) ఉన్నారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 2, సిరాజ్‌, ఉమేశ్‌ యాదవ్ తలో వికెట్‌ తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 469 పరుగులు చేయగా.. భారత్‌ 296 పరుగులకు ఆలౌటైంది.

భారీ మొదటి ఇన్నింగ్స్‌ (173 పరుగులు) ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆసీస్‌ను సిరాజ్‌ తొలి దెబ్బ కొట్టాడు. డేవిడ్ వార్నర్ (1)ను సిరాజ్‌ ఔట్ చేశాడు. ఆ తర్వాత ఉస్మాన్ ఖవాజా (13)  కాసేపు పోరాడినా.. ఉమేశ్‌ యాదవ్‌ బౌలింగ్‌లో కీపర్‌ చేతికి చిక్కాడు. ఆ తర్వాత వచ్చిన లబుషేన్ - స్మిత్ (34) కలిసి మూడో వికెట్‌కు 62 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారుతున్న వీరి జోడిని జడేజా విడగొట్టాడు. భారీ షాట్‌కు యత్నించి శార్దూల్ చేతికి చిక్కాడు.  తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన ట్రావిస్‌ హెడ్‌ (18)ను కూడా జడేజా సూపర్‌ రిటర్న్ క్యాచ్‌తో ఔట్ చేశాడు. వికెట్లు పడుతున్నా లబుషేన్ మాత్రం క్రీజ్‌లో పాతుకుపోయాడు.

రహానె - శార్దూల్ హాఫ్ సెంచరీలు

ఓవర్‌ నైట్‌ 151/5 స్కోరుతో మూడో రోజును ప్రారంభించిన భారత్‌కు రెండో బంతికే షాక్‌ తగిలింది. శ్రీకర్ భరత్‌ (5)ను స్కాట్‌ బోలాండ్‌ క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. అయితే, రహానె (89) - శార్దూల్ ఠాకూర్ (51) హాఫ్‌ సెంచరీలు సాధించారు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 109 పరుగులు జోడించారు. అయితే, రెండో సెషన్‌ ప్రారంభం తర్వాత రహానె ఔట్‌ కావడంతో భారత్‌ ఇన్నింగ్స్‌ ముగియడానికి ఎక్కువ సమయం పట్టలేదు. స్టార్క్‌ బౌలింగ్‌లో సిరాజ్‌ను ఎల్బీగా అంపైర్‌ ప్రకటించాడు. అయితే, సిరాజ్‌ వెంటనే డీఆర్‌ఎస్‌కు వెళ్లాడు. అప్పటికే ఆసీస్‌ ఫీల్డర్లు డగౌట్‌కు వెళ్లేందుకు సిద్ధం కావడం గమనార్హం. సమీక్షలో నాటౌట్‌గా తేలడంతో ఆసీస్‌ ఆటగాళ్లు నిరాశగా వెనక్కి వచ్చారు. కానీ, ఇదే ఓవర్‌ నాలుగో బంతికి షమీ (13) ఔట్‌ కావడంతో భారత్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది.  ఆసీస్‌ బౌలర్లు ప్యాట్ కమిన్స్ 3, స్టార్క్ 2, బోలాండ్ 2, గ్రీన్ 2, లైయన్ ఒక వికెట్ తీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని