WTC Final - Aus vs Ind: నాయకా.. ఇదే మంచి తరుణం!

రోహిత్‌ శర్మను టీమ్‌ఇండియా కెప్టెన్‌గా చూడాలన్నది ఎప్పట్నుంచో అభిమానుల కల! ఐపీఎల్‌లో మేటి సారథిగా రుజువు చేసుకున్నప్పటికీ.. అతడి చేతికి భారత జట్టు పగ్గాలు రావడానికి కాస్త ఎక్కువ సమయమే పట్టింది.

Updated : 06 Jun 2023 09:51 IST

రోహిత్‌ శర్మను టీమ్‌ఇండియా కెప్టెన్‌గా చూడాలన్నది ఎప్పట్నుంచో అభిమానుల కల! ఐపీఎల్‌లో మేటి సారథిగా రుజువు చేసుకున్నప్పటికీ.. అతడి చేతికి భారత జట్టు పగ్గాలు రావడానికి కాస్త ఎక్కువ సమయమే పట్టింది. కానీ టీమ్‌ఇండియా కెప్టెన్‌ అయ్యాక రోహిత్‌ ఘనంగా ఏం సాధించాడు అంటే.. జవాబు లేదు! బ్యాటింగ్‌లోనూ హిట్‌మ్యాన్‌ ఫామ్‌ ఆశించిన స్థాయిలో లేదు. ఇప్పుడు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ రూపంలో బ్యాటర్‌గా తనేంటో చాటి చెప్పడానికి.. కెప్టెన్‌గా జట్టుకు ఓ అపురూప విజయం అందించడానికి రోహిత్‌ ముందు మంచి అవకాశం ఉంది.

ఈనాడు క్రీడావిభాగం

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో ఆస్ట్రేలియాను ఎదుర్కోవడం భారత్‌కు అంత తేలిక కాదనే అంటున్నారు మాజీలు, విశ్లేషకులు. భీకరమైన పేస్‌ దళం, పైగా వారికి అనుకూలించే పరిస్థితులు.. ఇవే ఆస్ట్రేలియాను ఫేవరెట్‌గా నిలుపుతున్నాయి. కాబట్టి రోహిత్‌కు ఈ మ్యాచ్‌ కఠిన పరీక్షగానే భావిస్తున్నారు. కానీ కఠిన ప్రత్యర్థిని, ప్రతికూల పరిస్థితుల్లో ఎదుర్కొని పైచేయి సాధిస్తే.. ఆ విజయానికి వచ్చే విలువే వేరు. ఆ కోణంలో చూస్తే రోహిత్‌కు ఇది మంచి అవకాశమే. తన బ్యాటింగ్‌ సామర్థ్యాన్ని, నాయకత్వ లక్షణాలను ప్రశ్నిస్తున్న వారికి ఒకేసారి సమాధానం చెప్పడానికి డబ్ల్యూటీసీ ఫైనల్‌ సరైన వేదిక.

టీ20లను పక్కన పెడితే..

రోహిత్‌ పూర్తి స్థాయిలో టీమ్‌ఇండియా పగ్గాలు అందుకుని ఏడాది దాటింది. కానీ మూడు ఫార్మాట్లలో జట్టును నడిపించింది తక్కువ. టీ20ల్లో మాత్రమే పెద్ద టోర్నీల్లో జట్టుకు నాయకత్వం వహించాడు. అతడి సారథ్యంలో ఆసియా కప్‌, టీ20 ప్రపంచకప్‌ల్లో టీమ్‌ఇండియా విఫలమైంది. టెస్టుల్లో, వన్డేల్లో కెప్టెన్‌గా అతడి ప్రదర్శన బాగుంది. రోహిత్‌ పూర్తి స్థాయిలో పగ్గాలందుకున్నాక  ఆరు వన్డే సిరీస్‌ల్లో భారత్‌ నాలుగు నెగ్గింది. రెండు ఓడింది. అయిదు టెస్టుల్లో (అన్నీ సొంతగడ్డపైనే) మూడు గెలిచిన రోహిత్‌.. ఒకటి ఓడాడు. ఒక మ్యాచ్‌ డ్రా అయింది. టెస్టుల్లో అతడికి డబ్ల్యూటీసీ ఫైనల్‌ రూపంలో పెద్ద సవాల్‌ ఇప్పుడే ఎదురవుతోంది. అయితే ఈ మ్యాచ్‌ ముంగిట రోహిత్‌ ఫామ్‌ ఆశాజనకంగా లేదు. ఐపీఎల్‌లో పేలవ ప్రదర్శన చేశాడు. అంతకుముందు అంతర్జాతీయ క్రికెట్లో కూడా రోహిత్‌ ఫామ్‌ సాధారణమే. కానీ ఇంగ్లాండ్‌లో హిట్‌మ్యాన్‌కు మంచి రికార్డే (5 టెస్టుల్లో 402 పరుగులు) ఉంది. ఫైనల్‌ జరగబోతున్న ఓవల్‌లో ఇంగ్లాండ్‌పై అతను సెంచరీ చేయడం విశేషం. ఇంగ్లాండ్‌ పిచ్‌లపై రోహిత్‌కు మంచి అవగాహనే ఉంది కాబట్టి పెద్దగా అనుభవం లేని శుభ్‌మన్‌ గిల్‌తో కలిసి జట్టుకు మంచి ఆరంభాలనివ్వాల్సిన బాధ్యత తనపై ఉంది. ఇక కెప్టెన్‌గా మంచి వ్యూహ చతురత ఉన్నవాడిగా తనకున్న పేరును అతను ఈ మ్యాచ్‌లో నిలబెట్టుకోవాల్సి ఉంది. ప్రత్యర్థి ఎంత బలంగా ఉన్నా, పరిస్థితులు ప్రతికూలమైనా.. ఆత్మవిశ్వాసంతో ఆడితే పైచేయి సాధించడం కష్టమేమీ కాదని టీమ్‌ఇండియా గత కొన్నేళ్లలో అనేక మ్యాచ్‌ల్లో రుజువు చేసింది. ఈ దిశగా జట్టులో స్థైర్యం నింపడం రోహిత్‌ ముందున్న ప్రధాన కర్తవ్యం. అలాగే మేలిమి కూర్పుతో సరైన జట్టును బరిలోకి దించడం.. పేసర్లను సమర్థంగా ఉపయోగించుకోవడం.. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలు రూపొందించడంలో రోహిత్‌ తన ముద్రను చూపించాల్సి ఉంది. పరిమిత ఓవర్ల క్రికెట్లో ప్రపంచ మేటి బ్యాటర్లలో ఒకడిగా పేరున్న రోహిత్‌కు.. టెస్టుల్లో చెప్పుకోదగ్గ మైలురాళ్లు లేవు. కెరీర్‌ చరమాంకంలో ఉన్న రోహిత్‌.. టెస్టుల్లో ఇంకెంతో కాలం కొనసాగకపోవచ్చు. కాబట్టి ఈ మ్యాచ్‌లో ఉత్తమ బ్యాటింగ్‌ ప్రదర్శన, నాయకత్వ లక్షణాలతో జట్టును గెలిపిస్తే టెస్టు కెరీర్‌కు ఘనమైన ముగింపు దక్కినట్లే!


ఆ ఇద్దరూ అందుకోవాలి..

డబ్ల్యూటీసీ ఫైనల్లో పేరుకు రోహిత్‌ ఒక్కడే కెప్టెన్‌ కానీ.. మంచి రికార్డున్న మరో ఇద్దరు కెప్టెన్ల అండ కూడా జట్టుకు ఉంది. భారత క్రికెట్‌ చరిత్రలోనే కెప్టెన్‌గా టెస్టుల్లో అత్యధిక విజయాలందుకోవడమే కాక.. విదేశాల్లో మెరుగైన రికార్డున్న విరాట్‌ కోహ్లికి తోడు.. ఆస్ట్రేలియాలో తాత్కాలిక సారథిగా చారిత్రక విజయాన్నందించిన రహానె ఇప్పుడు జట్టులో సభ్యులు. కెప్టెన్సీ వదులుకున్న కొత్తలో కోహ్లిలో ఉత్సాహం తగ్గి, తన ఆట మీదా ప్రభావం పడింది. కానీ గత కొన్ని నెలల్లో విరాట్‌ ఆటతో పాటు తన తీరూ మారింది. రోహిత్‌ నాయకత్వంలో ఆడే విషయంలో అతను బాగానే సర్దుకున్నట్లు కనిపిస్తున్నాడు. ఇక భేషజాలు పక్కన పెట్టి డబ్ల్యూటీసీ ఫైనల్లో జట్టును గెలిపించడానికి బ్యాటర్‌గా చేయాల్సిందంతా చేస్తూనే రోహిత్‌కు వ్యూహాల్లో విరాట్‌ సహకరించాల్సిన అవసరముంది. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో ఆస్ట్రేలియాపై భారత జట్టుకు చిరస్మరణీయ సిరీస్‌ విజయాన్నందించిన రహానె సైతం ఇప్పుడు నాయకత్వ బృందంలో తన వంతు పాత్ర పోషించాల్సిన అవసరముంది. బ్యాటింగ్‌ పరంగా మిడిలార్డర్లో అతను కీలకం. రోహిత్‌ కూడా వీళ్లిద్దరితో సమన్వయం చేసుకుని జట్టును సమష్టిగా నడిపిస్తే కంగారూలను కొట్టడం కష్టమేమీ కాదు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని