Euro 2024 semifinal: స్పెయిన్‌ వదల్లేదు

టైటిల్‌ ఫేవరెట్లలో ఒకటైన స్పెయిన్‌ జట్టు యూరో 2024 ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీఫైనల్లో వెనుకబడి పుంజుకున్న ఆ జట్టు 2-1తో ఫ్రాన్స్‌పై విజయం సాధించింది.

Published : 11 Jul 2024 03:38 IST

యూరో సెమీస్‌లో 2-1తో  ఫ్రాన్స్‌పై విజయం
గోల్‌ కొట్టిన 16 ఏళ్ల యమాల్‌ 
మ్యూనిక్‌

టైటిల్‌ ఫేవరెట్లలో ఒకటైన స్పెయిన్‌ జట్టు యూరో 2024 ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీఫైనల్లో వెనుకబడి పుంజుకున్న ఆ జట్టు 2-1తో ఫ్రాన్స్‌పై విజయం సాధించింది. యూరో చరిత్రలో గోల్‌ కొట్టిన అత్యంత పిన్న వయస్కుడిగా 16 ఏళ్ల స్పెయిన్‌ కుర్రాడు లమైన్‌ యమాల్‌ రికార్డు సృష్టించాడు.  

యూరో ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌లో స్పెయిన్‌ జోరు కొనసాగుతోంది. క్వార్టర్స్‌లో జర్మనీ సవాల్‌ను కాచుకున్న ఆ జట్టు.. ఫ్రాన్స్‌తో సెమీస్‌లో గొప్ప పోరాట పటిమతో విజయాన్నందుకుంది. స్పెయిన్‌ తరఫున యమాల్‌ (21), ఒల్మో (25వ) చెరో గోల్‌ కొట్టగా.. ఫ్రాన్స్‌ తరఫున నమోదైన ఏకైక గోల్‌ను కొలో మౌని (9వ) సాధించాడు. ఒక యూరోలో ఆరు మ్యాచ్‌లు గెలిచిన తొలి జట్టుగా మూడుసార్లు ఛాంపియన్‌ స్పెయిన్‌ ఘనత సాధించింది. మంచి ఎటాకింగ్‌ ఉన్నా.. అంచనాల మేర ఆడలేకపోయిన ఫ్రాన్స్‌ విమర్శలు ఎదుర్కోక తప్పదు. సెమీఫైనల్‌కు ముందు టోర్నీలో ఆ జట్టు మూడు గోల్స్‌ మాత్రమే కొట్టింది.

ఫ్రాన్సే మొదలెట్టినా..: సెమీఫైనల్‌ మ్యాచ్‌ ఆసక్తికరంగా మొదలైంది. ఫ్రాన్స్‌ 9వ నిమిషంలోనే గోల్‌ కొట్టి స్పెయిన్‌కు షాకిచ్చింది. ఎంబాపె క్రాస్‌ను తలతో నెట్లోకి కొట్టిన రండాల్‌ కొలో మౌని.. ఫ్రాన్స్‌ను ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. కానీ ఫ్రాన్స్‌ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. దీటుగా స్పందించిన స్పెయిన్‌ 21వ నిమిషంలో యమాల్‌ గోల్‌తో స్కోరు సమం చేసింది. అతడు కళ్లు చెదిరే రీతిలో 25 గజాల దూరం నుంచి టాప్‌ కార్నర్‌కు బంతిని కొట్టాడు. రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగిన స్పెయిన్‌ మరో నాలుగు నిమిషాల్లోనే ఆధిక్యంలోకి దూసుకెళ్లి మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేసింది. ప్రత్యర్థి బాక్స్‌లోకి దూసుకెళ్లిన డానీ ఒల్మో కుడి వైపు నుంచి షాట్‌ కొట్టగా.. అది ఫ్రాన్స్‌ ఆటగాడు జులెస్‌ కౌందెను తగిలి నెట్లోకి వెళ్లింది. ముందు దాన్ని యూఈఎఫ్‌ఏ సెల్ఫ్‌ గోల్‌గా ప్రకటించినా.. తర్వాత ఒల్మో ఖాతాలో వేసింది. విరామానికి స్పెయిన్‌ 2-1తో ఆధిక్యంలో నిలిచింది. ఫ్రాన్స్‌ ద్వితీయార్ధంలో బంతిని ఎక్కువ భాగం తన నియంత్రణలోనే ఉంచుకున్నా.. స్కోరు సమం చేయలేకపోయింది. 76వ నిమిషంలో ఆ జట్టు ఆటగాడు హెర్నాండెజ్‌ షాట్‌ బార్‌పై నుంచి వెళ్లింది. స్పెయిన్‌ కూడా ఆధిక్యాన్ని పెంచుకోవడానికి గట్టి ప్రయత్నమే చేసింది. యమాల్‌ స్ట్రైక్‌ ఒకటి బార్‌కు కొద్దిగా పైనుంచి వెళ్లింది. స్పెయిన్‌ ఫైనల్లో ఇంగ్లాండ్‌ లేదా నెదర్లాండ్స్‌తో తలపడుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని