Yashasvi Jaiswal: యశస్వి విశ్వరూపం.. ఐపీఎల్ చరిత్రలోనే సరికొత్త రికార్డు

కోల్‌కతాపై  రాజస్థాన్‌ రాయల్స్‌ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (98*; 47 బంతుల్లో) అదరగొట్టాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్‌లో కొత్త రికార్డును నమోదు చేశాడు. 

Updated : 12 May 2023 09:01 IST

ఇంటర్నెట్ డెస్క్: ఈ సీజన్‌లో ముంబయి ఇండియన్స్‌పై (124; 62 బంతుల్లో 16 ఫోర్లు, 8 సిక్స్‌లు)తో శతక్కొట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) మరోసారి తన విశ్వరూపం ప్రదర్శించాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై (98*; 47 బంతుల్లో 13 ఫోర్లు, 5 సిక్స్‌లు) వీర విహారం చేశాడు. ఎడాపెడా ఫోర్లు, సిక్సర్లు బాదుతూ కోల్‌కతా బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 13 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడంటే అతడి విధ్వంసం ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఐపీఎల్‌ చరిత్రలోనే ఫాస్టెస్ట్ హాఫ్‌ సెంచరీ ఇదే కావడం విశేషం. అంతకుముందు ఈ రికార్డు కేఎల్ రాహుల్ (14 బంతుల్లో, 2018), పాట్‌ కమిన్స్‌ (14 బంతుల్లో, 2022) పేరిట ఉండేది.

150 పరుగుల లక్ష్యఛేదనలో యశస్వి తొలి ఓవర్‌ నుంచే బాదుడు మొదలెట్టాడు. నితీశ్‌ రాణా వేసిన మొదటి ఓవర్‌లో వరుసగా 6, 6, 4, 4, 2, 4 బాది 26 పరుగులు రాబట్టి తన ఉద్దేశాన్ని చాటాడు. హర్షిత్ రాణా వేసిన రెండో ఓవర్‌లో ఆడిన మూడు బంతుల్లో 1, 4, 6 పరుగులు చేశాడు. శార్దూల్‌ ఠాకూర్‌ వేసిన మూడో ఓవర్‌లో హ్యాట్రిక్‌ ఫోర్లు బాదాడు. ఆ తర్వాతి బంతికి సింగిల్‌ తీసి ఐపీఎల్‌ చరిత్రలో వేగవంతమైన అర్ధ శతకాన్ని నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో మరో బ్యాటర్ సంజూ శాంసన్ (48*; 29 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) కూడా దంచికొట్టాడు. దీంతో రాజస్థాన్‌ 13.1 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది ప్లేఆఫ్స్‌ అవకాశాలను మెరుగుపరుచుకుంది.   



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని