IND vs NZ: లఖ్‌నవూ పిచ్‌పై పాకిస్థాన్ మాజీ కెప్టెన్‌ ఆగ్రహం

భారత్‌ - న్యూజిలాండ్‌ మధ్య జరిగిన రెండో టీ20లో పిచ్ ప్రభావం వల్ల ఇరుజట్లు భారీ స్కోర్‌ సాధించలేకపోయాయి. లఖ్‌నవూ పిచ్‌పై పాకిస్థాన్ మాజీ కెప్టెన్‌ సల్మాన్‌ భట్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Published : 31 Jan 2023 01:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: లఖ్‌నవూ పిచ్‌పై పాకిస్థాన్ మాజీ కెప్టెన్‌ సల్మాన్‌ భట్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. టీ20ల్లో ఇలాంటి పిచ్‌ ఉండకూడదన్నాడు. భారత్‌ - న్యూజిలాండ్‌ మధ్య జరిగిన రెండో టీ20లో పిచ్‌ ప్రభావం వల్ల ఇరుజట్ల బ్యాటర్లు భారీ స్కోర్‌ సాధించలేకపోయారు. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌ కేవలం 99 పరుగులే చేయగలిగింది. భారత్‌ విజయం సాధించినప్పటికీ లక్ష్య ఛేదనలో తీవ్రంగా ఇబ్బందిపడింది. 

‘‘లఖ్‌నవూ పిచ్‌ కొంచెం కూడా బాగోలేదు. టీ20ల్లో ఇలాంటి పిచ్‌ ఉండకూడదు. ఆట అన్నాక కొంచెం కఠినంగా, ఛాలెంజింగ్‌గా ఉండాలి. కానీ ఇది అంతకు మించి ఉంది. ఫాస్ట్ బౌలర్ల నుంచి బంతి జారిపోతుంది. స్పిన్నర్లు వేసే బంతి ఎక్కువ బౌన్స్‌ అవుతుంది. అటువంటి పిచ్‌లో బ్యాటర్లు ఎప్పటికీ స్థిరపడలేరు. ఇరుజట్ల బ్యాటర్లు రనౌట్‌ అయ్యారు. ఇలాంటి పిచ్‌లపై ఆడేటప్పుడు ఆటగాళ్లకు అయోమయంగా ఉంటుంది. భారీ షాట్లు ఆడాలో? వద్దో? కూడా అర్థం కాదు. బౌన్సర్‌ను ఎదుర్కోవడానికి స్వీప్‌ లేదా రివర్స్‌ స్వీప్‌ ఆడతారు. శుభ్‌మన్‌గిల్‌, రాహుల్‌ త్రిపాఠీ సైతం అలాగే ప్రయత్నించి ఔటయ్యారు’’ అని పేర్కొన్నాడు. మూడు టీ20ల సిరీస్‌లో ఇరు జట్లూ 1-1తో సమంగా ఉంది. సిరీస్‌ విజేతను తేల్చే మూడో మ్యాచ్‌ ఫిబ్రవరి 1న అహ్మదాబాద్‌లో జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని