
Ravi Shastri : ఒక్క సిరీస్‌లో ఓడిపోతే.. జట్టు ప్రమాణాలు పడిపోయినట్లేనా.? : రవిశాస్త్రి
ఇంటర్నెట్ డెస్క్ : దక్షిణాఫ్రికా పర్యటనలో టీమ్ఇండియా విఫలం కావడంపై సర్వత్రా విమర్శలు నెలకొన్న నేపథ్యంలో.. మాజీ కోచ్ రవిశాస్త్రి భిన్నంగా స్పందించాడు. ఒక్క సిరీస్‌లో ఓడిపోయినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. భారత జట్టుకు ఈ దశ తాత్కాలికమేనని అన్నాడు. ఆడిన ప్రతి మ్యాచ్ గెలవడం ఎవరికీ సాధ్యం కాదని, త్వరలోనే టీమ్ఇండియా పుంజుకొంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
‘టీమ్ఇండియా ఒక్క సిరీస్‌లో ఓడిపోయినా.. కొందరు విమర్శించడం మొదలు పెడతారు. ఆడిన ప్రతి మ్యాచ్‌లో విజయం సాధించడం ఎవరికీ సాధ్యం కాదు. క్రికెట్లో గెలుపోటములు సహజమే. గత ఐదేళ్లుగా 65 శాతం విజయాలతో అగ్రగామి జట్టుగా ఉన్నాము. ఈ విజయాలు చూసి ప్రత్యర్థి జట్లు ఆందోళన చెందాలి కానీ మనం కాదు. ఒక్క సిరీస్‌లో ఓడినంత మాత్రాన.. జట్టు ప్రమాణాలు ఎలా దిగజారిపోతాయి? త్వరలోనే టీమ్ఇండియా పుంజుకుంటుందనే నమ్మకం ఉంది’ అని రవిశాస్త్రి ఆశాభావం వ్యక్తం చేశాడు.
* అది కోహ్లీ వ్యక్తిగతం..
టీమ్ఇండియా టెస్టు కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ వీడ్కోలు పలకడంపై రవిశాస్త్రి స్పందించాడు. అది అతడి వ్యక్తిగతమని పేర్కొన్నాడు. ‘టీమ్ఇండియా టెస్టు కెప్టెన్సీ వదులుకోవడం విరాట్ కోహ్లీ వ్యక్తిగత నిర్ణయం. అతడి నిర్ణయాన్ని మనం గౌరవించాలి. ప్రతి దానికి ఓ ముగింపు ఉంటుంది. గతంలో చాలా మంది దిగ్గజ ఆటగాళ్లు కూడా తమ బ్యాటింగ్‌పై దృష్టి పెట్టేందుకు కెప్టెన్సీని వదిలిపెట్టారు. అది సచిన్ టెండూల్కర్, సునీల్ గావస్కర్, ఎంఎస్ ధోని ఇలా ఎవరైనా కావొచ్చు. ప్రస్తుతం కోహ్లీ వంతు వచ్చిందంతే. దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌ను నేను చూడలేదు. అయినా, కెప్టెన్సీని వదిలేసినంత మాత్రాన కోహ్లీ బాడీలాంగ్వేజ్‌లో మార్పులొస్తాయని అనుకోవడం లేదు. దాదాపు ఏడేళ్ల తర్వాత నేను విరామం తీసుకున్నాను. ఇన్నేళ్లు భారత జట్టులో భాగమైనందుకు సంతోషంగా ఉంది. కోచ్‌గా నా పదవీకాలం ముగిసినప్పటి నుంచి భారత క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాను. నా నేతృత్వంలో ఆడిన ఆటగాళ్ల గురించి బహిరంగ వేదికలపై చర్చించలేను. క్రికెట్లో కమ్యూనికేషన్ చాలా ముఖ్యమైన విషయం. కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడం వెనుక ఏం జరిగిందో నాకు తెలియదు. ఇరువర్గాలతో మాట్లాడితే కానీ.. నేను ఈ వివాదంపై స్పందించలేను. అప్పటి వరకు మౌనంగా ఉండటమే మంచిది. తెరవెనుక ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకున్నాకే స్పందించడం మేలు’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.
* ఐసీసీ కప్పులు సాధిస్తేనే.. దిగ్గజ ఆటగాళ్లనడం సరికాదు..
కెప్టెన్‌గా సాధించిన ఐసీసీ కప్పులను బట్టే అతడి స్థాయిని అంచనా వేయడం సరికాదని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ‘మనం క్రికెట్ దిగ్గజాలుగా చెప్పుకునే చాలా మంది ఆటగాళ్లు కూడా భారత్‌కి ప్రపంచకప్‌ను అందించలేకపోయారు. అది సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే ఇలా ఎవరైనా కావొచ్చు. అంత మాత్రాన వారు టీమ్ఇండియాకు అందించిన సేవలను తీసి పారేయగలమా ? భారత్‌కు ప్రపంచకప్‌లు అందించిన కెప్టెన్లు ఎంత మంది ఉన్నారు? దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ కూడా ఆరు ప్రపంచకప్‌లు ఆడితే.. ఒక్క సారి మాత్రమే భారత్ విశ్వవిజేతగా నిలిచింది. అందుకే అలాంటి ప్రమాణాల ఆధారంగా ఆటగాళ్ల స్థాయిని అంచనా వేయడం సరికాదు’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఇటీవల ముగిసిన దక్షిణాఫ్రికా పర్యటనలో టీమ్ఇండియా.. 1-2 తేడాతో టెస్టు సిరీస్‌ను, 0-3 తేడాతో వన్డే సిరీస్‌ను కోల్పోయిన విషయం తెలిసిందే.