అప్పుడు నటరాజన్‌ గుండె చప్పుడు చూడొచ్చు!

హమ్మయ్య.. మూడో వన్డేలో ఇంగ్లాండ్‌పై భారత్‌ జట్టు గెలిచింది. చివరి వరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో విజయం టీమిండియానే

Published : 30 Mar 2021 01:06 IST

న్యూదిల్లీ: హమ్మయ్య.. మూడో వన్డేలో ఇంగ్లాండ్‌పై భారత్‌ జట్టు గెలిచింది. చివరి వరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో విజయం టీమిండియానే వరించింది. అందరూ రిషబ్‌ పంత్‌ అద్భుత బ్యాటింగ్‌, శార్దూల్‌ ఠాకూర్‌ 4/67 బౌలింగ్‌ గణాంకాలను మెచ్చుకుంటున్నారు. ఆఖరికి భారత్‌పై ఒంటరి పోరాటం చేసిన ఇంగ్లీష్ బ్యాట్స్‌మన్‌ సామ్‌ కరన్‌ను సైతం కొనియాడుతున్నారు. అయితే, చివరి ఓవర్‌ వేసిన టి.నటరాజన్‌ను మాత్రం ఇంగ్లాండ్‌ మాజీ ఆటగాడు మైఖేల్‌ వాన్‌ ప్రశంసలతో ముంచెత్తాడు. 6 బంతుల్లో 14 పరుగులు.. అదీ చివరి ఓవర్‌ ఏమాత్రం తేడా వచ్చినా గెలుపు తలుపులు మూసుకుపోతాయి. అంతటి ఒత్తిడిలోనూ నటరాజన్‌ తన యార్కర్‌లతో మాయ చేశాడని వాన్‌ అభినందించాడు.

‘‘క్రికెట్‌లో తెల్లబంతి రాజ్యమేలుతున్న తరుణంలో అదొక అద్భుతమైన ఆర్ట్‌. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో టీ20లు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆటగాళ్లు ఆడుతున్నారు. అయితే ఎంతమంది బౌలర్లు అద్భుతంగా యార్కర్లు విసరగలరో మీరు ఊహించగలరా? అలాంటి బంతులను ఎదుర్కోవడం నిజంగా కష్టమే. ఏమాత్రం మిస్సయినా స్టాండ్స్‌లోకి వెళ్లాల్సిందే. తీవ్ర ఒత్తిడిలోనూ అలాంటి యార్కర్లను సంధించిన ఆటగాళ్లు లసిత్‌ మలింగ, బ్రెట్‌లీలను చూడవచ్చు’’

‘‘మూడో వన్డేలో ఇలాంటి పరిస్థితే ఎదురైంది. సామ్‌ కరన్‌కు నిజంగా అది క్లిష్టమైన పరిస్థితే. అప్పటికే నటరాజన్‌ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లోనూ తక్కువ ఎత్తులో సామ్‌కరన్‌ ప్యాడ్స్‌ తగిలేలా బంతిని విసిరాడు. లక్షల మంది మ్యాచ్‌ చూస్తున్న సమయంలో బౌలింగ్‌ చేస్తున్న నటరాజన్‌  గుండె చప్పుడు ఏంటో అతని ముఖంలో చూడొచ్చు. సరైన యార్కర్‌ వేసి మ్యాచ్‌ను గెలిపించిన నటరాజన్‌ను ఎంత అభినందించినా తక్కువే’’ అని వాన్‌ ప్రశంసల జల్లు కురిపించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని