Ravindra Jadeja : కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం జడేజాకు అవమానంగా ఉందేమో: షేన్‌ వాట్సన్‌

చెన్నై కెప్టెన్సీ నుంచి జడేజా తప్పుకోవడంపై ఆ జట్టు మాజీ ఆల్‌రౌండర్‌ షేన్‌ వాట్సన్‌ స్పందించాడు. జడేజాపై జాలి కలుగుతోందన్నాడు.......

Published : 08 May 2022 02:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత టీ20 లీగ్‌ గత సీజన్‌ విజేత చెన్నై ఈసారి అంచనాలను అందుకోలేకపోతోంది. సీజన్‌ ప్రారంభంలో కెప్టెన్సీ పగ్గాలను అందుకున్న ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా జట్టును సమర్థంగా నడిపించలేకపోయాడు. నాయకత్వ భారం పడుతుండటంతో ఆ పదవి నుంచి తప్పుకోగా..  దీంతో ఆ బాధ్యతలను మళ్లీ  ధోనీ అందుకున్నాడు. అయితే కెప్టెన్సీ నుంచి జడేజా తప్పుకోవడంపై ఆ జట్టు మాజీ ఆల్‌రౌండర్‌ షేన్‌ వాట్సన్‌ స్పందించాడు. జడేజాపై జాలి కలుగుతోందన్నాడు. అతడికి ఇది అవమానకరంగా అనిపిస్తోందేమోనని పేర్కొంటూ అండగా నిలిచాడు.

‘ధోనీ లాంటి గొప్ప నాయకుడి నుంచి చెన్నై పగ్గాలను జడేజా అందుకోబోతున్నాడని తెలిసి చాలా సంతోషించా. చరిష్మా ఉన్న కెప్టెన్‌ నుంచి ఆ బాధ్యలు స్వీకరించడమంటే సవాలుతో కూడుకున్న విషయం. జడేజా గొప్ప వ్యక్తి. తనను తాను మెరుగుపరుచుకుంటున్న అద్భుతమైన నైపుణ్యం కలిగిన క్రికెటర్‌. కానీ ప్రస్తుతం అతడి పరిస్థితి చూస్తే బాధగా ఉంది. తనను తాను ఈ స్థితిలో చూసుకునేందుకు ఇష్టపడటంలేదేమో. ఒత్తిడి ఉన్నప్పుడు కెప్టెన్సీని వదులుకోవడం క్లిష్టమైన అంశం. దీన్ని అవమానకరంగా భావిస్తాం. రాజస్థాన్‌ బట్టు బాధ్యతల నుంచి వైదొలిగినప్పుడు నేనూ ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొన్నా. జడేజా ఈ నిర్ణయం తీసుకోవడం.. అతడి గొప్ప వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. అతడికి నా అభినందనలు. ఏదిఏమైనప్పటికీ.. సరైన సమయంలో ధోనీ మళ్లీ జట్టు పగ్గాలను అందుకున్నాడు’ అని  వాట్సన్‌ పేర్కొన్నాడు.

జడేజా సారథ్యంలోని చెన్నై ఈ సీజన్‌లో ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో ఆరు ఓటములు నమోదుచేసింది. మరోవైపు తన ప్రదర్శనపై నాయకత్వ భారం పడుతోందని జడ్డూ భావించాడు. ఈ నేపథ్యంలోనే అతడు కెప్టెన్సీని వదులుకున్నాడు. ఈ సీజన్‌లో 10 మ్యాచ్‌ల్లో జడ్డూ 116 పరుగులు చేసి, 5 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. అనంతరం ధోనీ నాయకత్వంలో మొదటి మ్యాచ్‌లోనే ప్రత్యర్థి హైదరాబాద్‌పై చెన్నై ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపాలైంది. రేపు దిల్లీతో తలపడనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని