INDIA Vs Zimbabwe: యువ భారత్‌ బోల్తా

టీమ్‌ఇండియా టీ20 ప్రపంచకప్‌ గెలిచి వారం రోజులే అయింది. ఇంకా అభిమానులు ఆ మత్తు నుంచి బయటికి రాలేదు. ఈలోపు దిమ్మదిరిగే షాక్‌! అదే టీ20 ఫార్మాట్లో జింబాబ్వే జట్టు చేతిలో భారత జట్టు పరాభవం చవిచూసింది.

Updated : 07 Jul 2024 08:26 IST

జింబాబ్వే చేతిలో పరాభవం
116 లక్ష్యం.. 102కే ఆలౌట్‌

టీమ్‌ఇండియా టీ20 ప్రపంచకప్‌ గెలిచి వారం రోజులే అయింది. ఇంకా అభిమానులు ఆ మత్తు నుంచి బయటికి రాలేదు. ఈలోపు దిమ్మదిరిగే షాక్‌! అదే టీ20 ఫార్మాట్లో జింబాబ్వే జట్టు చేతిలో భారత జట్టు పరాభవం చవిచూసింది. మొన్నటి పొట్టి కప్పు విజయంలో భాగమైన ఏ ఆటగాడూ ఈ జట్టులో లేకపోవచ్చు. కానీ ఇందులోని యువ ఆటగాళ్లను భవిష్యత్‌ భారత జట్టు తారలుగా పరిగణిస్తున్న నేపథ్యంలో ఈ ఫలితం అనూహ్యం.

హరారె

ల్లేరుపై నడకే అనుకున్న జింబాబ్వే పర్యటనను యువ భారత్‌ అనూహ్య పరాజయంతో ఆరంభించింది. అయిదు టీ20ల సిరీస్‌లో భాగంగా శనివారం ఉత్కంఠభరితంగా సాగిన తొలి మ్యాచ్‌లో శుభ్‌మన్‌ గిల్‌ నేతృత్వంలోని భారత జట్టు 13 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. మొదట స్పిన్నర్లు రవి బిష్ణోయ్‌ (4-2-13-4), వాషింగ్టన్‌ సుందర్‌ (4-0-11-2) విజృంభించడంతో జింబాబ్వే నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 115 పరుగులే చేయగలిగింది. మడాండే (29 నాటౌట్‌; 25 బంతుల్లో 4×4) టాప్‌స్కోరర్‌. అనంతరం సికందర్‌ రజా (3/24), చటార (3/16)ల ధాటికి టీమ్‌ఇండియా 19.5 ఓవర్లలో 102 పరుగులకే కుప్పకూలింది. శుభ్‌మన్‌ గిల్‌ (31; 29 బంతుల్లో 5×4), వాషింగ్టన్‌ సుందర్‌ (27; 34 బంతుల్లో 1×4, 1×6) మినహా బ్యాటర్లు తేలిపోయారు.

టపటపా..: ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ తరఫున అభిషేక్‌ శర్మ ఎలా చెలరేగిపోయాడో చూశాం. కానీ తన తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లో అతడికి చేదు అనుభవం ఎదురైంది. పార్ట్‌టైం స్పిన్నర్‌ బెనెట్‌ బౌలింగ్‌లో అభిషేక్‌ డకౌటైపోయాడు. తర్వాత ఇన్నింగ్స్‌ అంతా షాకులే షాకులు. రుతురాజ్‌ (7) సైతం ఎంతోసేపు నిలవలేదు. అతణ్ని ముజరబాని పెవిలియన్‌ చేర్చాడు. తర్వాత చటార మ్యాజిక్‌ మొదలైంది. అతను ఒకే ఓవర్లో పరాగ్‌ (2), రింకు (0)లను ఔట్‌ చేసేశాడు. రింకు పరిస్థితులతో సంబంధం లేకుండా బాధ్యత రాహిత్య షాట్‌ ఆడి వెనుదిరిగాడు. ఈ ఓవర్‌ మెయిడెన్‌ కూడా. స్కోరు చూస్తే.. 5 ఓవర్లకు 22/4. ఈ స్థితిలో ముజరబాని బౌలింగ్‌లో శుభ్‌మన్‌ను అంపైర్‌ ఎల్బీగా ప్రకటించడంతో భారత్‌కు ఘోర పరాభవం తప్పదనిపించింది. అయితే సమీక్షలో బతికి బయటపడ్డ కెప్టెన్‌.. తర్వాత స్కోరు బోర్డును ముందుకు కదిలించాడు. జురెల్‌ (6) కాసేపు అతడికి సహకరించడంతో భారత్‌ 43/4తో కాస్త కోలుకుంది. కానీ జురెల్‌ పట్టుదలకు జాంగ్వి తెరదించాడు. తర్వాత జింబాబ్వే సారథి సికందర్‌ రజా భారత్‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు. ముందుగా శుభ్‌మన్‌ను అద్భుతమైన బంతితో బౌల్డ్‌ చేసిన అతను.. బిష్ణోయ్‌ (9)ను కూడా ఔట్‌ చేశాడు. 61/7తో భారత్‌ పతనం అంచున నిలిచింది. ఈ స్థితిలో సుందర్, అవేష్‌ (16) పోరాడడంతో భారత్‌ పుంజుకుంది. 85/7తో లక్ష్యం దిశగా సాగింది. కానీ అవేష్‌ను మసకద్జ ఔట్‌ చేశాడు. ముకేశ్‌ (0) ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. 86/9తో ఓటమి ముంగిట నిలిచిన జట్టును రక్షించడానికి సుందర్‌ పోరాడాడు. కానీ 2 ఓవర్లలో 18 పరుగులు అవసరమైన స్థితిలో జింబాబ్వే పట్టు వదల్లేదు. ముజరబాని 19వ ఓవర్లో 2 పరుగులే ఇవ్వగా.. చివరి ఓవర్లో చటార తొలి 4 బంతుల్లో 2 పరుగులే ఇవ్వడంతో భారత్‌ పనైపోయింది. అయిదో బంతికి సుందర్‌ ఔటైపోయాడు. మొదట జింబాబ్వే బ్యాటర్లు కూడా తీవ్రంగా తడబడ్డారు. రవి బిష్ణోయ్‌ కెరీర్లోనే ఉత్తమ స్పెల్‌తో ఆ జట్టును వణికించాడు. ఒక దశలో 74/3తో మెరుగైన స్థితిలో ఉన్న జింబాబ్వే.. బిష్ణోయ్, సుందర్‌ల ధాటికి 16 పరుగుల తేడాలో 6 వికెట్లు కోల్పోయి 90/9కి చేరుకుంది. అయితే మడాండే పోరాడడంతో చివరి 4 ఓవర్లలో జింబాబ్వే వికెట్‌ కోల్పోకుండా 25 పరుగులు చేసింది. చివరికి ఆతిథ్య జట్టు విజయంలో ఆ పరుగులే కీలకమయ్యాయి.

జింబాబ్వే ఇన్నింగ్స్‌: మద్వీర (బి) బిష్ణోయ్‌ 21; ఇనోసెంట్‌ కైయా (బి) ముకేశ్‌ 0; బెనెట్‌ (బి) బిష్ణోయ్‌ 22; రజా (సి) బిష్ణోయ్‌ (బి) అవేష్‌ 17; మైయర్స్‌ (సి) అండ్‌ (బి) సుందర్‌ 23; క్యాంప్‌బెల్‌ రనౌట్‌ 0; మడాండే నాటౌట్‌ 29; మసకద్జ (స్టంప్డ్‌) జురెల్‌ (బి) సుందర్‌ 0; జాంగ్వి ఎల్బీ (బి) బిష్ణోయ్‌ 1; ముజరబాని (బి) బిష్ణోయ్‌ 0; చటార నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 2 మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 115; వికెట్ల పతనం: 1-6, 2-40, 3-51, 4-74, 5-74, 6-89, 7-89, 8-90, 9-90; బౌలింగ్‌: ఖలీల్‌ అహ్మద్‌ 3-0-28-0; ముకేశ్‌ కుమార్‌ 3-0-16-1; రవి బిష్ణోయ్‌ 4-2-13-4; అభిషేక్‌ శర్మ 2-0-17-0; అవేష్‌ ఖాన్‌ 4-0-29-1; వాషింగ్టన్‌ సుందర్‌ 4-0-11-2

భారత్‌ ఇన్నింగ్స్‌: అభిషేక్‌ (సి) మసకద్జ (బి) బెనెట్‌ 0; శుభ్‌మన్‌ (బి) రజా 31; రుతురాజ్‌ (సి) కైయా (బి) ముజరబాని 7; పరాగ్‌ (సి) మవుటా (బి) చటార 2; రింకు (సి) బెనెట్‌ (బి) చటార 0; జురెల్‌ (సి) మద్వీర (బి) జాంగ్వి 6; సుందర్‌ (సి) ముజరబాని (బి) చటార 27; బిష్ణోయ్‌ ఎల్బీ (బి) రజా 9; అవేష్‌ (సి) రజా (బి) మసకద్జ 16; ముకేశ్‌ (బి) రజా 0; ఖలీల్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 4 మొత్తం: (19.5 ఓవర్లలో ఆలౌట్‌) 102; వికెట్ల పతనం: 1-0, 2-15, 3-22, 4-22, 5-43, 6-47, 7-61, 8-84, 9-86; బౌలింగ్‌: బెనెట్‌ 1-1-0-1; మసకద్జ 3-0-15-1; చటార 3.5-1-16-3; ముజరబాని 4-0-17-1; జాంగ్వి 4-0-28-1; సికందర్‌ రజా 4-0-25-3

నేడు రెండో టీ20

సాయంత్రం4.30 నుంచి

తొలి టీ20లో జింబాబ్వే చేతిలో షాక్‌ తిన్న టీమ్‌ఇండియా.. మరుసటి రోజే రెండో మ్యాచ్‌ ఆడబోతోంది. ఆదివారమే రెండో టీ20. జింబాబ్వే బౌలర్లను తేలిగ్గా తీసుకున్నారో, పిచ్‌ను సరిగా అంచనా వేయలేకపోయారో కానీ.. తొలి మ్యాచ్‌లో భారత యువ బ్యాటర్లు తేలిపోయారు. ఐపీఎల్‌లో అదరగొట్టిన అభిషేక్‌ శర్మ, రుతురాజ్, రియాన్‌ పరాగ్, రింకు సింగ్‌ తీవ్రంగా నిరాశపరిచారు. ఈ మ్యాచ్‌లో వీళ్లంతా సత్తా చాటాల్సిందే. బౌలర్లు కూడా చివరి వరకు బిగి సడలకుండా బౌలింగ్‌ చేయాల్సిందే. మరోవైపు తొలి టీ20 విజయంతో ఆతిథ్య జట్టు రెట్టించిన ఉత్సాహంతో ఈ మ్యాచ్‌ ఆడుతుందనడంలో సందేహం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని