Nitish Kumar Reddy: హార్దిక్‌ పాత్రను పోషించేందుకు సిద్ధమవుతున్నా: నితీశ్‌ కుమార్‌ రెడ్డి

భారత జెర్సీని ధరించే అవకాశం వస్తే ఆ ఆనందానికి హద్దే ఉండదు. అయితే, యువ క్రికెటర్ నితీశ్‌కు పిలుపు వచ్చినా.. గాయం కారణంగా జింబాబ్వే సిరీస్‌కు దూరం కావాల్సిన పరిస్థితి ఎదురైంది.

Published : 07 Jul 2024 14:13 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌లో అదరగొట్టిన తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్‌ రెడ్డికి (Nitish Kumar Reddy) టీమ్‌ఇండియా నుంచి పిలుపొచ్చింది. జింబాబ్వే సిరీస్‌కు ఎంపికైనప్పటికీ.. గాయం కారణంగా వైదొలగాడు. త్వరలోనే మళ్లీ భారత జట్టులోకి వస్తానని స్పష్టం చేశాడు. టీమ్‌ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్‌ పాత్రను భవిష్యత్తులో పోషించేందుకు సిద్ధమవుతున్నట్లు నితీశ్ వెల్లడించాడు. తన అభిమాన క్రికెటర్‌ విరాట్ కోహ్లీ (Virat Kohli) అని.. అతడిలా ఆడేందుకు కష్టపడతానని పేర్కొన్నాడు. 

‘‘భారత క్రికెట్‌లో నాకంటూ తప్పకుండా అవకాశం వస్తుందన్న నమ్మకం ఉంది. జట్టు అవసరాల మేరకు ఆరు లేదా ఏడో స్థానంలో బ్యాటింగ్‌ చేయొచ్చు. హార్దిక్‌ పాండ్య కూడా ఇలాంటి ప్లేస్‌మెంట్‌లోనే బ్యాటింగ్‌కు దిగేవాడు. భవిష్యత్తులో హార్దిక్ (Hardik Pandya) రోల్‌ను పోషించడానికి ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నా. టీమ్‌కు ఓపెనర్‌ అవసరం ఇప్పటికైతే లేదు. ఒకవేళ నాకు అలాంటి అవకాశం వస్తే తప్పకుండా ఓపెనింగ్‌ చేస్తా. ప్రస్తుతం మాత్రం టాప్‌-ఆర్డర్‌లో ఛాన్స్ వస్తుందని అనుకోవడం లేదు. ఇప్పటికే అనుభవజ్ఞులు అక్కడ ఉన్నారు. ఏ స్థానంలో వచ్చినా వెంటనే కుదురుకోగలననే నమ్మకంతో ఉన్నా. దేశవాళీ క్రికెట్‌లో ఆడటం కలిసొచ్చింది. 

భారత క్రికెట్‌లో (Team India) యువ తరం హవా మొదలైంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జడేజా టీ20లకు వీడ్కోలు పలికిన తర్వాత.. ఆ స్థానాలను పూరించేందుకు కుర్రాళ్లకు అవకాశం వచ్చింది. వాటిని అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. నా అభిమాన క్రికెటర్ విరాట్ కోహ్లీ. పుమా బ్రాండ్‌ అంబాసిడర్‌గా నేను ఎంపిక కావడం ఆనందంగా ఉంది. కోహ్లీ కూడా దీనికి రాయబారిగా ఉన్నాడు. రియాన్‌ పరాగ్‌ (Riyan Parag), నాలాంటి యువ క్రికెటర్లకు ఎంతో మద్దతుగా నిలిచింది’’ అని నితీశ్ వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని