Virat Kohli: కోహ్లీ సర్‌.. మిమ్మల్ని చూడ్డానికి స్కూల్‌కు డుమ్మాకొట్టి వచ్చాను

టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లీ గత రెండున్నరేళ్లుగా ఒక్క సెంచరీ చేయకపోయినా ఫాన్‌ ఫాలోయింగ్‌ ఏమాత్రం తగ్గలేదు. ఇంకా చెప్పాలంటే అది రోజురోజుకీ పెరిగిపోతోంది...

Published : 25 Jun 2022 01:36 IST

వార్మప్‌ మ్యాచ్‌లో చిన్నారి అభిమాని ఫొటో వైరల్‌

(Photo: Johns Twitter )

లీసెస్టర్‌: టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లీ గత రెండున్నరేళ్లుగా ఒక్క సెంచరీ చేయకపోయినా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఏమాత్రం తగ్గలేదు. ఇంకా చెప్పాలంటే అది రోజురోజుకీ పెరిగిపోతోంది. అందుకు నిదర్శనమే ఇటీవల అతడి ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్ల సంఖ్య 200 మిలియన్లకు చేరడం. దీంతో కోహ్లీకి భారత్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారని అర్థమవుతోంది. అతడు ఎక్కడికెళ్లినా జనం ఎగబడతారు. అతడిని దగ్గరి నుంచి చూడ్డానికి, వీలైతే ఫొటోలు, ఆటోగ్రాఫ్‌లు తీసుకోడానికి ఆసక్తి చూపుతారు. ఇప్పుడు ఇంగ్లాండ్‌లోనూ విరాట్‌కు అభిమానుల తాకిడి తగ్గడం లేదు.

లీసెస్టర్‌ జట్టుతో గురువారం ప్రారంభమైన వార్మప్‌ మ్యాచ్‌లో ఓ వీరాభిమాని ప్రత్యేకంగా నిలిచి అందరి దృష్టినీ ఆకర్షించాడు. అతడి ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ మ్యాచ్‌లో తన ఆరాధ్య క్రికెటర్‌ కోహ్లీని చూడ్డానికి ఓ స్కూల్‌ విద్యార్థి స్టేడియానికి వచ్చాడు. ఈ సందర్భంగా ఆ బుడతడు పట్టుకున్న ప్లకార్డు ఒకవైపు నవ్వులు తెప్పిస్తూనే.. మరోవైపు కోహ్లీ అంటే ఎంత ఇష్టమో తెలియజేస్తోంది. ఆ ప్లకార్డుపై ‘విరాట్‌ సర్‌.. మీరు అత్యుత్తమ క్రికెటర్‌. నేను మిమ్మల్ని చూడ్డానికి స్కూల్‌కి డుమ్మా కొట్టి మరీ వచ్చాను’ అని రాసి ఉంది. ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

ఇక ఈ మ్యాచ్‌లో విరాట్‌ (33; 69 బంతుల్లో 4x4, 1x6) మరోసారి నిరాశ పరిచాడు. సుమారు రెండు గంటలపాటు క్రీజులో నిలిచిన అతడు భారీ స్కోర్‌ చేసేలా కనిపించాడు. ఈ క్రమంలోనే యువ బ్యాటర్‌ ఎస్‌కే భరత్‌(70*)తో ఆరో వికెట్‌కు 57 పరుగులు జోడించాడు. అయితే, చివరికి రోమన్‌ వాకర్‌ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయి ఔటయ్యాడు. అనంతరం టీమ్‌ఇండియా తొలి రోజు ఆటను 246/8తో ముగించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు