Updated : 26 Feb 2021 17:29 IST

రిటైర్మెంట్‌ ప్రకటించిన యూసుఫ్ పఠాన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమిండియా ఆల్‌రౌండర్ యూసుఫ్ పఠాన్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా తెలిపాడు. తొలిసారి టీమిండియా జెర్సీ ధరించిన క్షణాలు ఇప్పటికీ గుర్తున్నాయని అన్నాడు. 2007 టీ20, 2011 వన్డే ప్రపంచకప్‌లు గెలవడం, దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ తెందుల్కర్‌ను భుజాలపై మోయడం తన కెరీర్‌లోని గొప్ప క్షణాలని తెలిపాడు. ఈ అవకాశాలు ఇచ్చిన బీసీసీఐ, బరోడా క్రికెట్‌ అసోషియేషన్‌కు ధన్యవాదాలు తెలిపాడు.

‘‘ఈ రోజు ఎంతో ప్రత్యేకమైనది. అలా అని ప్రపంచకప్‌, ఐపీఎల్‌ ఫైనల్‌ నేడు జరగట్లేదు. అయినా ఎంతో ముఖ్యమైనది. ఈ రోజుతో క్రికెట్‌ ఇన్నింగ్స్‌కు నేను ముగింపు పలుకుతున్నాను. అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు ప్రకటిస్తున్నాను. అండగా నిలుస్తూ ప్రేమను పంచిన నా దేశానికి, కుటుంబానికి, స్నేహితులు, అభిమానులు, కోచ్‌లకు కృతజ్ఞతలు. భవిష్యత్తులోనూ ఇలానే ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నా’’ అని యూసుఫ్‌ పేర్కొన్నాడు.

‘‘నా క్రికెట్‌ కెరీర్‌లో అంతర్జాతీయ, దేశవాళీ‌, ఐపీఎల్ క్రికెట్‌ ఆడాను. ధోనీ సారథ్యంలో టీమిండియాకు, షేన్‌ వార్న్‌ కెప్టెన్సీలో ఐపీఎల్‌, జాకోబ్‌ మార్టిన్‌ నాయకత్వంలో రంజీ ట్రోఫీలో తొలిసారిగా ప్రాతినిధ్యం వహించాను. నాపై నమ్మకం ఉంచి అవకాశాలు ఇచ్చిన వాళ్లకి ధన్యవాదాలు. ఇక గౌతం గంభీర్‌ నాయకత్వంలో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టును రెండు సార్లు విజేతగా నిలిపాం. నా కెరీర్‌లో ఎదురైన అన్ని పరిస్థితుల్లోనూ అండగా నిలిచిన నా సోదరుడు ఇర్ఫాన్‌ పఠాన్‌కు కృతజ్ఞతలు’’ అని పఠాన్‌ అన్నాడు.

38 ఏళ్ల యూసుఫ్‌ టీమిండియా తరఫున 57 వన్డేలు, 22 టీ20లు ఆడాడు. 1046 పరుగులు, 46 వికెట్లు తీశాడు. 2007, 2011 ప్రపంచకప్‌లు గెలిచిన భారత జట్టులో అతడు సభ్యుడు. అంతేగాక రాజస్థాన్‌, కోల్‌కతా జట్లు ఛాంపియన్‌గా నిలవడంతో అతడు కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్‌లో 174 మ్యాచ్‌లు ఆడిన అతడు ఎన్నో విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడాడు. 3204 పరుగులతో పాటు బంతితోనూ రాణించి 42 వికెట్లు తీశాడు. అయితే గత చివరి రెండు ఐపీఎల్‌ సీజన్‌ వేలాల్లో ఏ జట్టూ అతడిని కొనుగోలు చేయలేదు. దేశవాళీలో బరోడా తరఫున ప్రాతినిధ్యం వహించాడు. యూసుఫ్‌తో పాటు టీమిండియా మీడియం పేసర్‌ ఆర్‌.వినయ్‌ కుమార్‌ కూడా శుక్రవారమే రిటైర్మెంట్ ప్రకటించాడు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని