MS Dhoni: నేననుకుంటే ధోనీకి కెప్టెన్సీ ఇచ్చారు

అరంగేట్రం టీ20 ప్రపంచకప్‌లో తనకు సారథ్య బాధ్యతలు అప్పగిస్తారని భావించానని టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ల హీరో యువరాజ్‌సింగ్‌ అన్నాడు. సీనియర్లు లేకపోవడంతో అలా అనుకున్నానని తెలిపాడు. అంచనాలకు అందకుండా సెలక్టర్లు ఎంఎస్‌ ధోనీని కెప్టెన్‌గా ప్రకటించారని వెల్లడించాడు...

Published : 10 Jun 2021 20:15 IST

కెప్టెన్‌ ఎవరైనా జట్టు మనిషిగా ఉండాల్సిందే: యువీ

ముంబయి: తొలి టీ20 ప్రపంచకప్‌లో తనకు సారథ్య బాధ్యతలు అప్పగిస్తారని భావించానని టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ల హీరో యువరాజ్‌సింగ్‌ అన్నాడు. సీనియర్లు లేకపోవడంతో అలా అనుకున్నానని తెలిపాడు. అంచనాలకు అందకుండా సెలక్టర్లు ఎంఎస్‌ ధోనీని కెప్టెన్‌గా ప్రకటించారని వెల్లడించాడు. ఎవరికి సారథ్యం అప్పగించినా చివరికి జట్టు మనిషిగా ఉండాల్సిందేనని స్పష్టం చేశాడు.

ఐసీసీ 2007లో టీ20 ప్రపంచకప్‌ నిర్వహించింది. అంతకు ముందే వన్డే ప్రపంచకప్‌లో ఘోర ప్రదర్శనతో నిష్క్రమించింది. రాహుల్‌ ద్రవిడ్‌ సారథ్యం వదులుకోవడంతో కొత్త సారథిగా ఎంఎస్‌ ధోనీని ఎంపిక చేశారు. ప్రత్యేకంగా కోచ్‌లు, వ్యూహాలు లేనప్పటికీ భారత్‌ విశ్వ విజేతగా అవతరించింది. అప్పటి విశేషాలను యువీ తాజాగా పంచుకోవడం గమనార్హం.

‘అప్పటికే టీమ్‌ఇండియా 50 ఓవర్ల ప్రపంచకప్‌ ఓడిపోయింది. భారత క్రికెట్లో సందిగ్ధం నెలకొంది. ఆ తర్వాత ఇంగ్లాండ్‌లో రెండు నెలలు, దక్షిణాఫ్రికా, ఐర్లాండ్‌లో నెలరోజులు భారత్‌ పర్యటించాల్సి ఉంది. మరో నెలరోజుల వ్యవధిలోనే టీ20 ప్రపంచకప్‌ ఉంది. అంటే మొత్తంగా భారత్‌ నాలుగు నెలలు బయటే పర్యటించాలి. బహుశా సీనియర్లు విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నారేమో! ఎవరూ టీ20 ప్రపంచకప్‌ను సీరియస్‌గా తీసుకోలేదు. ఆ టోర్నీకి నాకు సారథ్య బాధ్యతలు అప్పగిస్తారని భావించా. కానీ ఎంఎస్‌ ధోనీ నాయకుడిగా ఉంటాడని ప్రకటించారు’ అని యువీ తెలిపాడు.

‘అవును, మహీ ఎంపిక ఆశ్చర్యం కలిగించింది. కానీ సారథి ఎవరైనా అతడికి మద్దతు ఇవ్వాల్సిందే. రాహుల్‌, గంగూలీ, భవిష్యత్తులో ఇంకెవరున్నా అండగా నిలవాల్సిందే. జట్టు మనిషిగా ఉండాల్సిందే. నేనలాగే ఉన్నా’ అని యువీ తెలిపాడు. అరంగేట్రం టీ20 టోర్నీకి వ్యూహాలేమీ లేవని, తోచిన విధంగా ఆడామని అతడు వివరించాడు.

‘2007 ప్రపంచకప్‌ సమయంలో మాది యువ జట్టు. మాకెవరూ అంతర్జాతీయ కోచ్‌ గానీ ప్రముఖులు గానీ లేరు. లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌ మా కోచ్‌. వెంకటేశ్‌ ప్రసాద్‌ బౌలింగ్‌ కోచ్‌గా ఉన్నారు. ఒక యువ సారథి నేతృత్వంలో మా యువ జట్టు దక్షిణాఫ్రికాకు వెళ్లింది. మాకు పెద్దగా వ్యూహాలేమీ లేవు. తొలిటోర్నీ కావడంతో టీ20 వ్యూహాలేంటో ఎవరికీ తెలియదు. తెలిసిన విధంగా ఆడాలని అనుకున్నాం’ అని యువీ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని