IND vs PAK: మేం గెలుస్తామని చెప్పావు.. ఇప్పుడు చూడు ఇలా: యువీతో అఫ్రిది

భారత్ - పాకిస్థాన్‌ మ్యాచ్‌ ముగిసినా.. ఆ పోరుపై చర్చ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. యువరాజ్‌, షాహిద్‌ అఫ్రిది మధ్య సరదా సంభాషణ నెట్టింట వైరల్‌గా మారింది.

Published : 13 Jun 2024 00:10 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup 2024) కోసం ఐసీసీ ప్రత్యేకంగా రాయబారులను నియమించిన సంగతి తెలిసిందే. భారత్‌ స్టార్‌ ఆల్‌రౌండర్ యువరాజ్‌ సింగ్‌, పాక్‌ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది అందులో భాగస్వాములే. వీరిద్దరూ భారత్ - పాక్‌ మ్యాచ్‌ సందర్భంగా మాట్లాడుకున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. మ్యాచ్‌ సగం వరకు విజయం పాక్‌ వైపే ఉన్నా.. స్టార్ పేసర్ బుమ్రా అద్భుత ప్రదర్శనతో టీమ్‌ఇండియా గెలిచింది. 

భారత్ నిర్దేశించిన 120 పరుగుల లక్ష్య ఛేదనలో పాక్ 113 పరుగులకే పరిమితమైంది. తమ జట్టు ఓడిపోవడంపై ఇప్పటికే షాహిద్‌ అఫ్రిది తీవ్ర అసహనం వ్యక్తంచేశాడు. అయితే, యువీతో సంభాషించిన వీడియోలో మాత్రం ‘ఇరు జట్ల’కూ గెలుపు అవకాశాలు ఉన్నట్లు వ్యాఖ్యానించాడు. పాక్ కేవలం 40 పరుగులు చేయాల్సిన సమయంలో ‘మీ జట్టు గెలుస్తోంది. అఫ్రిది మీకు కంగ్రాట్స్‌’ అని యువీ అన్నాడు. అయితే, పాకిస్థాన్‌ విజయానికి ఆరు పరుగుల దూరంలో ఆగిపోయింది. ఈసందర్భంగా మరోసారి షాహిద్‌తో యువీ మాట్లాడుతూ.. 

యువరాజ్‌: భయ్యా.. ఏమైంది? ఎందుకు అలా బాధగా ఉన్నావు?

అఫ్రిది: నేను బాధపడటం కూడా సరైంది కాదా? ఈ మ్యాచ్‌లో మేం ఓడిపోతాం అనుకున్నామా? కేవలం 40 పరుగులు చేయాల్సిన క్రమంలో నువ్వు (యువీ) ఏం చెప్పావు. ‘భయ్యా కంగ్రాట్స్‌. నేను వెళ్లిపోతున్నా. మిగిలిన మ్యాచ్‌ చూడను’ అని అన్నావు. అప్పుడు ‘40 పరుగులు తక్కువేం కాదు. ముందే నాకు శుభాకాంక్షలు చెప్పాల్సిన అవసరం లేదు’ అని అన్నా’’

యువరాజ్‌: అవును. నేను పాక్‌ గెలుస్తుందని నీతో చెప్పా. కానీ, అప్పటికీ భారత్‌ విజయం సాధిస్తుందనే నమ్మకంతోనే ఉన్నా. అయితే, క్రీడల్లో గెలుపోటములు సహజం. ముందుకుసాగుతూ పోవడం అత్యంత ముఖ్యం’’.

పాక్‌కు మద్దతు తెలపను: వసీమ్ అక్రమ్‌

‘‘ఎవరు ఏమనుకున్నా.. ఇకనుంచి మా జట్టుకు మద్దతుగా నిలవను. ఇక చాలు. వారికి అండగా నిలిచినంతవరకు చాలు. ఇక ఎవరు ఏమనుకున్నా భయపడను. ఇది నెట్టింట వైరల్‌గా మారినా సరే పట్టించుకోను. జట్టు గురించి ఏమన్నా మాట్లాడితే చాలు విమర్శలు చేసేవాళ్లు సిద్ధంగా ఉన్నారు. అసలు జట్టులోని ఒకరితో మరొకరికి పడనట్లే అనిపిస్తోంది. ఏం జరుగుతోంది? మీరంతా దేశం కోసం ఆడుతున్నారని గుర్తించండి. ప్రతి ఒక్కదానికి పరిమితి ఉంటుంది. ఇకనైనా మీ మధ్య ఉన్నవాటిని పక్కన పెట్టేసి జట్టు కోసం ఆడండి’’ అని పాక్‌ మాజీ క్రికెటర్ వసీమ్‌ అక్రమ్‌ వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని