యువీ.. రిటైర్‌మెంట్‌ వెనక్కి!

టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ల హీరో యువరాజ్‌ సింగ్‌ అభిమానులకు శుభవార్త. అతడు రిటైర్‌మెంట్‌ను వెనక్కి తీసుకోనేందుకు నిర్ణయించుకున్నాడని సమాచారం. అంతర్జాతీయం కాకుండా దేశవాళీ క్రికెట్లో పంజాబ్‌ తరఫున టీ20 క్రికెట్‌ ఆడేందుకు మొగ్గు చూపుతున్నాడని తెలిసింది....

Published : 09 Sep 2020 20:11 IST

పునరాగమనంపై దాదా, షాకు ఈమెయిల్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ల హీరో యువరాజ్‌ సింగ్‌ అభిమానులకు శుభవార్త. అతడు రిటైర్‌మెంట్‌ను వెనక్కి తీసుకోనేందుకు నిర్ణయించుకున్నాడని సమాచారం. అంతర్జాతీయం కాకుండా దేశవాళీ క్రికెట్లో పంజాబ్‌ తరఫున టీ20 క్రికెట్‌ ఆడేందుకు మొగ్గు చూపుతున్నాడని తెలిసింది. తన పునరాగమనానికి అనుమతి ఇవ్వాలని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, కార్యదర్శి జే షాకు ఈమెయిల్‌ పంపించాడని సంబంధిత వర్గాలు అంటున్నాయి.

యువరాజ్‌ సింగ్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలికి ఏడాదిన్నర గడిచింది. ఈ సమయంలో విదేశీ టీ20 లీగుల్లో ఆడాడు. అయితే పోటీ క్రికెట్‌ కాకుండా సరదా కోసమే ఆడుతానని చెప్పాడు. కొన్నాళ్లుగా అతడు శుభ్‌మన్‌ గిల్‌, అభిషేక్‌ శర్మ, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌, అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌కు మొహాలీలోని పీసీఏ స్టేడియంలో పంజాబ్‌ సంఘం తరఫున వారికి మార్గనిర్దేశం చేస్తున్నాడు. ఈ క్రమంలో స్వయంగా బ్యాటు పట్టుకొని నెట్స్‌లో షాట్లు ఎలా ఆడాలో నేర్పించాడు. అప్పుడు అద్భుతంగా బంతిని బాదుతున్నానని యువీకి అనిపించింది. మరో శిబిరంలో అలాగే చేయడంతో పంజాబ్‌ కార్యదర్శి పునీత్‌ బాలి అతడిని కలిశాడు. వీడ్కోలు వెనక్కి తీసుకోవాలని కోరాడని తెలిసింది. దాని గురించి కొన్ని వారాలు ఆలోచించిన యువీ అనుమతి కోరుతూ బీసీసీఐకి ఈమెయిల్‌ పంపించాడు. ‘క్రిక్‌ బజ్‌’తో జరిపిన సంభాషణలో యువరాజ్‌ సింగ్‌ స్వయంగా ఈ విషయం చెప్పడం గమనార్హం.

‘యువకులతో సమయం గడపడం, ఆట పరంగా విభిన్న అంశాలు వారికి నేర్పించడం చాలా బాగుంది. నెట్స్‌లో వారికి కొన్ని షాట్లు చూపించాను. బంతిని అద్భుతంగా బాదుతుండటంతో నాపై నాకే ఆశ్చర్యం వేసింది. అప్పటికే నేను బ్యాటింగ్‌ చేసి చాలా కాలమైంది. రెండు నెలలు పంజాబ్‌ తరఫున ఆఫ్‌ సీజన్‌ శిబిరానికి వచ్చాను. యువకులతో కలిసి సాధన మ్యాచులు ఆడాను. పరుగులు తీశాను. అప్పుడు పంజాబ్‌ కార్యదర్శి పునీత్‌ బాలీ నా వద్దకొచ్చి వీడ్కోలు వెనక్కి తీసుకోవడాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు’ అని యువీ చెప్పాడు.

‘మొదట్లో అనిపించలేదు కానీ తర్వాత ఆలోచిస్తే ప్రతిపాదన నచ్చింది. పంజాబ్‌కు ఛాంపియన్‌షిప్‌లు అందించాలని ప్రేరణ కలిగింది. భజ్జీ, నేనూ వేర్వేరుగా ఎన్నో గెలిచాం. కానీ ఇద్దరం కలిసి పంజాబ్‌కు ఏం చేయలేకపోయాం. అదే నన్ను నిర్ణయం తీసుకొనేందుకు పురికొల్పింది. అనుమతి వస్తే మాత్రం కేవలం టీ20లు మాత్రమే ఆడతాను. చూద్దాం, ఏం జరుగుతుందో’ అని యువీ అన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని