ఆసీస్‌ ఆరాటం.. యువరాజ్‌ పోరాటం

సరిగ్గా దశాబ్దం క్రితం అంటే మార్చి 24, 2011న వన్డే ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా, భారత్‌ మధ్య క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరిగింది.

Published : 24 Mar 2021 22:47 IST

                                                                               

ఇంటర్నెట్‌ డెస్క్‌: సరిగ్గా దశాబ్దం క్రితం అంటే మార్చి 24, 2011న వన్డే ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా, భారత్‌ మధ్య క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరిగింది. వరుసగా మూడుసార్లు కప్‌ గెలిచి నాలుగోసారి టైటిల్ కొట్టాలని ఆరాటపడిన ఆసీస్‌కు యువరాజ్‌ సింగ్‌ అద్భుతంగా పోరాడి భారీ షాక్‌ ఇచ్చాడు! ఈ మ్యాచ్‌లో కీలకమైన ఇన్నింగ్స్‌ ఆడిన యూవీ కంగారులను కంగుతినిపించాడు.

ఇక ఈ మ్యాచ్‌ వివరాల్లోకెళితే.. మొదటగా బ్యాటింగ్‌ చేసిన ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 260 పరుగులు చేసింది. ఛేదనకు దిగిన భారత ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్‌, సచిన్‌ టెందుల్కర్‌ మొదటి వికెట్ నష్టానికి 44 పరుగులు జోడించారు. 9 ఓవర్‌లో సెహ్వాగ్‌(15) ఔటయ్యాడు. గౌతమ్‌ గంభీర్‌తో కలిసి సచిన్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ ఎడపెడా బౌండరీలు బాదుతూ అర్ధ సెంచరీలు సాధించి వెనుదిరిగారు. అనంతరం ఆసీస్ బౌలర్లు పుంజుకుని వరుస విరామాల్లో వికెట్లు తీశారు. ఈ దశలో క్రీజులో ఉన్న యువరాజ్‌ సింగ్‌, సురేశ్‌ రైనాతో కలిసి 74 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దీంతో 14 బంతులు మిగిలుండగానే భారత్‌ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో యూవీ 65 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 57 పరుగుల సాధించి ఇండియాకు సూపర్‌ విక్టరీనందించాడు. ప్రపంచ కప్‌లో కంగారులను 24 ఏళ్ల తర్వాత భారత్‌ ఓడించడం ఈ మ్యాచ్‌లో ఉన్న విశేషం. ఈ మ్యాచ్‌కు ముందు ప్రపంచ కప్‌లో భారత్‌ ఆసీస్‌ చేతిలో వరుసగా ఐదుసార్లు ఓడింది.


 యూవీ జీవితంలో 2011 ప్రపంచకప్‌ మరపురానిది. ఎందుకంటే ఈ టోర్నీలో యూవీ 362 పరుగులు సాధించడంతోపాటు 15 వికెట్లు తీసి  ‘ప్లేయర్‌ ఆఫ్ ది టోర్నీ’గా నిలిచాడు. 28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం 2011లో ధోని నాయకత్వంలో భారత్ విశ్వవిజేతగా నిలిచింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని