Published : 09 May 2022 02:02 IST

Yuvraj Singh: 2007లో నేను కెప్టెన్‌ ఎందుకు అవ్వలేదంటే..? స్పష్టతనిచ్చిన యువీ

ఛాపెల్‌ విషయంలో సచిన్‌వైపే నిలిచా.. కెప్టెన్సీ రాకపోవడం బాధగా లేదు

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత క్రికెట్‌ చరిత్రలో యువరాజ్‌సింగ్‌ ప్రత్యేకమైన ఆటగాడు. టీమ్‌ఇండియాకు రెండు ప్రపంచకప్‌లు అందించడంలో కీలక పాత్ర పోషించాడు. అలాంటి ఆటగాడు కెప్టెన్సీ చేపట్టకపోవడం ఒకింత ఆశ్చర్యం కలిగించే అంశమే. అయితే, తాను 2007లోనే సారథ్య బాధ్యతలు చేపట్టాల్సి ఉన్నప్పటికీ.. కొన్ని పరిస్థితుల కారణంగా అది సాధ్యం కాలేకపోయిందని తాజాగా వెల్లడించాడు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యువరాజ్‌ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. గ్రేగ్‌ ఛాపెల్‌ కోచ్‌గా ఉన్న సమయంలో జరిగిన కొన్ని కీలక విషయాలనూ బయటపెట్టాడు.

‘టీమ్‌ఇండియాకు అప్పుడు నేను కెప్టెన్సీ చేపట్టే అవకాశం వచ్చింది. అదే సమయంలో గ్రేగ్‌ ఛాపెల్‌ వివాదం చోటుచేసుకుంది. అప్పుడు సచిన్‌, ఛాపెల్‌ల మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయి. దీంతో నేను సచిన్‌వైపే మొగ్గు చూపా. అది కొంతమంది బీసీసీఐ పెద్దలకు నచ్చలేదు. దీంతో నన్ను తప్ప ఎవరినైనా కెప్టెన్‌ చేయాలని వారు నిర్ణయించుకున్నట్లు నాకు తెలిసింది. అయితే.. అదెంతవరకు నిజమో నాకు తెలియదు. అప్పటికి వైస్‌ కెప్టెన్‌గా ఉన్న నన్ను ఉన్నట్టుండి తొలగించారు. 2007 ప్రపంచకప్‌ టోర్నీకి ముందు మేం ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లాం. అప్పుడు సెహ్వాగ్‌ జట్టులో లేడు. నేను వైస్‌ కెప్టెన్‌గా ఉన్నా. ద్రవిడ్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. దీంతో నేనే కెప్టెన్‌ అవ్వాల్సింది. కానీ, అనూహ్యంగా నన్ను కాదని ధోనీని ఎంపిక చేశారు. అది నాకు పూర్తిగా వ్యతిరేకమైన నిర్ణయం. అయినా, ఆ విషయంలో నేనెప్పుడూ బాధపడలేదు. అయితే, కొద్ది రోజుల తర్వాత ధోనీ కెప్టెన్సీ బాగా చేస్తున్నాడని అర్థం చేసుకున్నా. వన్డేల్లోనూ అతడే నాయకత్వం వహించాలని భావించా. అతడే సరైన నాయకుడని అనుకున్నా. తర్వాత నేను వరుసగా గాయాలపాలయ్యాను. దీంతో ఒకవేళ నన్ను కెప్టెన్‌గా చేసినా ఎక్కువ కాలం కొనసాగనని అనుకున్నా. ఏదైనా మన మంచికే జరుగుతుంది. అయితే, టీమ్‌ఇండియాకు నాయకత్వం వహించడం చాలా గొప్ప విషయంగా భావిస్తా. నేనెప్పుడూ జట్టు కోసమే ఆలోచిస్తా. అందుకే సచిన్‌కు మద్దతిచ్చా’ అని స్పష్టం చేశాడు.

కాగా, సచిన్‌ తన ‘బిలియన్‌ డ్రీమ్స్‌’ బయోపిక్‌లో ఛాపెల్‌తో జరిగిన వివాదం గురించి స్పష్టతనిచ్చాడు. 2007 టీ20 ప్రపంచకప్‌ జరగడానికి నెల రోజుల ముందు ఛాపెల్‌ తీసుకున్న కొన్ని నిర్ణయాలను చాలా మంది సీనియర్‌ ఆటగాళ్లు వ్యతిరేకించారని చెప్పాడు. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఏవేవో మార్పులు చేయడం తమకు నచ్చలేదని తెలిపాడు. అతడు తీసుకున్న నిర్ణయాల వల్ల జట్టు ఇబ్బందులు పడిందని గుర్తుచేసుకున్నాడు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని