భారత్‌, సచిన్‌ కోసం గెలవాలనుకున్నాం

2011 ఏప్రిల్‌ 2. భారత క్రికెట్‌లో అత్యంత కీలకమైన రోజు. 28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షిణకు తెరదించిన రోజు. సగటు భారత క్రికెట్‌ అభిమాని ఎన్నటికీ మరులేని రోజు. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్...

Published : 03 Apr 2021 01:24 IST

2011 వన్డే ప్రపంచకప్‌పై యువరాజ్‌ వీడియో..

ఇంటర్నెట్‌డెస్క్‌: 2011 ఏప్రిల్‌ 2. భారత క్రికెట్‌లో అత్యంత కీలకమైన రోజు. 28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షిణకు తెరదించిన రోజు. సగటు భారత క్రికెట్‌ అభిమాని ఎన్నటికీ మరులేని రోజు. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ తన కెరీర్‌ మొత్తం వేచిచూసిన రోజు. ధోనీ కొట్టిన సిక్సర్‌కు యావత్‌ భారతం సగర్వంగా సంబరాలు చేసుకున్న రోజు. అదే 2011 ఏప్రిల్‌ 2వ తేదీ.. అదే టీమ్‌ఇండియా రెండోసారి వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడిన రోజు. ఇది జరిగి నేటికి పదేళ్లు గడిచాయి. ఈ సందర్భంగా ఆ సిరీస్‌లో కీలక పాత్ర పోషించిన స్టార్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌సింగ్‌ కొద్దిసేపటి క్రితం స్పందించాడు. భారత దేశం, సచిన్‌ కోసం తాము కప్‌ గెలవాలనుకున్నామని చెప్పాడు.

‘మేం చివరిసారి ప్రపంచకప్‌ గెలిచి పదేళ్లు పూర్తయ్యాయి. ఈ సమయమంతా చాలా త్వరగా గడిచిపోయింది. ఆ రోజు టీమ్‌ఇండియా మొత్తం కచ్చితంగా కప్పు గెలవాలని అనుకున్నాం. ముఖ్యంగా సచిన్‌ కోసం. ఎందుకంటే అదే అతడికి చివరి ప్రపంచకప్‌ అని అందరికీ తెలుసు. అలాగే స్వదేశంలో ప్రపంచకప్‌ గెలవడం అంతకుముందు ఏ జట్టూ చేయలేనిది మేం చేయాలనుకున్నాం. ఆరోజు ఎంతో ప్రత్యేకమైంది. మాటల్లో చెప్పలేను. ఆ టోర్నీ మొత్తంలో పలువురు ఆటగాళ్లు గొప్ప ప్రదర్శనలు చేశారు. ఫైనల్లో ధోనీ, గౌతమ్‌ గంభీర్‌ రెచ్చిపోగా.. సిరీస్‌ మొత్తంలో సెహ్వాగ్‌, సచిన్‌ మంచి ఓపెనింగ్‌ భాగస్వామ్యాలు అందించారు. అలాగే జహీర్‌ ఖాన్‌ అత్యధిక వికెట్లు, నేను కొన్ని మంచి ప్రదర్శనలు చేశా’ అని యువీ గుర్తుచేసుకున్నాడు.

ఏ క్రికెటర్‌కైనా ప్రపంచకప్‌ సాధించడమనేది ప్రత్యేక సందర్భమని, ముఖ్యంగా చిన్న వయసులో టీమ్‌ఇండియాకు ఆడడం. అక్కడి నుంచి ప్రపంచకప్‌ గెలవడం అనేవి గొప్ప విశేషాలని యువరాజ్‌ చెప్పుకొచ్చాడు. ఇదో చారిత్రకమైన రోజని, దీన్ని సచిన్‌, వీరూతో సహా నాటి జట్టు సభ్యులతో కలిసి జరుపుకోవాలనుకున్నట్లు మాజీ ఆల్‌రౌండర్‌ పేర్కొన్నాడు. అయితే, ప్రస్తుతం సచిన్‌, ఇర్ఫాన్‌, యూసుఫ్‌ వంటి నాటి ఆటగాళ్లు కరోనా బారిన పడటంతో వారిని కలవలేకపోతున్నట్లు బాధ పడ్డాడు. తన క్రికెట్‌ కెరీర్‌లో ఇంతకుమించిన సంతోషం ఏదీ లేదన్నాడు. ఈరోజును అభిమానులు గుర్తు చేసుకోవాలని అప్పటి ‘మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ ఆకాంక్షించాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని