Mohammed Siraj: అమెరికాతో మ్యాచ్‌.. స్పెషల్ గెస్ట్ చేతులమీదుగా సిరాజ్‌కు బెస్ట్ ఫీల్డర్ అవార్డు

అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో భారత పేసర్ మహ్మద్‌ సిరాజ్‌ బెస్ట్ ఫీల్డర్ అవార్డు అందుకున్నాడు. 

Published : 13 Jun 2024 19:44 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్‌ 2024లో భాగంగా అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. అంతేకాకుండా సూపర్‌-8 దశకు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత పేసర్ మహ్మద్‌ సిరాజ్‌ (Mohammed Siraj) బెస్ట్ ఫీల్డర్ అవార్డు అందుకున్నాడు. ఈసందర్భంగా ఓ ప్రత్యేక అతిథి సందడి చేశాడు. ఆ స్పెషల్ గెస్ట్ ఎవరో కాదు భారత మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్ (Yuvraj Singh). ఈ టీ20 వరల్డ్ కప్‌నకు యువీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. అమెరికాతో మ్యాచ్‌ అనంతరం యువరాజ్‌ టీమ్ఇండియా డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లి ఆటగాళ్లతో మాట్లాడాడు. నాలుగు వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచిన అర్ష్‌దీప్‌తోపాటు కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన సూర్యకుమార్, శివమ్‌ దూబెలను అభినందించాడు.   

బెస్ట్ ఫీల్డర్ అవార్డు కోసం సిరాజ్‌తోపాటు రిషభ్‌పంత్, సూర్యకుమార్ యాదవ్ నామినేట్ అయ్యారు. అయితే, బౌండరీ లైన్ వద్ద స్టన్నింగ్ క్యాచ్ అందుకున్న సిరాజ్‌కు అవార్డు దక్కింది. యువరాజ్‌ సింగ్ చేతులమీదుగా బెస్ట్ ఫీల్డర్ అవార్డు అందుకున్నాడు. ‘‘వన్డే ప్రపంచ కప్‌లో నేను 11 మ్యాచ్‌ల్లో ఆడాను. ఒక్కసారి కూడా మెడల్ అందుకోలేకపోయా. కానీ, హార్డ్ వర్క్‌ ఎప్పటికీ వృథా కాదు. తప్పకుండా ప్రతిఫలాన్ని ఇస్తుంది’’ అని అవార్డు అందుకున్న తర్వాత సిరాజ్ అన్నాడు. 

అమెరికాపై సిరాజ్‌ వికెట్లు పడగొట్టకపోయినా మంచి క్యాచ్‌లు అందుకుని ఆరోన్‌ జోన్స్, నితీశ్‌ కుమార్‌లను వెనక్కి పంపాడు. జస్‌దీప్‌ను రనౌట్ చేశాడు. అర్ష్‌దీప్ వేసిన 15వ ఓవర్‌లో నాలుగో బంతికి నితీశ్ కుమార్ (27; 23 బంతుల్లో) భారీ షాట్ ఆడి సిరాజ్‌కు చిక్కాడు. డీప్‌ మిడ్‌ వికెట్‌లో బౌండరీ లైన్‌ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న సిరాజ్‌.. బంతి తన కంటే ఎక్కువ ఎత్తులో రావడంతో జంప్ చేసి బంతిని ఒడిసిపట్టాడు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని