Yuvraj Singh : యువీ.. సంచలన సిక్సులకు 14 ఏళ్లు

భారత ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టి సృష్టించిన చరిత్రకు ఆదివారంతో 14 ఏళ్లు నిండాయి. టీ20 ప్రపంచకప్‌ పోటీల్లో భాగంగా 2007 సెప్టెంబర్ 19న దర్బన్‌లో జరిగిన ఓ..

Published : 20 Sep 2021 01:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టి సృష్టించిన చరిత్రకు ఆదివారంతో 14 ఏళ్లు నిండాయి. టీ20 ప్రపంచకప్‌ పోటీల్లో భాగంగా 2007 సెప్టెంబర్ 19న దర్బన్‌లో జరిగిన ఓ మ్యాచులో యువీ అరుదైన రికార్డు నమోదు చేశాడు. ఇంతకీ ఆ మ్యాచ్‌లో ఏమైందంటే.. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ 18 ఓవర్లు ముగిసే సరికి 171/3 స్కోరుతో పటిష్ట స్థితిలో నిలిచింది. అప్పటికీ భారత్‌ చేతిలో ఏడు వికెట్లు ఉన్నాయి. క్రీజులో ఉన్న యువరాజ్‌ సింగ్‌, ఎంఎస్‌ ధోనిలు డెత్‌ ఓవర్లలో వీలైనన్న పరుగులు రాబట్టి ఇంగ్లాండ్‌ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్‌ బౌలర్‌ ఆండ్రూ ఫ్లింటాఫ్‌ బౌలింగ్‌ చేస్తున్న సమయంలో యువీతో వాగ్వాదానికి దిగాడు. ఆ తర్వాత 19వ ఓవర్‌ వేయడానికి బంతి అందుకున్న స్టువర్ట్ బ్రాడ్‌ కూడా మాటలతో అతడిని కవ్వించాడు. దీంతో రెచ్చిపోయిన యువీ.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 19వ ఓవర్‌ మొదటి బంతి నుంచే సిక్సుల వర్షం కురిపించడం మొదలుపెట్టాడు. బ్రాడ్‌ వేసిన మొదటి బంతిని డీప్ మిడ్‌ వికెట్‌ మీదుగా సిక్సర్‌గా మలిచిన యువీ.. తర్వాతి బంతిని బ్యాక్‌వర్డ్‌ స్క్వేర్‌ లెగ్‌ మీదుగా బౌండరీకి తరలించాడు. ఇక మూడో బంతిని లాంగ్‌ ఆఫ్‌ దిశగా, ఫుల్‌ టాస్‌గా వచ్చిన నాలుగో బంతిని డీప్‌ పాయింట్‌లోకి బాది భారీ సిక్సర్‌ మలిచాడు. యువీ జోరును ఎలా కట్టడి చేయాలో తోచక బ్రాడ్‌ దిక్కులు చూస్తూ నిలబడిపోయాడు. స్క్వేర్‌ లెగ్‌ దిశగా ఐదో బంతిని, ఆరో బంతిని లాంగాన్‌కు పంపిన యువీ.. టీ20 చరిత్రలో మొదటిసారిగా ఆరు బంతుల్లో ఆరు సిక్సులు బాదిన ఆటగాడిగా నిలిచాడు. దీంతో నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి భారత్‌ 218 పరుగులు చేసి ప్రత్యర్థి జట్టు ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. అనంతరం ఛేదనకు దిగిన ఇంగ్లాండ్‌ ఆరు వికెట్లు కోల్పోయి 200 పరుగులకు పరిమితమైంది. దీంతో భారత్‌ 18 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని