Yuvi - Kohli : విరాట్.. నువ్వొక సూపర్‌ స్టార్‌.. యువీ భావోద్వేగపూరిత పోస్ట్

క్రికెట్‌ పట్ల అంకితభావం, క్రమశిక్షణతో విరాట్ కోహ్లీ భవిష్యత్తు తరాలకు...

Updated : 22 Feb 2022 14:55 IST

ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్‌ పట్ల అంకితభావం, క్రమశిక్షణతో విరాట్ కోహ్లీ భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా నిలిచాడని టీమ్‌ఇండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ అభినందించాడు. మాజీ సారథి విరాట్ కోహ్లీని ఉద్దేశిస్తూ యువీ భావోద్వేగపు లేఖను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. 2019లో యువరాజ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు  పలికాడు. ఐపీఎల్‌లోనూ కోహ్లీ సారథ్యంలోని రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున యువీ ఆడాడు. ఈ క్రమంలో కోహ్లీతో తనకున్న అనుబంధాన్ని యువరాజ్‌ గుర్తు చేసుకున్నాడు.

‘‘విరాట్... నువ్వు క్రికెటర్‌గానే కాకుండా వ్యక్తిత్వపరంగా ఎదిగిన తీరును చూశా. ఓ కుర్రాడిగా నెట్‌ సెషన్‌లో టీమ్ఇండియా దిగ్గజ క్రికెటర్లతో కలిసి నడిచావు. రాబోయే నూతన తరాల వారికి మార్గం చూపుతూ ఇప్పుడు నువ్వు కూడా లెజెండ్‌గా మారావ్‌. నెట్స్‌లో నీ క్రమశిక్షణ.. మైదానంలో మక్కువ, ఆట పట్ల అంకితభావంతో ఏదో ఒక రోజు బ్లూ జెర్సీ ధరించాలని కలలు కనే యువతకు స్ఫూర్తినిచ్చావు. ప్రతి సంవత్సరం అద్భుతమైన క్రికెట్‌తో ఉన్నత స్థానాలకు గేమ్‌ను తీసుకెళ్లావు. నువ్వొక దిగ్గజ సారథివి. ఫెంటాస్టిక్‌ లీడర్‌. ఆట పట్ల నీలోని అగ్నిని అలానే రగిలిస్తూ ఉంచు. కోహ్లీ నువ్వు సూపర్‌ స్టార్‌. నీకు బహుమతిగా ప్రత్యేకమైన గోల్డెన్‌ బూట్‌. ఎల్లవేళలా దేశం గర్వపడేలా చేస్తూనే ఉండు. జట్టులో సహచరుడిగానే కాకుండా ఓ స్నేహితుడిగా మన అనుబంధం గురించి చెప్పడం ఆనందంగా ఉంది. పరుగులు చేయడం, చీటింగ్‌ మీల్స్‌, పంజాబీ పాటలను ఆలకించడం, కప్‌లను సొంతం చేసుకోవం.. ఇలా ప్రతి విషయమూ ప్రత్యేకమే. నీవు ప్రపంచానికి కింగ్‌ కోహ్లీవీ కావొచ్చు.. కానీ.. నాకు మాత్రం ‘చీకు’వే’’ అంటూ యువీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని