Yuvraj Singh: ఇతరులతో పోలిస్తే కోహ్లీ నాలుగింతలు కష్టపడతాడు: యువీ

బెంగళూరు మాజీ సారథి విరాట్‌ కోహ్లీ ఇతరులతో పోలిస్తే నాలుగింతలు కష్టపడతాడని, అతడు మునుపటిలా స్వేచ్ఛగా ఆడితే తిరిగి గాడిలో పడతాడని టీమ్‌ఇండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ అన్నాడు...

Published : 30 Apr 2022 02:18 IST

(Photo: Yuvraj Singh Instagram)

ఇంటర్నెట్‌డెస్క్‌: బెంగళూరు మాజీ సారథి విరాట్‌ కోహ్లీ ఇతరులతో పోలిస్తే నాలుగింతలు కష్టపడతాడని, అతడు మునుపటిలా స్వేచ్ఛగా ఆడితే తిరిగి గాడిలో పడతాడని టీమ్‌ఇండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ అన్నాడు. కోహ్లీ ప్రస్తుతం జరుగుతోన్న 15వ సీజన్‌లో ఏమాత్రం ఆకట్టుకోలేకపోతున్న సంగతి తెలిసిందే. అతడు ఆడిన 9 మ్యాచ్‌ల్లో కేవలం 128 పరుగులే చేసి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే యువీ ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గత 15 ఏళ్లలో కోహ్లీలా కష్టపడే ఆటగాడిని చూడలేదని చెప్పాడు.

‘విరాట్‌ ఇప్పుడు తన ప్రదర్శనతో సంతృప్తిగా లేడు. ఇతరులు కూడా ఈ విషయంలో సంతోషంగా లేరు. ఎందుకంటే అతడెంత పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకున్నాడో మనం చూశాం. సెంచరీల మీద సెంచరీలు కొట్టేవాడు.. ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాడు. ఎంతగొప్ప క్రికెటర్‌కైనా ఇలా అప్పుడప్పుడు జరుగుతుంది. అలాంటప్పుడు కోహ్లీ తిరిగి రాణించాలంటే ఇంతకుముందులా స్వేచ్ఛగా ఆడాలి. తనని తాను మార్చుకొని పాత కోహ్లీలా మారిపోతే.. అతడేంటో చూపిస్తాడు. ఈ తరం క్రికెటర్లలోనే మేటి బ్యాట్స్‌మన్ అని నిరూపించుకున్నాడు. అలాగే ఆట పట్ల ఎంత నిబద్ధతతో ఉంటాడో కొన్నేళ్లుగా చూస్తూనే ఉన్నాం’ అని యువరాజ్‌ వివరించాడు.

నెహ్రాకు శుభాకాంక్షలు..

అలాగే యువరాజ్‌.. గుజరాత్‌ బౌలింగ్‌ కోచ్‌ ఆశిష్‌ నెహ్రాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు. అతడితో కలిసున్న ఫొటోలు, పాత జ్ఞాపకాలను నెమరవేసుకున్నాడు. ఆ వీడియోలోనే విమానంలో ఒకసారి నెహ్రాకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన అరుదైన సన్నివేశాన్ని కూడా అభిమానులతో పంచుకున్నాడు. ఆ వీడియో ఇక్కడ చూడండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని