Yuvraj singh: వచ్చే జన్మలో.. 12వ ఆటగాడిగా లేకుంటే..

టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ల హీరో యువరాజ్‌ సింగ్‌ మరోసారి జట్టు యాజమాన్యంపై హాస్యం కనబరుస్తూనే విమర్శించాడు. సుదీర్ఘ ఫార్మాట్లో.....

Published : 23 May 2021 01:35 IST

టెస్టు క్రికెట్లో మరిన్ని అవకాశాలు దొరుకుతాయేమో అన్న యువీ

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ల హీరో యువరాజ్‌ సింగ్‌ మరోసారి జట్టు యాజమాన్యంపై హాస్యం కనబరుస్తూనే విమర్శించాడు. సుదీర్ఘ ఫార్మాట్లో తనకు తగినన్ని అవకాశాలు ఇవ్వలేదని చెప్పకనే చెప్పాడు. బహుశా వచ్చే జన్మలో 12వ ఆటగాడిగా ఏడేళ్లు లేకుంటే మరిన్ని అవకాశాలు వస్తాయేమోనని అన్నాడు. విజ్డెన్‌ ఇండియా పెట్టిన ఓ ట్వీట్‌కు అతడిలా జవాబిచ్చాడు.

ప్రపంచం మెచ్చిన ఆల్‌రౌండర్లు, మ్యాచు విజేతల్లో యువీ ఒకడన్న సంగతి తెలిసిందే. అన్ని విభాగాల్లో అతడు ఐసీసీ టైటిళ్లు అందుకోవడం గమనార్హం. ముఖ్యంగా 2011 వన్డే ప్రపంచకప్‌లో అతడి మెరుపులను ఎవ్వరూ మర్చిపోలేరు. క్యాన్సర్‌ బాధిస్తున్నా.. కడుపు నొప్పి వేధిస్తున్నా అతడు జట్టుకు అండగా నిలిచాడు. బ్యాటు, బంతితో రాణించాడు. ఇక 2007 టీ20 ప్రపంచకప్‌లో అతడు చెలరేగిన తీరు.. ఆరు సిక్సర్లు కొట్టిన విధానానికి అందరూ ఫిదా అయ్యారు. పరిమిత ఓవర్ల క్రికెట్లో విపరీతంగా ఆడిన యువీకి టెస్టు క్రికెట్లో తగినన్ని అవకాశాలు రాలేదు. 40 టెస్టులు మాత్రమే ఆడాడు.

‘టీమ్‌ఇండియాలో ఏ క్రికెటర్‌ మరిన్ని టెస్టు మ్యాచులు ఆడాల్సిందని మీరు కోరుకుంటున్నారు?’ అని విజ్డెన్‌ ఇండియా ట్విటర్లో ప్రశ్నించింది. అభిమానులతో పాటు యువీ సైతం ఈ ట్వీట్‌కు స్పందించాడు. ‘బహుశా వచ్చే జన్మలో! అదీ జట్టులో 12వ ఆటగాడిగా ఏడేళ్లు లేనప్పుడు’ అని భిన్నంగా బదులిచ్చాడు. జట్టు  యాజమాన్యం తుది జట్టులో తీసుకోలేదని పరోక్షంగా విమర్శించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని