Published : 03/11/2021 01:36 IST

Yuvi In InstaGram: క్రికెట్‌లోకి పునరాగమనం!.. యువీ సంచలన పోస్టు

ఇంటర్నెట్‌ డెస్క్‌: రెండేళ్ల కిందట అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌, స్టార్‌ బ్యాటర్‌ యువరాజ్‌ సింగ్‌ సామాజిక మాధ్యమాల్లో ఒక్కసారిగా వైరల్‌గా మారాడు.  ‘‘వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మళ్లీ పిచ్‌ మీదకు వస్తున్నా’’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టాడు. దీంతో యువీ అభిమానులు సహా యావత్‌ క్రికెట్ ప్రపంచం ఆశ్చర్యానికి గురైంది. యువీ మళ్లీ క్రికెట్‌లోకి పునరాగమనం చేస్తున్నాడా..? అంటూ చర్చించుకుంటున్నారు. క్రికెటర్‌గానా.. వ్యాఖ్యాతగానా? అంటూ పలువురు విశ్లేషిస్తున్నారు. 2007 టీ20 ప్రపంచకప్‌, 2011 ప్రపంచకప్‌లో తన ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన యువీ 2019 జూన్‌లో అంతర్జాతీయంగా అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్‌మెంట్‌ను ప్రకటించాడు. ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదిన యువీ.. క్రీజ్‌లో ఉన్నాడంటే విజయంపై ప్రత్యర్థి ఆశలు వదులుకోవాల్సిందే. ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ నుంచి విరామం తర్వాత ఐపీఎల్‌ సహా వివిధ లీగ్‌ పోటీల్లో ఆడుతున్నాడు.  అయితే గత రెండు సీజన్ల నుంచి ఐపీఎల్‌లోనూ ప్రాతినిధ్యం వహించలేదు. ఈ క్రమంలో యువీ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. ‘‘దేవుడే విధిని నిర్ణయిస్తాడు. అభిమానులు, ప్రజల డిమాండ్‌ మేరకు ఫిబ్రవరిలో పిచ్‌ మీదకు వస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. అయితే ఇందులో ఎలాంటి ఫీలింగ్‌ లేదు. మీ అందరి ప్రేమ, శుభాకాంక్షలకు ధన్యవాదాలు. మద్దతు ఇస్తూనే ఉండండి. ఇది మన జట్టు. నిజమైన అభిమాని కష్టసమయాల్లో మద్దతుగా నిలుస్తారు. జైహింద్’’ అంటూ పోస్ట్‌ చేశాడు. అయితే 39 ఏళ్ల యువరాజ్‌ సింగ్‌ మళ్లీ జాతీయ జట్టులోకి రావడం కష్టమేనని, ఐపీఎల్‌లో ఆడే అవకాశాలను కొట్టిపారేయలేమని.. అలానే క్రికెట్ వ్యాఖ్యాతగానూ మారే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

యువరాజ్‌సింగ్‌ 2000వ సంవత్సరంలో టీమ్‌ఇండియా జట్టులోకి వచ్చాడు. దాదాపు 19 ఏళ్లపాటు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 40 టెస్టుల్లో 1,900 పరుగులు, 10 వికెట్లు.. 304 వన్డేల్లో 8,701 పరుగులు, 111 వికెట్లను పడగొట్టాడు. టీ20ల్లో 58 మ్యాచులకుగాను 1,177 పరుగులు చేశాడు. బౌలింగ్‌లోనూ ఫర్వాలేదనించి 29 వికెట్లు తీశాడు. 2002వ సంవత్సరంలో టీమ్‌ఇండియా నాట్‌వెస్ట్‌ సిరీస్‌ను కైవసం చేసుకోవడంలో యువీ కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లాండ్‌తో లార్డ్స్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారీ లక్ష్యాన్ని కైఫ్‌తో కలిసి యువీ ఛేదించడం.. అప్పటి కెప్టెన్‌ సౌరభ్ గంగూలీ చొక్కా విప్పి గిరగిరా తిప్పడం ఎన్నటికీ మరువలేం. ఆ మ్యాచ్‌లో 325 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 24 ఓవర్లలో 146/5తో కష్టాల్లో ఉన్న భారత్‌ను కైఫ్‌ (87*) తో కలిసి యువీ (69) సెంచరీ భాగస్వామ్యంతో విజయబాట పట్టించాడు. అలానే 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ బౌలర్‌ సువర్ట్‌ బ్రాడ్‌ బౌలింగ్‌లో ఆరు సిక్సర్లు బాదడం గుర్తు ఉండే ఉంటుంది. యువీని ఇంగ్లాండ్‌ ఆటగాడు ఆండ్రూ ఫ్లింటాప్‌ కవ్వించడంతో పాపం బ్రాడ్‌ బలయ్యాడు. ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదడంతోపాటు కేవలం 12 బంతుల్లోనే అర్ధశతకం సాధించిన యువరాజ్‌ సింగ్‌(58) సరికొత్త రికార్డును సృష్టించాడు.


Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని