Abhishek Sharma: డకౌట్‌ అయినా యువరాజ్‌ సంతోషించారు: అభిషేక్‌ శర్మ

అరంగేట్ర మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగినా తన మెంటార్‌ యువరాజ్‌  సంతోషించారని అభిషేక్‌ శర్మ అన్నాడు. 

Published : 08 Jul 2024 21:13 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: జింబాబ్వేతో (Zimbabwe) జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో (T20) ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (Abhishek Sharma) డకౌట్‌గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌-2024లో సన్‌రైజర్స్‌ తరఫున అద్భుత ప్రదర్శన చేసి.. టీ20ల్లోకి అడుగుపెట్టిన ఈ 23 ఏళ్ల ఈ కుర్రాడు.. తొలి మ్యాచ్‌లోనే నిరాశపరచడం అభిమానులను కాస్త కలవరపెట్టింది. కానీ, ఆయన మెంటార్ యువరాజ్‌ సింగ్‌ (Yuvaraj Singh) మాత్రం చాలా సంతోషపడ్డారట. అరంగేట్ర మ్యాచ్‌లో కాస్త తడబాటుకు గురవ్వడం సహజమేనని.. ఇది మంచి ప్రారంభమని భరోసా ఇచ్చారట. ఈ మేరకు అభిషేక్‌ శర్మ మాట్లాడిన ఓ వీడియోను బీసీసీఐ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది. ‘‘ యువరాజ్‌తో మాట్లాడాను. నేను డకౌట్ అయినా.. ఆయన ఎందుకు సంతోషించారో ఇప్పటికీ తెలియదుగానీ, మంచి ప్రారంభం అని ప్రోత్సహించారు. నా కుటుంబ సభ్యుడిలా గర్వంగా ఫీల్‌ అయ్యారు.’’ అని అభిషేక్‌ చెప్పుకొచ్చాడు.

అదే మైదానంలో జరిగిన రెండో మ్యాచ్‌లో అభిషేక్‌ విశ్వరూపం చూపించాడు. కేవలం 47 బంతుల్లోనే 100 పరుగులు పూర్తి చేసి.. అంతర్జాతీయ టీ20ల్లో తొలి సెంచరీని నమోదు చేసుకున్నాడు. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. యువరాజ్‌ సింగ్‌కు కృతజ్ఞతలు చెప్పాడు. మెంటార్‌గా ఆయన తన క్రికెట్‌ నైపుణ్యాలను మాత్రమే మెరుగు పరచలేదని, వ్యక్తిగత జీవితంలోనూ మార్గదర్శిగా నిలిచారని అన్నాడు. ‘‘ ఈ క్రెడిట్‌ అంతా యువరాజ్‌కే దక్కుతుంది. రెండు మూడేళ్లపాటు ఆయన చూపించిన శ్రద్ధవల్లే ఇలా ఉన్నాను. కేవలం క్రికెట్‌లో మెళకువలు నేర్పడమే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ వెన్నంటి నిలిచారు. మ్యాచ్‌ అనంతరం ఫోన్‌ చేస్తే.. బాగా ఆడావు. చాలా గర్వంగా ఉంది. ఇది ప్రారంభం మాత్రమే. ఇలాంటి ఇన్నింగ్స్‌ భవిష్యత్‌లో ఎన్నో ఆడాలి’’ అని ప్రోత్సహించారని ఆదివారం మ్యాచ్ ముగిసిన తర్వాత అభిషేక్‌ శర్మ అన్నాడు.

యువరాజ్‌ లాగనే అభిషేక్‌ శర్మ కూడా ఆల్‌రౌండర్‌. లెఫ్ట్‌ హ్యాండ్‌ స్పిన్నర్‌. అలవోకగా సిక్సర్లు కొట్టగలడు. అందుకే యువరాజ్‌ను అభిషేక్‌ మెంటార్‌గా భావిస్తుంటాడు. ఆయన కూడా తన అనుభవంతో విలువైన సూచనలు, సలహాలు ఇస్తుంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని