Virat Kohli: కోహ్లీ నన్ను ఎప్పుడూ మార్చడానికి ప్రయత్నించలేదు: చాహల్‌

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మాజీ సారథి విరాట్‌ కోహ్లీ తనని ఎప్పుడూ మార్చడానికి ప్రయత్నించలేదని లెగ్‌స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్‌ అన్నాడు...

Published : 03 Feb 2022 16:57 IST

(Photo: Chahal Instagram)

ఇంటర్నెట్‌డెస్క్‌: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మాజీ సారథి విరాట్‌ కోహ్లీ తనని ఎప్పుడూ మార్చడానికి ప్రయత్నించలేదని లెగ్‌స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్‌ వెల్లడించాడు. తాజాగా అతడు రవిచంద్రన్‌ అశ్విన్‌తో యూట్యూబ్‌లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ తనకెప్పుడూ అండగా నిలిచాడని, అయితే.. తన బౌలింగ్‌ను ఎప్పుడూ మార్చుకోమని చెప్పలదేని పేర్కొన్నాడు.

‘కోహ్లీకి చాలా సానుకూలమైన ఆలోచనా ధోరణి ఉందని నమ్ముతాను. అతడెప్పుడూ నన్ను మార్చడానికి ప్రయత్నించలేదు. నువ్వు ఇలా బౌలింగ్‌ చెయ్‌.. అలా బౌలింగ్‌ చెయ్‌ అని కూడా చెప్పలేదు. అయితే, అతడి వద్ద ఎప్పుడూ రెండు ప్రణాళికలు ఉన్నాయి. మొదటిది నాకే అవకాశం ఇచ్చి ఇష్టమొచ్చినట్లు ఫీల్డింగ్‌ సెట్‌ చేసుకోమని చెప్పేవాడు. బౌలింగ్ చేసేది నేనే కనుక అలా చెప్పడం వల్ల నాకు కావాల్సిన విధంగా ఫీల్డింగ్‌ సెట్‌ చేసుకునే అవకాశం ఉండేది. అది నాకెంతో ఉపయోగపడేది. రెండో ప్లాన్‌లో తననే ఫీల్డింగ్‌ సెట్‌ చేయమని చెప్పేవాడిని. ఒక కెప్టెన్‌ అలా చేయడం వల్ల మనకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది’ అని చాహల్‌ వివరించాడు.

అలాగే తాను ఎప్పుడైనా ఎక్కువ పరుగులు ఇచ్చేటప్పుడు కూడా విరాట్‌ ఏమనేవాడు కాదని యుజీ గుర్తు చేసుకున్నాడు. అలాంటి సమయంలో బౌండరీ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్నా తనవద్దకు వచ్చి పర్లేదు నీ ప్రయత్నం నువ్వు చెయ్‌ అని అండగా నిలిచేవాడని పేర్కొన్నాడు. ఆర్సీబీ స్పిన్నర్‌గా తన ప్రయాణం అద్భుతంగా సాగిందని, ఈ ఎనిమిదేళ్లు మధురజ్ఞాపకంగా మిగిలిందని అతడు చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే రాబోయే మెగా వేలంపై స్పందిస్తూ.. అవకాశం వస్తే తాను మళ్లీ ఆర్సీబీ తరఫున ఆడడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. అయితే, ఒక ప్రొఫెషనల్‌ ఆటగాడిగా ఏ జట్టుకైనా ఆడేందుకు రెడీగా ఉన్నానన్నాడు. తనని ఈసారి ఏ జట్టు ఎంపిక చేసినా 100 శాతం న్యాయం చేయడానికే ప్రయత్నిస్తానన్నాడు. కాగా, చాహల్‌ 2011 నుంచి 2013 వరకు ముంబయి తరఫున ఆడగా తర్వాత నుంచి ఆర్సీబీలో ఆడాడు. ఈ క్రమంలోనే ఆ జట్టులో కీలక స్పిన్నర్‌గా సేవలందించాడు. అయితే, బెంగళూరు ఈసారి రిటెన్షన్‌ చేసుకోకపోవడంతో వేలంలో అడుగుపెట్టక తప్పలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని